రంజాన్ నెలలో సున్నీ ముస్లింలను టార్గెట్ చేస్తూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు ఆఫ్ఘనిస్తాన్ లో మసీదులపై దాడులు జరగగా.. తాజాగా మరో దాడి చోటు చేసుకుంది. కాబూల్ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం శక్తివంతమైన పేలుడు సంభవించడంతో 50 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలపై వరుస దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఖలీఫా సాహిబ్ మసీదులో తెల్లవారుజామున పేలుడు సంభవించిందని అంతర్గత మంత్రిత్వ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి బెస్ముల్లా హబీబ్ తెలిపారు, మృతుల సంఖ్య 10 అని అధికారికంగా ధృవీకరించారు. అయితే అక్కడి మీడియా మాత్రం ఆ సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని అన్నారు.
రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా ఖలీఫా సాహిబ్ మసీదు కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. సున్నీ ముస్లింలే లక్ష్యంగా ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు. సున్నీ మసీదులోని ఆరాధకులు శుక్రవారం ప్రార్థనల తర్వాత జిక్ర్ కోసం గుమిగూడిన సమయంలో ఈ దాడి జరిగింది. మసీదు పెద్ద సయ్యద్ ఫాజిల్ అఘా మాట్లాడుతూ.. ఆత్మాహుతి బాంబర్ తమతో కలిసి ఉన్నాడని.. ఆ తర్వాత తనను తాను పేల్చుకున్నాడని తెలిపాడు. “నల్లటి పొగ ప్రతిచోటా వ్యాపించింది, మృతదేహాలు ప్రతిచోటా ఉన్నాయి,” అతను చెప్పాడు. చనిపోయిన వారిలో తన మేనల్లుడు కూడా ఉన్నాడని, ఎంతో ప్రియమైన వారిని కోల్పోయానన్నాడు.