International

ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడేమో డెలివరీ బాయ్

ఒకే ఒక్క సంవత్సరం.. పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మినిస్టర్ గా ఉన్న వ్యక్తి కాస్తా ఇప్పుడు డెలివరీ బాయ్ గా మారిపోయాడు. సయ్యద్ అహ్మద్ షా సాదత్ జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయి. మొన్నటిదాకా ఆయన ఆఫ్ఘనిస్థాన్ సమాచార శాఖ మంత్రిగా పనిచేసి ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్ గా మారిపోయారు. ప్రస్తుతం జర్మనీలోని లీప్జిగ్ లో ఓ పిజ్జా తయారీ సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు.

ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో విభేదాల కారణంగా, అతను 2020 లో తన దేశాన్ని విడిచిపెట్టి జర్మనీలో స్థిరపడ్డాడు. లీప్జిగర్ వోక్స్జీటుంగ్ వార్తాపత్రికలోని నివేదిక ప్రకారం, సాదత్ ఇప్పుడు జర్మనీలోని లీప్‌జిగ్ నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జర్మనీలో డెలివరీ బాయ్‌ల కోసం ఉద్దేశించిన డెలివరీ యూనిఫామ్‌లో పిజ్జాలను డెలివరీ చేస్తున్న సాదత్‌ కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సాదత్ 2018 లో ఆఫ్ఘన్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ మంత్రి అయ్యాడు. ఆఫ్ఘన్ ను తాలిబాన్ స్వాధీనం చేసుకునే ముందు 2020 లో తన పదవికి రాజీనామా చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనికేషన్ సంబంధిత సమస్యలకు సహాయం చేయడానికి జర్మనీకి వెళ్లారు, కానీ అష్రఫ్ ఘనీతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. జర్మనీలో స్థిరపడిన తరువాత సయ్యద్ అహ్మద్ షా సాదత్ దగ్గర ఉన్న డబ్బులు కొన్ని నెలల్లో అయిపోయింది. జీవనం కోసం పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేయవలసి వచ్చింది. ఆయన ఇప్పుడు తన సైకిల్‌పై నగరం చుట్టూ తిరుగుతూ, ఇంటింటికీ ఆహారాన్ని అందిస్తున్నారు.

2018లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో తాను మంత్రిగా పనిచేశానని సయ్యద్ అహ్మద్ షా సాదత్ చెప్పారు. 2020 వరకు రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశానని.. ఆ తర్వాత రాజీనామా చేసి గత ఏడాది డిసెంబర్ లో జర్మనీకి వచ్చేశానన్నారు. ఆయనకు కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో రెండు పీజీలున్నాయి. ఘనీ ప్రభుత్వం ఇంత వేగంగా కూలిపోతుందని అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 13 దేశాలలో 20 కి పైగా కంపెనీలతో కమ్యూనికేషన్ రంగంలో పనిచేశారు. “ప్రస్తుతం, నేను చాలా సామాన్య జీవితాన్ని గడుపుతున్నాను. నేను జర్మనీలో సురక్షితంగా ఉన్నాను. లీప్‌జిగ్‌లో నా కుటుంబంతో కలిసి ఉండటం నాకు సంతోషంగా ఉంది. నేను డబ్బు ఆదా చేసి జర్మన్ కోర్సు చేయాలని.. ఇంకా చదవాలనుకుంటున్నాను ”అని సాదత్ తెలిపారు. “నేను చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాను కానీ స్పందన రాలేదు. జర్మన్ టెలికాం కంపెనీలో పనిచేయాలనేది నా కల. ” అని చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 4 =

Back to top button