ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన కొవిడ్ వెబ్ సైట్లో భారత్ చిత్రపటాన్ని తప్పుగా చూపించడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రపంచ పటంలో పాకిస్తాన్, చైనాలో భాగంగా చూపింది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు శాంతను సేన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తూ, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో శంతను సేన్ “నేను WHO యొక్క COVID-19 సైట్‌ను తెరిచినప్పుడు, భారతదేశ మ్యాప్‌ను చూశాను, అందులో జమ్మూ కశ్మీర్ వేరే రంగును కలిగి ఉంది. దానిలో చిన్న భాగం కూడా భిన్నంగా ఉంటుంది. జూమ్ చేసి వాటిపై క్లిక్ చేసినప్పుడు, పాకిస్తాన్, చైనా దేశాలపై కోవిడ్ గణాంకాలు కనిపించాయి. బ్లూ పార్ట్‌పై క్లిక్ చేసినప్పుడు భారతదేశ డేటా మ్యాప్‌లో వచ్చిందని” సేన్ తెలిపాడు. మరో భాగం, పాక్ లోని కోవిడ్ డేటాను, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొంత భాగాన్ని భారత్‌తో పాటు చైనాలో కూడా భాగంగా చూపించాయని శాంతను సేన్ చెప్పారు.ఈ సమస్యను అంతర్జాతీయ సమస్యగా అభివర్ణించిన సేన్, ఈ విషయంలో భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
అలాగే ఇదే విషయం రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఓ ప్రశ్నకు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. డబ్ల్యూహెచ్ఓ వెబ్ సైట్లో భారత మ్యాప్ అగ్రభాగాన ఉండే జమ్మూ కశ్మీర్, లడఖ్ భూభాగాలను విడిగా చూపించడం పట్ల కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ ను వేరే రంగులో సూచించడం తగదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డబ్ల్యూహెచ్ఓకి స్పష్టం చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రాజ్యసభలో ప్రశ్నించారు. విదేశాంగ శాఖ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుందని సింథియా అడిగారు. అందుకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ వివరణ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరించడంపై డబ్ల్యూహెచ్ఓను అత్యున్నతస్థాయి మార్గాల ద్వారా వివరణ కోరామని, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని అన్నారు. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఐరాసలోని భారత శాశ్వత మిషన్ వర్గాలకు సమాచారం అందించిందని మురళీధరన్ వెల్లడించారు. ఆ మ్యాప్ కు సంబంధించి వెబ్ సైట్లోనే డిస్ క్లెయిమర్ ప్రకటనను కూడా పొందుపరిచిన విషయాన్ని తీసుకుని వెళ్లారు. “ఏదైనా దేశం, ప్రాంతం, భూభాగం, వాటిపై అధికారాలు, చట్టబద్ధమైన స్థితి పట్ల డబ్ల్యూహెచ్ఓ ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలేదని ఆ డిస్ క్లెయిమర్ లో పేర్కొన్నారు. మ్యాప్ పై ఉన్న చుక్కలు, గీతలు కేవలం రేఖామాత్రంగానే సరిహద్దులను సూచిస్తాయని తెలిపారు. వీటికి పూర్తిస్థాయిలో ఒప్పందం కుదిరి ఉండకపోవచ్చు” అని మురళీధరన్ వెల్లడించారు. ఆయా ప్రాంతాల సరిహద్దులపై నిర్ణయం తీసుకునే హోదా మాత్రం భారత ప్రభుత్వానిదేనని తెలిపారు.
2021లో జమ్మూ కశ్మీర్‌ను భారత మ్యాప్ నుండి తొలగించడానికి ట్విట్టర్ ప్రయత్నించింది. 2020 సంవత్సరంలో ట్విట్టర్ ద్వారా లేహ్ చైనాలో భాగంగా చూపబడింది. ట్విట్టర్‌తో పాటు, గూగుల్ తన ‘ట్రెండ్స్’ విభాగంలో జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని కొన్ని భాగాలను తీసివేసి భారతదేశం యొక్క తప్పు మ్యాప్‌ను చూపింది. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం వాటి యొక్క స్పష్టమైన మ్యాప్‌ను విడుదల చేసింది. అయినా కూడా గూగుల్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వాటిని భారతదేశంలో భాగంగా చూపడం లేదు.