నిన్న ఇరాన్.. నేడు ఆఫ్ఘనిస్థాన్.. అమ్మాయిలపై విష ప్రయోగాలు..!

0
254

ముస్లిం దేశాల్లో స్కూల్స్, కాలేజీలకు వెళుతున్న అమ్మాయిలపై విషప్రయోగాలు చేయడం సర్వ సాధారణం అయిపోయింది. అమ్మాయిలు చదువుకోకూడదని అక్కడి మత పెద్దలు భావిస్తున్నారు. దీంతో చాలా మంది అమ్మాయిలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. చదువుకోడానికి వెళ్లనివ్వకుండా కుట్రలు కూడా పన్నుతున్నారు. మొన్న ఇరాన్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాజాగా పాఠశాలల్లో విషప్రయోగం కారణంగా దాదాపు 80 మంది బాలికలు ఆసుపత్రి పాలయ్యారని ఆఫ్ఘనిస్థాన్‌లోని విద్యాశాఖ అధికారి తెలిపారు.

సార్-ఎ-పుల్ ప్రావిన్స్‌లో జూన్ 3, జూన్ 4 తేదీలలో ఈ సంఘటనలు జరిగాయి. 1వ తరగతి నుంచి 6వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులపై ఈ విషప్రయోగం చోటుచేసుకుందని జిల్లా విద్యాశాఖ డైరెక్టర్‌ మహ్మద్‌ రహ్మానీ తెలిపారు. నస్వాన్-ఎ-కబోద్ ఆబ్ స్కూల్‌లో 60 మంది, నస్వాన్-ఎ-ఫైజాబాద్ పాఠశాలలో 17 మంది పిల్లలు విషప్రయోగానికి గురయ్యారు. ఈ రెండు ప్రాథమిక పాఠశాలలు ఒకదానికొకటి దగ్గరగానే ఉన్నాయి. అమ్మాయిలు కుప్పకూలిపోతూ ఉండడంతో ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు డబ్బులు ఇచ్చి అమ్మాయిలపై విష ప్రయోగానికి తెగబడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికల మీద ఎలా విషప్రయోగం జరిగింది అనే విషయంపై ఇంకా సరైన సమాచారం లేదు. ఆగస్ట్ 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘన్ మహిళలు, బాలికల హక్కులు, స్వేచ్ఛను హరించి వేస్తూ వస్తున్నారు. మహిళలకు సరైన రక్షణ లేకుండా పోయింది. ఆఫ్ఘన్ లో మహిళలపై అణిచివేత ప్రారంభించిన తర్వాత ఈ రకమైన దాడి జరగడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు. ఇప్పటికే యూనివర్శిటీ విద్యకు అమ్మాయిలు దూరమయ్యారు. బాలికలు 6వ తరగతికి మించి చదవడానికి వీలు లేకుండా పోయింది. మహిళలను చాలా ఉద్యోగాల నుండి తొలగించేశారు.

ఇలాంటి దాడే కొద్ది రోజుల కిందట ఇరాన్ లో కూడా చోటు చేసుకుంది. స్కూల్స్ కు వెళుతున్న అమ్మాయిలపై ఊహించని విధంగా విష ప్రయోగం జరిగింది. ఈ ఘటనల్లో వందలాది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై ఎలాంటి సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆఫ్ఘనిస్థాన్ లో అయినా ఈ కుట్రల వెనుక ఉన్నది ఎవరో బయటకు వస్తుందేమో చూడాలి.

ఫిబ్రవరి 26న, ఇరాన్‌లోని కోమ్‌లో పాఠశాల విద్యార్థినులపై విషప్రయోగం చేశారని ఇరాన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ యూనెస్ పనాహి వెల్లడించారు. కోమ్ పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులకు విషప్రయోగం జరిగింది. కొంతమంది వ్యక్తులు.. బాలికల పాఠశాలలను మూసివేయాలని భావించి.. ఈ పని చేశారని యూనెస్ తెలిపారు. మహ్సా అమిని మరణంపై ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు ఓ వైపు చోటు చేసుకుంటూ ఉండగా.. ఈ విషప్రయోగం ఘటనలు బయటకు వచ్చాయి. మహిళలను తొక్కేయాలని ఈ దారుణాలకు తెగబడుతూ ఉన్నారు. ఇరాన్ లో మొట్ట మొదటిసారి ఈ విష ప్రయోగం ఘటన నవంబర్ 2022లో చోటు చేసుకుంది. అప్పటి నుండి పలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. విష ప్రయోగం కారణంగా వికారం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ విష ప్రయోగాలు ఆఫ్ఘనిస్థాన్ ను కూడా పాకాయి.

తాలిబన్ పాలనలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాలిబాన్ నేతలు మహిళలను విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు అనర్హులుగా ప్రకటించింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా తాలిబన్లు వెనక్కు తగ్గలేదు. తాలిబన్ విధించిన నిషేధాల కారణంగా ఆఫ్ఘన్ మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు.