More

  తాలిబన్లకు వ్యతిరేకంగా అతి పెద్ద జాతీయ జెండాతో ఆఫ్ఘన్ల నిరసన

  ఆగస్టు 19 న ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అనేక మంది పౌరులు రాజధాని నగరం కాబూల్ వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు నిరసించారు. కొన్ని వందల మీటర్ల పొడవు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జెండాను తీసుకుని నగరం అంతటా కవాతు చేశారు. నిరసన యొక్క వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడుతున్నాయి.

  ఆఫ్ఘనిస్తాన్ ను ‘ఇస్లామిక్ ఎమిరేట్’ గా తాలిబాన్లు ప్రకటించారు. అయితే ఇందుకు ఆ దేశ ప్రజలు ఒప్పుకోవడం లేదు. 1919 లో బ్రిటిష్ నియంత్రణ నుండి ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుంది. దేశంలో102 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాలిబాన్లు అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్‌ను ‘ఇస్లామిక్ ఎమిరేట్’ గా ప్రకటించిన వెంటనే, పురుషులు, మహిళలు, పిల్లలతో కూడిన ఆఫ్ఘన్ జాతీయులు కాబూల్ వీధుల్లోకి వచ్చారు. ‘లాంగ్ లైవ్ ఆఫ్ఘనిస్తాన్’, ‘మా జెండా, మా గుర్తింపు’ అని పెద్దఎత్తున హర్షధ్వానాల మధ్య, ఈ నిరసనకారులు జాతీయ జెండాతో నగరం మొత్తం తిరిగారు. కాబూల్‌తో పాటుగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని అనేక ఇతర ప్రదేశాలలో తమ జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా అధికారంలో ఉన్న తాలిబానీలకు వ్యతిరేకంగా తమ అసమ్మతిని తెలియజేసారు. అబ్దుల్ హక్ స్క్వేర్ లో ఇద్దరు వ్యక్తులు జాతీయ జెండాను ఆవిష్కరించడానికి స్తంభాలను ఎక్కిన వీడియోలను చూడొచ్చు.

  ఆఫ్ఘని జాతీయుల ధిక్కార చర్యలు తాలిబానీలకు ఆగ్రహం తెప్పించింది. నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని తూర్పు నగరం జలాలాబాద్‌లో ఇటువంటి ఊరేగింపులు జరిగాయి. తాలిబాన్లు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కోనార్ ప్రావిన్స్ అసదాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీపై తాలిబాన్లు కాల్పులు జరిపారు, ఇందులో అనేక మంది మరణించారని ప్రముఖ మీడియా సంస్థలు తెలిపాయి.

  గార్డియన్ మీడియా సంస్థ కథనాల ప్రకారం మహిళలు సహా వందలాది మంది నిరసనకారులు కాబూల్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తూ “మా జెండా, మా గుర్తింపు” అని నినాదాలు చేశారు. తాలిబాన్లు నిరసనకారులను చుట్టుముట్టారు. జనాలను చెదరగొట్టే ప్రయత్నంలో అరవడం మరియు గాలిలోకి కాల్పులు జరపడం వంటివి చేశారు. ఇది భయాందోళనలకు దారితీసింది, తరువాత ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. “తాలిబాన్ల కాల్పులు, తొక్కిసలాటలో చాలా మంది మరణించారు, గాయపడ్డారు” అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆగష్టు 15 ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబాన్ ఆఫ్ఘన్ జాతీయ జెండాను మార్చడంతో.. ఆ ప్రయత్నాన్ని ఆఫ్ఘన్ ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారు.

  Trending Stories

  Related Stories