More

  చైనాకు భారత్ ‘స్మార్ట్’ చెక్..!

  మన దేశంలో చైనా వస్తువు లేని షాపును గుర్తించడం కష్టం. గుండు సూది నుంచి స్మార్ట్ ఫోన్ వరకు.. భారత్ లో దొరికే వస్తువుల్లో అధికశాతం నాణ్యతలేని చైనా వస్తువులే కనిపిస్తాయి. ముఖ్యంగా భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ చైనాకు స్వర్గధామం. ధర తక్కువ కావడంతో ప్రజలు వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తూవుంటారు. షియోమీ, రియల్ మీ, ఒప్పో, వీవో ఇలా చెప్పుకుంటూ పోతే పదులకొద్ది చైనా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్ ను కొల్లగొడుతున్నాయి. ఈ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ అక్కడి కమ్యూనిస్టు పార్టీతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం కలిగివుంటాయి. చైనా వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ముతో తెగబలిసిన డ్రాగన్.. తిరిగి మనతో కయ్యానికి కాలుదువ్వుతుంది. విస్తరణకాంక్షతో రంకెలేస్తూ.. సరిహద్దుల్లో ఆటంకాలు సృష్టిస్తోంది. మన మార్కెట్ ను కొల్లగొట్టి మనపైనే విషం చిమ్ముతుంది. అందుకే, మోదీ ప్రభుత్వం కొద్దికాలంగా చైనా వస్తువులు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై దృష్టిసారించింది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో పోటీ తత్వం పెరిగింది. చైనా గుత్తాధిపత్యానికి మెల్లమెల్లగా దారులు మూసుకుపోతున్నాయి. శాంసంగ్, యాపిల్ ఫోన్లతో పాటు.. భారతీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలైన మైక్రోమాక్స్ వంటి కంపెనీలు కూడా చైనాకు తీవ్రమైన పోటీ ఇస్తున్నాయి.

  2020 ఏప్రిల్ 1 నుంచి మోదీ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల జీఎస్టీ రేట్లను శ్లాబ్‎ను పెంచింది. అంతకుముందు 12 శాతంగా వున్న జీఎస్టీని 18 శాతానికి పెంచేసింది. జీఎస్టీ పెంపు ప్రభావం స్మార్ట్ ఫోన్ల దిగుమతులపై పడింది. దీంతో చైనాకు దిమ్మదిరికిపోయింది. చైనా కంపెనీలు.. స్మార్ట్ ఫోన్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అప్పటిదాకా చీప్‎గా దొరికిన నాణ్యతలేని చైనా స్మార్ట్ ఫోన్లకు అధిక ధరలకు చెల్లించాల్సిరావడంతో వినియోగదారులు ఆలోచనలో పడ్డారు.

  చైనా కంపెనీలవి నాణ్యతలేని వస్తువులనే విషయం జగమెరిగిన సత్యం. భారతీయ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటాయనే ఒకే ఒక్క కారణం చేత.. నాణ్యతలేకున్నా భారతీయ మార్కెట్ లో అవినిలదొక్కుకోగలుతున్నాయి. అయితే, భారత ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల జీఎస్టీ శ్లాబ్ ను పెంచడంతో.. చైనా కంపెనీలకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అయ్యింది. ఇదే సమయంలో జీఎస్టీ పెంపు ప్రభావం కస్టమర్లపై పడకుండా చైనాయేతర కంపెనీలు జాగ్రత్త పడ్డాయి. దీంతో అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్ ధరలు దాదాపు సమానంగా మారాయి. ఈ నేపథ్యంలో నాణ్యతలేని చైనా స్మార్ట్ ఫోన్లకంటే.. నాణ్యమైన చైనాయేతర కంపెనీల స్మార్ట్ ఫోన్లపై వినియోగదారుల దృష్టిసారించడం ప్రారంభించారు. ఈ పరిణామం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది.

  జీఎస్టీ పెంపుతో మొదట స్మార్ట్ ఫోన్ల ధరలు పెంచిన కంపెనీల్లో చైనా కంపెనీలే ముందువరుసలో నిలిచాయి. ముఖ్యంగా షియోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్ల భారీగా ధరలు పెరిగాయి. రెడ్ మీ నోట్ 10 వేరియెంట్ ధరల్లో తేడాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. రెడ్ మీ నోట్ 10 4 జీబీ ఫోన్ లాంఛింగ్ ధర 11,999 రూపాయలు కాగా.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో 13,999లకు లభిస్తోంది. ఇదే ధరతో 6జీబీ వేరియంట్ అమ్మకాలు ప్రారంభించినా.. ఇప్పుడు దాని ధర 15,499 రూపాయలు. ఇక రియల్ మీ విషయానికి వస్తే.. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగిన రియల్ మీ ఫోన్ ధర 15,999 గా వుంది. రియల్ మీ కి చెందిన మిగతా వేరియెంట్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇక, ఒప్పో విషయానికి వస్తే.. A54 మోడల్ ధరను ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి 500 రూపాయలు పెంచేసింది.

  వినియోగదారుల గోప్యత, భద్రతకు భంగం కలిగించేలా వుండటం.. చైనా కంపెనీలు అక్కడి కమ్యూనిస్టు పార్టీకి తొత్తులుగా వుండటంతో.. డేటా లీకేజీపై మొదటి నుంచి మోదీ ప్రభుత్వం సందేహం వ్యక్తం చేస్తోంది. పైగా.. డర్టీ చీప్ ప్రయిసెస్ తో భారతీయ మార్కెట్ పై ఇన్నాళ్లూ గుత్తాధిపత్యాన్ని చెలాయించాయి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు. ఇది నాణ్యమైన బ్రాండ్లను అందించే చైనాయేతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లతో కలుషితమవుతోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో, మన మార్కెట్లపై చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు.. మోదీ ప్రభుత్వం గతేడాది స్మార్ట్ ఫోన్ల జీఎస్టీ శ్లాబ్ ను పెంచేసింది.

  ప్రస్తుతం భారత్, చైనా ప్రత్యర్థులు మాత్రమే కాదు.. బద్ధ శత్రువులు కూడా. కొవిడ్ వ్యాప్తితో ఇకపై చైనా, దాని కమ్యూనిస్ట్ పాలకులతో పొంచివున్న ప్రమాదాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఇండో టిబెటన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలపై ఓ కన్నేసివుంచింది. ఈ నేపథ్యంలో భారత్ పై చైనా ప్రభావాన్ని తగ్గించే చర్యలకు పూనుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా క్షీణిస్తూ వచ్చాయి. గతేడాది జూన్ జరిగిన గల్వాన్ ఘర్ణణల్లో చైనా ఆర్మీతో తలపడి 20 భారత జవాన్లు వీరమరణం పొందారు. అప్పటినుంచి చైనా సంబంధాలపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. మొదట అన్ని ప్రధాన చైనీస్ యాప్ లను నిషేధించింది. చైనా వ్యతిరేక ఆర్థిక ప్రచారం మొదలు పెట్టింది.

  గల్వాన్ ఘటన తరువాత భారత్ లో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. చైనా వస్తువులకు, యాప్ లకు అతిపెద్ద మార్కెట్ భారత్. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధిస్తే.. ఆ దేశానికి భారీ ఆర్థిక నష్టం తప్పదు. దీంతో మొదట చైనా యాప్ లతో మొదలు పెట్టి.. ఆ తర్వాత టెలికాం, ఇతర రంగాల్లో చైనా ఆధిపత్యానికి గండికొడుతూ వస్తోంది మోదీ ప్రభుత్వం. భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై గుత్తాధిపత్యం చెలాయించాలన్న చైనా ఆశలకు మోదీ ప్రభుత్వం గండికొట్టింది. గతేడాది ఏప్రిల్ నుంచి స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ శ్లాబ్ రేట్లను పెంచి డ్రాగన్ కు షాకిచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ చైనా కంపెనీలకు భారత మార్కెట్ పై పట్టుదొరకకుండా నిర్ణయాలు తీసుకుంటూ.. చైనా ఆధిపత్యానికి ఎక్కడికక్కడ చెక్ పెడుతోంది మోదీ ప్రభుత్వం.

  Related Stories