కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. కేసులు తగ్గుతున్నా.., మరణాల సంఖ్య పెరుగుతుండటం అందరిని ఆందోళనలకు గురిచేస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా కనబడింది. పరిస్థితులు ఇంకా భయంకరంగానే ఉన్నాయని చెబుతున్నారు. చాలా మంది లూటియెన్స్ జర్నలిస్టులు కరోనా మరణాలపై శ్మశాన జర్నలిజం చేశారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచిన జర్నలిస్టు బర్ఖా దత్.
అలాంటి బర్ఖా దత్ ట్విట్టర్ వేదికగా సోమవారం ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అది కూడా ఢిల్లీలో రైతుల పేరుతో జరుగుతున్న నిరసన ప్రదర్శనల గురించి.! రెండో దశ కరోనా విలయం నుంచి ఇంకా మనం బయటపడక ముందే.., రైతు సంఘాల నేతలు భారీ ర్యాలీకి పిలుపునివ్వడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ సందర్భంలో ఆమె కుంభమేళా, ఎన్నికల ర్యాలీలను ప్రస్తావించారు.
అయితే బర్ఖా చేసిన ఈ ట్విట్ ను ఆమె సహచర లిబరల్స్, ఇంకా కమ్యూనిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు, జర్నలిస్టులు తప్పుపట్టారు. కొంతమంది అయితే కుంభమేళా వేరు, ఎన్నికల సమయంలో పార్టీలు నిర్వహించే ప్రచార ర్యాలీలు వేరు, అలాగే రైతు పేరుతో జరుగుతున్న ఆందోళనలు వేరు అంటూ తర్కించారు..! కుంభమేళాకు, రైతుల నిరసన ప్రదర్శనలకు ఎలా పోలిక పెడతారంటూ ప్రశ్నించారు. రైతుల పేరుతో కొనసాగిస్తున్న నిరసన ప్రదర్శనలను వారు వెనుకేసుకుని వచ్చే ప్రయత్నం చేశారు.
మే 26వ తేదీన ఢిల్లీ శివారులోని సింఘూ సరిహద్దు వద్ద భారీ ర్యాలీ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మంచ్ నిర్ణయించింది. అదే రోజున దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ రెండోసారిగా పీఎంగా ప్రమాణస్వీకారం చేసింది కూడా మే 26వ తేదీనే. సరిగ్గా అదే రోజున బ్లాక్ డే ను ప్రకటించడం వెనుక మోదీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం కనిపిస్తుందని..ఇదంతా ఒక వ్యూహప్రకారం జరుగుతున్న నిరసన ప్రదర్శనల చైన్ లా కనిపిస్తోందని కొంతమంది విశ్లేషకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత ఆరు నెలలుగా రైతుల పేరుతో కొనసాగుతున్న ఈ ఆందోళనల వెనుక ఖలిస్తాన్ ఉగ్రమూకలు, ఐఎస్ఐ ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లు, అదే సమయంలో గ్రేటా థన్ బెర్గ్ టూల్ కిట్ బయటకు రావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అలాగే ఆందోళన వెనుక కుట్రదారులను కొంతమందిని NIA అరెస్టు కూడా చేసింది.
ఇంతా జరుగుతున్న కూడా మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం రైతుల పేరుతో జరుగుతున్న ఈ ఆందోళనలను వెనుకేసుకుని వస్తున్నాయి. వీరి ఆందోళనలకు రాజకీయ మద్దతు పలుకుతున్నాయి. మే 26న సింఘూ వద్ద తలపెట్టిన భారీ నిరసన ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం సహా 12 పార్టీలు మద్దతు ప్రకటించాయి.
అయితే ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే.., ఒక వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళనలకు మద్దతు తెలుపుతుంటే… అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం రైతులు తమ నిరసన ప్రదర్శనలను విరమించుకోవాలని కోరారు. రైతు ఆందోళనలతో కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉందని, రైతు సంఘాలు తమ నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే రైతు సంఘాల పేరుతో చలామణీ అవుతున్నవి నిజంగా రైతు సంఘాలా ? కమిషన్ ఏజెంట్లు, మండీ వ్యాపారుల సంఘాలా అనేది కెప్టెన్ అమరీందర్ సింగ్ కు తెలియక కాదు.! రైతు సంఘాల లీడర్లుగా చలామణీ అవుతున్న నేతలు మాత్రం తమ నిరసన కార్యక్రమాలను కొనసాగించి తీరుతామని ప్రకటించారు.
మరోవైపు బర్ఖా చేసిన కామెంట్లపై ట్విటర్ వేదికగా పెద్ద చర్చే జరిగింది. అమృత బక్షి అనే జర్నలిస్టు అయితే కేంద్ర ప్రభుత్వంపైనే నిందలు మోపింది. రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం రైతు చట్టాలను ఆమోదించలేదని చెప్పుకొచ్చారు. అయితే రైతు చట్టాలు పార్లమెంటు చేత అమోదించబడ్డాయి. అది రాజ్యాంగం నిబంధనల ప్రకారమే.! మరి అమృత దృష్టిలో రాజ్యాంగ నియమాలంటే ఏమిటీ..? దేశ చట్టాలు పార్లమెంటులో కాకుండా నడి వీధుల్లో ఆమోదం పొందాలా?
అలాగే ఆదిత్య మీనన్ అనే మరోక అభ్యుదయ వాది తన ట్వీట్ ద్వారా డెమోక్రసీ కంటే కూడా మాబ్ క్రసీ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. రైతు చట్టాలను ప్రభుత్వమే తీసుకుని వచ్చి తనకు తానే సమస్యలు సృష్టించుకుందని, ప్రజలకు ప్రభుత్వం మోకరిల్లాల్సిందేనని తర్కించాడు.
నిజానికి పంజాబ్ , హర్యానా, ఢిల్లీలో కరోనా విజృంభించడానికి అసలు కారణం రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలేనని పంజాబ్ రాష్ట్రానికి కు చెందిన ఓ మంత్రి అంగీకరించాడు కూడా.! నిరసన ప్రదర్శనల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు.
ఆ సమయంలో చాలా మంది పంజాబీ ఎన్నారైలు సైతం ఇండియాకు వచ్చి రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ లో నమోదైన కరోనా కేసుల్లో యూకే వేరియంట్ ను గుర్తించడం జరిగింది. రైతుల పేరుతో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమం అంతా కూడా ఒక సూపర్ స్ప్రెండర్ ఈవెంట్ అని ఒక దశలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు.
అయితే అదే సమయంలో మన లుటియెన్స్ మీడియా జర్నలిస్టులు, నేషనల్ మీడియా, ఇంకా తెలుగు మీడియా, పత్రికలు అన్ని కూడా కరోనా సెకండ్ వేవ్ విజృభించడానికి కుంభమేళా, భారీ ఎన్నికల ర్యాలీలే అసలు కారణమని నిర్ధారించేశాయి. ప్రతి రోజు ఊదరగొడుతూ కథనాలు రాశాయి. అదేంటో బీజేపీకి పోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించిన మమతా బెనర్జీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక వాద్రా కానీ, డీఎంకే అధినేత స్టాలీన్ కానీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ కానీ కరోనా స్ప్రెడర్స్ కాదని తేల్చేశారు. కేవలం ఒక్క ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రమే సూపర్ స్ప్రెడర్ అంటూ తీర్మానించి హెడ్డింగులు పెట్టారు. అదే పనిగా ట్విటర్ వేదికగా హ్యాష్ ట్యాగులు నడిపారు. రిజైన్ మోదీ అన్నారు.
మళ్లీ ఇదే జర్నలిస్టులు, మీడియా చానళ్లు, పత్రికలు.. మే 26న రైతుల పేరుతో తలపెట్టిన ఆందోళనలకు, ర్యాలీలకు ఇప్పుడు మద్దతు తెలుపుతున్నాయి. రైతుల పేరుతో వేలాది మంది జనం ఒక్కచోట చేరి గుమికూడితే కరోనా వ్యాపించదా? సంయుక్త కిసాన్ మంచ్ నిర్వహించే బ్లాక్ డే నిరసన కార్యక్రమం కంటే కూడా కరోనా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ కాదా? దేశ ప్రజలారా మీరే నిర్ణయించండి.