ది కశ్మీర్ ఫైల్స్.. ఓ సంచలనం సృష్టించిన సినిమా..! తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ కలెక్షన్స్ సాధించిన సినిమా మాత్రమే కాదు.. కశ్మీరీ పండిట్లపై చోటు చేసుకున్న దారుణాలను ప్రపంచానికి తెలియజేసిన సినిమాగా నిలిచింది. చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిపై ప్రశంసల జల్లు కురిసింది. అంతేకాకుండా నిజాలను తెలిపినందుకు ఆయనకు బెదిరింపులు కూడా ఎదురయ్యాయి.
ఇక వివేక్ అగ్నిహోత్రి తీసే తర్వాతి సినిమా ఏమిటా..? అనే ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం “ది ఢిల్లీ ఫైల్స్” అని స్పష్టం చేశారు. గత చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్” బాక్సాఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో వసూళ్లు రాబట్టింది, అంతేకాకుండా వివాదాలకి దారితీసింది. ఇప్పుడు ఢిల్లీ ఫైల్స్ సినిమా తో ఇంకెన్ని సంచలనాలకు వివేక్ అగ్ని హోత్రి తెర తీస్తారో కాలమే నిర్ణయిస్తుంది.
“#TheKashmirFiles కి మద్దతు ఇచ్చిన వ్యక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా, మేము చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో చాలా కష్టపడ్డాము. నేను మీ టైమ్ లైన్స్ ని స్పామ్ చేసి ఉండవచ్చు, కానీ కశ్మీరీ హిందువులకు జరిగిన మారణహోమం, అన్యాయం గురించి ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యం” అని అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. తదుపరి పోస్ట్‌లో, “#TheDelhiFiles” అని రాయడంతో అతడి కొత్త చిత్రం ప్రారంభమవుతోందని.. అదే టైటిల్ అని తెలియజేశారు.
మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన “ది కశ్మీర్ ఫైల్స్”, 1990లలో కాశ్మీరీ లోయ నుండి కశ్మీరీ పండిట్‌ల వలసలను చిత్రీకరించింది. ఇందులో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ఉన్నారు. ఈ సినిమా ₹ 330 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్‌తో సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడంతో ఈ చిత్రం రాజకీయ పార్టీలలో చర్చకు దారితీసింది. “ది కశ్మీర్ ఫైల్స్” కంటే ముందు, అగ్నిహోత్రి 1966లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఆధారంగా వచ్చిన “ది తాష్కెంట్ ఫైల్స్”ని దర్శకత్వం వహించారు.