చైనా కమ్యూనిస్టు పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవహారం కేవలం చైనాకు మాత్రమే పరిమితం కాలేదు. అది ఆసియా అంతటా పాకింది. అనేక దేశాలను అతలాకుతలం చేస్తోంది. లాటిన్ అమెరికా మొన్నటి వరకూ నిద్రలేని రాత్రులను అనుభవించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ గురించి చైనా కన్నా ఎక్కువగా మిగతా దేశాలే ఆలోచించాల్సిన స్థితి ఏర్పడింది.
శతాబ్ద కాలంపాటు రహస్యాలను బయటకు పొక్కనీయకుండా, కుట్రలు మూడో కంటికి తెలియకుండా, వ్యూహం మూలాలు-ఎత్తుగడల ఆనవాళ్లూ అంతుచిక్కకుండా యధాశక్తీ – తన గోప్యతను కాపాడుకుంటోంది సీపీసీ. కమ్యూనిస్టు నియంతృత్వాన్ని కొనసాగిస్తోంది. పొరుగుదేశాల భూభాగాలను ఆక్రమించేందుకు కసరత్తు చేస్తోంది.
వందేళ్లు పూర్తి చేసుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో కీలక ఘట్టాలేంటి? సమష్టి నాయకత్వం నుంచి ఏకవ్యక్తి నిర్ణయాధికారం వైపు ఎందుకు ప్రయాణించింది? మావో ఎలా సీపీసీని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు? సీపీసీ ఇచ్చిన 11 నినాదాలేంటి? సీపీసీ సీక్రసీ వెనుక కారణమేంటి? ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్’ అకృత్యం ఎందుకు జరిగింది? దేశాల్లోనే అత్యంత రహస్యమైన పార్టీగా పేరున్న చైనా కమ్యూనిస్టు పార్టీ-ఎందుకు ఆ స్థాయిలో గోప్యతను పాటిస్తుంది? చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో రష్యా నిధులు ఉపకరించాయా? బ్లాక్ బుక్ కమ్యూనిజం పుస్తకంలో ఏముంది? ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వందేళ్ల సీపీసీ అనుభవం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. ఆసియా వ్యాపార సామ్రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు దక్షిణ ముఖంగా ప్రయాణం మొదలుపెట్టింది చైనా. వాణిజ్య కాంక్ష, భౌగోళిక దురాక్రమణ, రాజకీయ ప్రాబల్యం ఈ మూడు లక్ష్యాల సాధన కోసం సైనిక పాటవానికి మరింత పదును పెడుతోంది. దక్షిణాసియాలోని బలహీన దేశాలను పావులుగా చేసుకుని భారత్ చుట్టూ పాగా వేస్తోంది డ్రాగన్.
భారతదేశంలో ‘మావోయిజం’ పేరిట మారణ హోమం నలభై ఏళ్లుగా రావణకాష్టంలా రగులుతూనే ఉంది. దేశ అంతర్గత భద్రతకు సవాళ్లు విసురుతోంది. మధ్య, తూర్పు భారతంలో పేట్రేగుతున్న హింసను అదుపు చేసేందుకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు సామ, దాన, భేద, దండోపాయాలను వాడుతూనే ఉన్నాయి.
చైనా విప్లవం విజయవంతమైన తర్వాత 1949లో అధికార పగ్గాలు చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ 1921లో ఆరంభమైంది. సోవియట్ రష్యాలో 1917లో జరిగిన బోల్షివిక్ విప్లవ స్ఫూర్తితో… షాంఘై లేన్‌హౌస్‌లో జరిగిన ఓ రహస్య సమావేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ పురుడుపోసుకుంది.
రికార్డుల ప్రకారం 1921 జులై 23న పార్టీ తొలి కాంగ్రెస్ సమావేశం జరిగినట్లు చెపుతున్నాయి. అయితే మావో గృహనిర్బంధంలో ఉన్న రోజుల్లో పార్టీ వ్యవస్థాపనకు సంబంధించి మావోను కచ్చితమైన తేదీలు అడిగింది సీపీసీ. మావోకు తొలి సమావేశం తేదీ సరిగ్గా గుర్తు లేక జులై 1గా ప్రకటించారు. అదే నిలిచిపోయింది. రష్యాలోని పెట్రోగ్రాడ్ నుంచి వెలువడే ‘ప్రావ్దా’ పత్రిక మాత్రం 1920, జూలై 30 వ తేదీన షాంఘై కేంద్రంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ఓ వార్తలో రాసింది.
మావోతో పాటు 12 మంది విప్లవకారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశం అర్ధంతరంగా రద్దయింది. పశ్చిమ దేశాలకు సంబంధించిన ఓ గూఢచారి సదరు సమావేశ ప్రాంగణంలో పచార్లు చేస్తున్నట్టూ మావో అనుమానించారు..ఇదే సమావేశం నిలిచిపోవడానికి కారణమంటారు చరిత్రకారులు.
మావో తన విప్లవ ప్రస్థానంలో ఎక్కడ సంప్రదాయ మార్క్సిస్ట్ పదజాలాన్ని వాడలేదు. బాహటంగా మతాన్ని ఖండించలేదు. పైగా కన్ఫ్యూషియస్ కథలను ప్రజలకు చెపుతూ జపాన్ వలస వాద వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించాడు. మావో సేటుంగ్ ప్రధానంగా మూడు అంశాలను తన ఆయుధాలుగా వాడుకున్నాడు.
- కన్ఫ్యూషియస్ మతం
- సున్-జూ యుద్ధకళ
- భౌగోళిక అనుకూలత
క్లాసికల్ మార్క్సియన్ సిద్ధాంతాన్ని బట్టీపట్టి చైనాకు అన్వయించలేదు మావో. చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు విషయంలో భిన్నమైన వాదనలున్నాయి. చైనా శ్రామికోద్యమ స్ఫూర్తి-బోల్షివిక్ విప్లవ ప్రభావం కారణంగా సీపీసీ ఏర్పడిందనే వాదనను కొంతమంది చరిత్రకారులు ఖండిస్తారు. సోవియట్ రష్యా- కొమింటర్న్ గా పిలిచే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ సంస్థ ఇచ్చిన ఆర్థిక వెన్నుదన్ను కారణంగానే సీపీసీ ఏర్పడిందంటారు.
ఇందులో వాస్తవం లేకపోలేదు. మార్క్స్-ఎంగెల్స్-లెనిన్ లు రూపొందించిన విముక్తి సిద్ధాంతం విషయంలో మావోకు చాలా పేచీలుండేవి. చైనా భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంప్రదాయ మార్క్సియన్ సిద్ధాంతాన్ని అన్వయించడంలో సమస్యలున్నాయని మావో భావించాడు. ఈ కారణంగానే ఆ తర్వాత రోజుల్లో రష్యన్ కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు మావోను మార్క్సిస్ట్ గా అంగీకరించేందుకు ససేమిరా అన్నారు.
1911లో వచ్చిన ‘చింగై’ విప్లవం తర్వాత 276 ఏళ్ల మంచు రాచరికం అంతమైంది. సుదీర్ఘకాలంపాటు జరిగిన మంగోల్ దాడులు చైనా ప్రజల స్వభావంలోనే మార్పులు తెచ్చాయి. చైనీయులు యుద్ధాన్ని చూసే తీరులోనూ, చేసే పద్థతిలోనూ ఊహించని మార్పులు వచ్చాయి. మరోవైపు 1905 నాటికి క్రమంగా జపాన్ వలసవాదం వేళ్లూనుకోవడం మొదలుపెట్టింది. జపాన్ వలస పాలకుల దాడులు చైనీయులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి.
మొత్తంగా 1900 నుంచి 1930 నాటికి చైనా సమాజం అనేక పరిణామాల మధ్య కమ్యూనిస్టు పార్టీ వైపు మళ్లింది. 1919లో వచ్చిన ‘‘మేఫోర్త్’’ ఉద్యమం మరోకారణం. 1921 ఉత్తరార్ధంలో కమ్యూనిస్టు పార్టీలోకి ప్రవేశించిన మావో 1927నాటికి పార్టీపై పూర్తి పట్టును సాధించారు. భూస్వామ్యం బలంగా ఉన్న చైనా సమాజంలో రైతాంగమే మార్పును తెస్తుందని వాదించాడు మావో. మరోవైపు మావోకు చైనా సంప్రదాయ, జానపద సాహిత్యంపై పూర్తి పట్టు ఉంది.
భౌగోళిక అనుకూలతపై పూర్తి నమ్మకం ఉంది. వంచనను యుద్ధకళగా మార్చిన సున్ జూ ‘ఆర్ట్ ఆఫ్ వార్’ ఉంది. వీటన్నింటి గమనించిన మావో సరికొత్త వ్యూహం-ఎత్తుగడలను రూపొందించాడు. మావో స్వతహాగా సాహిత్య అభిరుచి కలిగినవాడు కాబట్టి తన కుట్ర సిద్ధాంతానికి అందమైన నినాదాలను ఎన్నుకున్నాడు.
ప్రజలను ఆకర్శించే 4నినాదాలను ఎన్నుకున్నాడు మావో. ఈ నినాదాలు నేటికీ చైనా ప్రజల నోళ్లలో నానుతుంటాయి. మావో రూపొందించిన నినాదాలు అత్యంత ఆసక్తిదాయకమైనవి, చాలా ప్రమాదకరమైనవి కూడా.
- let a hundred flowers bloom and a thousand schools of thought contend- నూరు పూలు వికసించనీ-వేయి ఆలోచనలు సంఘర్షించనీ
- Dare to think, dare to act- ధైర్యంగా ఆలోచించండి, ధైర్యంగా ముందుకు రండి
- Smash the four olds- నాలుగు దురలవాట్లను పాతరేద్దాం
- Smash the gang of four-దుష్టచతుష్టయాన్ని తరిమేద్దాం
నూరు పూలు వికసించనీ-వేయి ఆలోచనలు సంఘర్షించనీ అనే నినాదం నిజానికి మావో స్వతహాగా కనిపెట్టిందేమీకాదు. క్రీ.పూ. 221నాటి వారింగ్ సామ్రాజ్యంలో జనశృతిలో భాగంగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ ఆచరణపై విమర్శలను ఆహ్వానించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ నినాదం చైనా సమాజంలో సీపీసీపై ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేసింది. విద్యార్థి, యువజనులు బహిరంగంగానే కమ్యూనిస్టు పార్టీ నేతలను తిట్టిపోశారు.
విమర్శల తీవ్రత ఊహించలేనంతగా పెరిగింది. అయితే ఈ నినాదం ఉద్దేశం విమర్శిస్తున్నవారిని గుర్తించడమే అంటారు కొంతమంది చైనా నిపుణులు. వంద పూలు వికసించనీ అనే నినాదం ఓ కుట్ర లాంటిదనీ…. విమర్శలకు ఆహ్వానం పేరుతో తీవ్రమైన విమర్శలు చేసేవారిని బయటకు రప్పించేందుకే దీన్ని తెరపైకి తీసుకొచ్చారనే వాదన ఉంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ సీపీసీపై బహిరంగ విమర్శలు చేసినవారు ఆ తర్వాత కాలంలో కనిపించకుండా పోయారు. దీంతో కుట్రవాదనకు బలం చేకూరింది.
ఇక రెండో నినాదం: Dare to think, dare to act- ధైర్యంగా ఆలోచించండి, ధైర్యంగా ముందుకు రండి…నినాదం గ్రేట్ లీప్ ఫార్వర్డ్ కాలంలో ఇచ్చిన పిలుపులో భాగం. ఈ కాలంలోనే వ్యవసాయ రంగం కుప్పకూలింది. మావో విధానాలకు విపత్తులు తోడవడంతో దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది మృత్యువాతపడ్డారు. వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతిని సమాంతరంగా ఉరకలు పెట్టించాలనే లక్ష్యంతో 1958-1960 కాలంలో మావో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అంటూ పిలుపునిచ్చారు. ప్రైవేటు వ్యవసాయాన్ని రద్దు చేశారు. ఇదే సమయంలో… పిట్టలు, ఎలుకలు, దోమలు, ఈగల్ని చంపాలని ఆదేశించాడు.
ధాన్యపు గింజలను తింటున్నాయనే ఉద్దేశంతో పిట్టల్ని చంపమన్నాడు. ఇదో ఉద్యమంగా సాగింది. దీంతో… పిట్టల్లేకుండా పోయాయి. పిట్టలు కేవలం ధాన్యపు గింజలనే కాకుండా పంటలకు నష్టం కలిగించే ఇతర క్రిమికీటకాలను కూడా తింటాయి. కానీ మావో పిలుపుతో పిట్టలు లేకుండా పోవటంతో… తర్వాతి రోజుల్లో… దాని ప్రభావం కనిపించింది.
పంటలన్నీ నాశనమై…. చైనాలో తీవ్రమైన క్షామం నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన క్షామం ఇదే! దేశంలో అరాచకపరిస్థితులకు దారి తీయటంతో ప్రజలందరి దృష్టిని మళ్లించేందుకు మావో 1962లో భారత్‌పై యుద్ధంప్రకటించారు. నాటి క్షామం కారణంగానే… చైనాలో ఏ ప్రాణినైనా తినే అలవాటు పెరిగింది. అదే నేడు ‘కరోనా’ మహమ్మారి పుటకకు కారణమైంది.
ఇక మూడోది: Smash the four olds- నాలుగు దురలవాట్లను పాతరేద్దాం
ఆలోచనలు, సంప్రదాయాలు, సంస్కృతి, అలవాట్లను ఫోర్ ఓల్డ్స్ గా పేర్కొన్నాడు మావో. ఈ నినాదం విన్న వెంటనే, యువత ఆలయాలను ధ్వంసం చేశారు. చాలా మంది మేధావుల్ని హింసించారు. కొందరు బుద్ధిజీవులు మృత్యువాతపడ్డారు.
ఒక అధ్యయనం ప్రకారం 7.73 మిలియన్ల మంది ‘అసహజ మరణం’ పాలైనట్టూ తేలింది. Chronology of Mass Killings during the Chinese Cultural Revolution-1966-1976 పుస్తకంలో యోంగీ సాంగ్ అనే ఔత్సాహిక పరిశోధకుడు దారుణమైన నిజాలను వెల్లడించాడు. సాంస్కృతిక విప్లవ కాలంలో చైనాలో ఎన్ని అసహజ మరణాలు సంభవించాయో ఇప్పటికీ బహిర్గతం చేయలేదు చైనా.
ఇక చిట్టచివరిది: Smash the gang of four-దుష్టచతుష్టయాన్ని తరిమేద్దాం…
సాంస్కృతిక విప్లవ కాలంలో సీపీసీలో ముఠాల కుమ్ములాట మొదలైంది. మావో మూడో భార్య జియాంగ్ ఖింగ్ సహా మరోముగ్గురు కీలకనేతలు మావోకు వ్యతిరేకంగా జట్టుకట్టారు. ఈ తిరుగుబాటుకూ ఓ నేపథ్యం ఉంది. మావో తన జీవిత కాలంలో ఇద్దరిని తన వారసులుగా ప్రకటించాడు. ఒకరు లిన్ పియావో, మరొకరు హువా గుఫెంగ్. ఇందులో లిన్ పియావో సాంస్కృతిక విప్లవ కాలంలో ఓ విమాన ప్రమాదంలో మరణించాడు. లిన్ పియావో మరణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే మిగిలిపోయింది. ఇది మావో చేయించిన హత్య అనే వాదన కూడా ఉంది. లిన్ పియావో ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే గుంటూరు జిల్లాలో లిన్ పియావో గ్రూప్ పేరుతో ఓ మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీ ఏర్పడి-కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని నాటి పీపుల్స్ వార్ పై ఘర్షణకు, హత్యలకు దిగేది. కాకతీయ యూనివర్సిటీ మెస్ లో వర్కర్ గా పనిచేసే జన్ను చిన్నాలు అనే పీపుల్స్ వార్ కార్యకర్తను హత్య చేసింది ఈ లిన్ పియావో వర్గం నక్సలైట్లే !
మొత్తంగా వారసుడి ప్రకటన మావో మూడో భార్యకు గిట్టలేదు. దీంతో మరో ముగ్గురితో కలిసి ముఠా ఏర్పాటు చేసింది. దీన్ని జీర్ణించుకోలేని మావో ‘‘స్మాష్ ది గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ అంటూ ఆదేశించారు. మావో తన వారసుడిగా తెరపైకి తీసుకొచ్చిన హువా గుఫెంగ్ దాదాపు అన్ని కీలక పదవులను చేజిక్కించుకున్నాడు.
అయితే, మావో భార్య జియాంగ్ క్వింగ్, ఆమె వెంటన నిలిచిన మరో ముగ్గురు అనుచరుల నుంచి గుఫెంగ్‌కు వ్యతరేకత ఎదురైంది. సాంస్కృతిక విప్లవ కాలంలో మితిమీరిన హింసకు పాల్పడిన కారణంగా నలుగురినీ వెంటనే అరెస్టు చేశారు. ఈ నలుగురూ దేశ ద్రోహులంటూ పెద్దపెద్ద పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో వీరి ముఖాలపై ఎర్ర రంగు గుర్తులు పెట్టారు. అయితే, హువా ప్రభుత్వాన్ని డెంగ్ జియావోపింగ్ కూలదోశారు.
సంస్కరణల పేరుతో డెంగ్ జియావోపింగ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ నలుగురి కథ మాత్రం 1991 వరకు నడిచింది. కోర్టు గదుల్లో న్యాయమూర్తి ముందు తరచూ కనిపించేవారు. ఒక సమయంలో తనతో వచ్చిన మిగతా ముగ్గురు మావో భార్య జియాంగ్ క్వింగ్ తో విభేదించారు. వీరందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే 1991లో జియాంగ్ క్వింగ్ ఆత్మహత్య చేసుకుంది.
సాంస్కృతిక విప్లవం ముగుస్తున్న కాలంలోనే సీపీసీపై మావో పట్టుకోల్పోతూ వచ్చాడు. బహిరంగంగా ప్రకటించకపోయినా 1974 చివరి నాటికే సీపీసీ నేతలు మావోను గృహనిర్బంధంలో ఉంచారనే ప్రచారమూ ఉంది. అయితే “Black Book of Communism” పుస్తకం సంచలన వాస్తవాలను బహిర్గతం చేసింది. ప్రపంచంలో సామూహిక మారణకాండకు పాల్పడింది హిట్లర్, స్టాలిన్ కాదు మావోనే అంటూ పేర్కొంది…‘‘ Can you name the greatest mass murderer of the 20th century? No, it wasn’t Hitler or Stalin. It was Mao Zedong.an estimated 65 million Chinese died as a result of Mao’s repeated, merciless attempts to create a new “socialist” China. Anyone who got in his way was done away with — by execution, imprisonment or forced famine.’