కరోనా నాలుగో వేవ్ టెన్షన్.. చైనా, అమెరికాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

0
854

మార్చి 31 నుండి అన్ని కోవిడ్ -19 ఆంక్షలను తీసి వేయాలని భారతదేశం భావిస్తూ ఉండగా.. చైనా, యునైటెడ్ స్టేట్స్, ఇతర దక్షిణాసియా దేశాలలో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండడంతో ఫోర్త్ వేవ్ టెన్షన్ మొదలైంది. గతంలో కూడా, ఈ దేశాలు కోవిడ్ కేసులతో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, భారతదేశం కోవిడ్ రహితంగా ఉంది. ఈ దేశాలు కరోనావైరస్ కేసుల క్షీణతను చూడటం ప్రారంభించినప్పుడు, భారతదేశంలో మరోవైపు పెరుగుదల మొదలైంది. జూన్ 2022లో కోవిడ్-19 ఫోర్త్ వేవ్ వస్తుందని.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ తమ అధ్యయనంలో తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) ప్రకారం భారతదేశం గణనీయమైన కోవిడ్ కేసులను నమోదు చేయనప్పటికీ, ఒమిక్రాన్ సబ్-లీనేజ్ BA.2 ప్రాబల్యం భారతదేశంలో క్రమంగా పెరుగుతోంది. NCDC డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, “ఇంతకుముందు, ట్రావెలర్స్ నుండి సేకరించిన నమూనాలలో BA.1 వేరియంట్ ప్రబలంగా ఉండేది. ఇప్పుడు కమ్యూనిటీ సెట్టింగ్‌లలో, BA.2 సబ్-వేరియంట్ క్రమంగా పెరుగుతోందని మేము కనుగొన్నాము.” అని అన్నారు.

మరో వైరాలజిస్ట్ డాక్టర్ టి జాకబ్ జాన్, మనకు ఇంతకు ముందు తెలియని కొత్త వేరియంట్ వస్తే తప్ప కోవిడ్ -19 కేసులు పెరగకపోవచ్చని సూచించారు. అదే సమయంలో, వైరస్ విషయంలో జాగ్రత్తలు పాటించడం మానుకోవద్దని కూడా ఆయన సూచించారు. ప్రజల్లో చాలా మందికి టీకాలు వేయబడ్డాయి. రక్షిత రోగనిరోధక శక్తిని పొందడం వలన ఫోర్త్ వేవ్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వైద్యులు ఆశిస్తున్నారు.

చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ కాస్తంత కఠినంగానే ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 56 వేల కేసులు నమోదైనట్టు చైనా నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది. వీటిలో సగానికిపైగా జిలిన్ ప్రావిన్స్‌లోనే వెలుగులు చూసినట్టు తెలిపింది. హాంకాంగ్‌లోనూ పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి. డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యంతో ముందుకెళ్తామని, త్వరలోనే దానిని చేరుకుంటామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు తెలిపారు. హాంకాంగ్‌లో గత నెల రోజుల్లో 200 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో కూడా కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోయింది.