More

  కొనసాగుతున్న ఈడీ దాడులు.. చైనా కంపెనీలకు చుక్కలే..!!

  డ్రాగన్ దేశమే కాదు.. ఆ దేశానికి చెందిన కంపెనీలు కూడా భారత్ ను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాయి. పన్ను ఎగవేతలో చైనా కంపెనీలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. వీటిపై ఫోకస్ పెట్టిన ఈడీ కొరడా ఝులిపిస్తోంది.

  అడ్డమైన సాకులతో ట్యాక్స్ లు కట్టకుండా తప్పించుకుంటున్న చైనా కంపెనీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చుక్కలు చూపిస్తోంది. దేశ వ్యాప్తంగా చైనా మొబైల్ కంపెనీలపై ఈడీ దాడులు చేస్తోంది. ఆయా కంపెనీల రికార్డులను నిశితంగా పరిశీలిస్తోంది. ఎమ్ఐ కంపెనీలతో పాటు ఒప్పో, వీవో కార్యాలయాలపై ఈడీ దాడులు చేస్తోంది.

  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో వరుస దాడులు చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ బంజారాహిల్స్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈడీ దాడులు చేస్తున్న లిస్టులో చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో కూడా ఉండటం గమనార్హం. ఒప్పో ప్రధాన కార్యాలయాలపై ఈడీ దాడులు, సోదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం, నిబంధనల ఉల్లంఘనలపై ఫైనాన్షియల్ వాచ్‌డాగ్ ముమ్మర దర్యాప్తు చేస్తుంది. చైనా మొబైల్ కంపెనీల‌తో ప్ర‌త్య‌క్ష, ప‌రోక్ష సంబంధాలు క‌లిగిన 44 సంస్థలలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. వివో, ఒప్పోతో పాటు అనుబంధ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గ‌తంలో ఈడీ ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద షియామికి చెందిన ఆస్తుల‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది.

  మరో చైనా మొబైల్‌ కంపెనీ వివోపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు జరిపింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌లతో పాటు పలు దక్షిణాదిరాష్ట్రాల్లో సోదాలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ అనేది స్మార్ట్‌ ఫోన్‌లను వ్యక్తిగతంగా గుర్తించేందుకు వినియోగించే ప్రత్యేకమైన 15 అంకెల కోడ్‌. 2020లో మీరట్‌ పోలీసులు దేశంలో ఒకే ఐఎంఇఐ నెంబర్‌తో సుమారు 13,500 ఫోన్‌లను వినియోగిస్తున్నారనే ఆరోపణలపై వివోపై కేసు నమోదు చేశారు. 2017లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా అన్ని స్మార్ట్‌ ఫోన్‌లకు ప్రత్యేకమైన ఐఎంఇఐ ఉండాలని నిర్దేశిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఆదేశాలను పాటించని సంస్థలకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఆ నోటిఫికేషన్‌లో తెలిపింది.

  అయితే చైనా కంపెనీపై ఈడీ నమోదు చేసిన రెండో కేసు కావడంతో ప్రత్యేక నిఘా పెట్టారు. వాటికి సంబంధించి ఆధారాలు లభించడంతో ఏకకాలంలో దాడులు చేశారు. అయితే విదేశీ మారక ద్రవ్య నిర్వహణను ఉల్లంఘించి అక్రమంగా విదేశీ చెల్లింపులు చేశారనే ఆరోపణలపై చైనా కంపెనీ షావోమీపై గతంలో కూడా కేసు నమోదు చేసింది. ఏప్రిల్‌లో ఫెమా యాక్ట్‌ 1999 కింద షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రూ. 5 వేల 551 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం ఎంఐ భారతదేశంలో కార్యకలాపాలను 2014లో ప్రారంభించింది. 2015 నుండి డబ్బును పంపడం ప్రారంభించింది. ఇక ఏడాది కాలంగా లావాదేవీలు, సర్వర్, నెట్వర్క్ వంటి అంశాలపై ఈడీ ద‌ర్యాప్తు మొదలుపెట్టింది. గ‌త కొద్ది కాలంగా చైనా మొబైల్ ఫోన్ కంపెనీలపై ఐటీ, ఈడీ డేగ కన్ను వేసింది. మ‌నీల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై చైనా మొబైల్ ఫోన్ కంపెనీలు ల‌క్ష్యంగానే తాజాగా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.

  spot_img

  Trending Stories

  Related Stories