ఆప్ తర్వాతి టార్గెట్ ఆ రెండు రాష్ట్రాలే

0
1011

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లలో ఆధిక్యంలోనే కొన‌సాగుతూ వ‌చ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గురువారం సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఆప్‌కు 92 సీట్లు ద‌క్కాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో శిరోమ‌ణి అకాలీద‌ళ్‌కు 4 సీట్ల‌లో విజ‌యం ద‌క్కింది. బీజేపీ కేవ‌లం రెండు సీట్ల‌లోనే విజ‌యం సాధించింది. మ‌రో సీటును స్వ‌తంత్ర అభ్య‌ర్థి గెలుచుకున్నారు. కాంగ్రెస్‌ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత కొత్త రికార్డును కేజ్రీవాల్‌ పార్టీ తిరగరాసింది. 1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ(వేరే పార్టీలతో పొత్తు లేకుండా) 92 సీట్లు గెలవడం 2022 ఎన్నికల్లో చోటుచేసుకుంది. 1962లో క్రాంగెస్‌ 90 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో గెలుపొంది రికార్డును తిరగరాసింది. బీజేపీ, అకాలీదళ్‌ కూటమి.. 1997లో 93 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్‌కు పంజాబ్‌ ప్రజలు ఆకర్షితులు అయ్యారు. నాణ్యమైన విద్య, వైద్య, సుపరిపాలన అందిస్తామన్న ఆప్‌కు అధికారాన్ని అప్పగించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. పంజాబ్ సంక్షేమం కోసం ఆ పార్టీకి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నట్టు చెప్పారు.

పంజాబ్ ఓటర్లు తమ తీర్పుతో నేను ఉగ్రవాదిని కాదని తీర్పు ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాజకీయ పార్టీలన్నీ ‘ఆప్’కు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయని, అందరూ తమనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద కుట్రలు కూడా జరిగాయన్నారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అని చెప్పేందుకు పార్టీలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. ప్రజలు కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని తీర్పిచ్చారని అన్నారు. పంజాబ్‌‌లో ఆప్ ఘన విజయం తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లపై కన్నేసింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో ఎన్నికలు రానున్నాయి. దీంతో గుజరాత్ లో పాగా వేసేందుకు ఆప్ ఇప్పుడు సన్నాహాలు మొదలు పెట్టింది. పంజాబ్‌లో భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు రచిస్తూ ఉందని ఆ పార్టీ నాయకుడు అక్షయ్ మరాఠే తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు వెళ్తున్నామని, మా రాడార్‌లో ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే తమ పార్టీ ఈ రాష్ట్రాలకు పార్టీ కార్యకర్తలను పంపుతోంది, మేము ఖచ్చితంగా పెద్ద ప్రభావాన్ని చూపుతామన్నారు.