ఉత్తరాఖండ్ లో కొత్త పార్టీ..?
అమరీందర్ దారిలో రావత్..!

0
742

ఒకప్పుడు మహా నది కాస్త కాలువలా మారింది. ఆ కాలువ కాస్త పిల్ల కాలువగా మారనుందా..? శతాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చెడ్డ కాలమేనా..? ఒక్కొక్కరిగా హస్తాన్ని వదిలేస్తున్నారా..? తాజా పరిణామాలు ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. భారత దేశ రాజకీయాలను శాసించి పార్టీ.. రాష్ట్రాల్లో సైతం మసకబారుతోంది. కాంగ్రెస్ లోని కీలక నేతలు అసహనం ఒకవైపు.. సొంత కుంపటి మరోవైపు ఆ పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన అమరేందర్ సింగ్ ఇప్పటికే హస్తాన్ని వీడి కొత్త పార్టీ పెట్టడమే కాదు కమలదళంతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. ఆయితే ఆయనను ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ అనుకరిస్తున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అగ్రశ్రేణి ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన ఆయన వరుస ట్వీట్లలో అగ్రనాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంత చిత్రమో కదా… ఎన్నికల సముద్రంలో ఈదమన్నారు అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. తాను ఈదుతున్నప్పుడు తనకు సహకరించడానికి బదులుగా ముఖం తిప్పుకొంటున్నారని కాంగ్రెస్ పై విమర్శలకు దిగారు. తాను ఈత కొడుతుంటే.. అధికారంలో ఉన్నవారు కొన్ని మొసళ్లను కూడా వదిలారని… కానీ, ఎవరి ఆజ్ఞతో తాను ఈత కొట్టడానికి దిగానో వారి బినామీలు నా కాళ్లు, చేతులు కట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇక చాలు… అలసిపోయా అంటూ ట్విట్ చేశారు. ఇప్పటికే చాలాకాలం నుంచి ఈత కొడుతున్నానని…. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన అంతరాత్మ చెబుతోందన్నారు. అదే విధంగా తాను సందిగ్ధంలో ఉన్నానని.. కొత్త సంవత్సరం తనకో దారి చూపిస్తుందేమోనని పోస్టు చేశారు. ఆ కేదారేశ్వరుడే ఒక మార్గాన్ని చూపిస్తాడనే విశ్వాసం ఉందని రావత్‌ ట్వీట్‌ చేశారు.

ఆ తర్వాత తన ట్విట్స్ పై హరీష్ రావత్ మళ్లీ వివరణ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు.. తానే అన్ని విషయాలు మీడియాతో పంచుకుంటానని చెప్పారు. ఆ సందర్భం వచ్చినప్పుడు తానే పిలుస్తానని హింట్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఆయన పార్టీ నుంచి వైదొలుగుతారా లేదా అమరేందర్ సింగ్ లా సొంత పార్టీ పెడుతారా..? మొత్తానికే రాజకీయాల నుంచే తప్పుకొంటారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న హరీశ్ రావత్.. బుధవారం ట్విటర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద తన భవిష్యత్‌ కార్యాచరణపై కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటానని సూచనప్రాయంగా వెల్లడించారు. మరికొద్ది నెలల్లో ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here