More

  షరియా చట్టాలను అమలు చేస్తాం.. ఆ మహిళలను వేటాడుతున్న తాలిబాన్లు

  తాలిబాన్ల కొత్త ప్రభుత్వం ఏ మాత్రం మారలేదని.. మునుపటి తాలిబన్ ప్రభుత్వం లాగేనని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతి విషయంలోనూ షరియా చట్టాన్ని అమలు చేస్తామని కొత్త ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. రెండు అతిపెద్ద లక్ష్యాలను సాధించేందుకు మా గత ప్రభుత్వం 20 ఏళ్ల పోరాటం సాగించింది. మొదటిది విదేశీ ఆక్రమణల నుంచి దేశాన్ని విడిపించడం. రెండోది స్వతంత్ర స్థిర దేశంగా మార్చడం, కేంద్రీకృత ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడమని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నియమం ఆధారంగానే ప్రభుత్వాన్ని నడపడంలో పవిత్రమైన షరియా చట్టాలను అమలు చేస్తామని తేల్చి చెప్పింది. ప్రతిభ కలిగిన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టీచర్లు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపింది. తమ దేశానికి వారి అవసరం ఎంతో ఉందని.. ప్రజలెవరూ దేశాన్ని వీడొద్దని కోరింది.

  Afghanistan to Form Women's National Team, 25 Players to Be Handed Central Contracts

  మరో వైపు గత ప్రభుత్వ హయాంలోని మహిళా క్రీడాకారులను శిక్షించాలని తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారట..! ఇప్పటికే ఎంతో మంది ఆఫ్ఘనిస్తాన్ ను వీడగా.. మరికొందరు మహిళా క్రీడాకారులు బయటకు రాకుండా దాక్కుంటున్నారు. తాలిబాన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మహిళా క్రికెటర్ల కోసం గాలిస్తున్నారు. ఓ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ అక్కడి పరిస్థుతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాబూల్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మహిళా క్రికెటర్లే కాకుండా ఇతర క్రీడలకు సంబంధించిన మహిళలు ప్రస్తుతం సురక్షితంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబాన్లు కాబూల్ లో ప్రవేశించినప్పటి నుంచి తన క్రికెట్ కిట్ దాచేశానని, ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడంలేదని వివరించింది. తాలిబాన్లు ఇప్పటికే తమను బెదిరించారని, మరోసారి క్రికెట్ ఆడితే ప్రాణాలు పోతాయని హెచ్చరించారని ఆ మహిళా క్రికెటర్ వెల్లడించింది. తమకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని, ప్రతి రోజు రాత్రివేళల్లో తమ పరిస్థితిపై చర్చించుకుంటామని.. ప్రస్తుతానికి తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలిపింది. మరో మహిళా క్రికెటర్ ఆఫ్ఘన్ విడిచి వెళ్లిపోయింది. తొలుత తాలిబాన్లకు చిక్కకుండా ఉండేందుకు అనేక ఇళ్లు మారిన ఆ క్రికెటర్, చివరికి దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. క్రికెటర్లే కాదు, ఆఫ్ఘన్ లో మహిళా ఫుట్ బాల్ జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉందని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళాక మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. మహిళలు కేవలం ఇంటికే పరిమితం చేయాలని తాలిబాన్లు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక వారిని క్రీడల విషయంలో తాలిబాన్లు అనుమతి ఇచ్చే అవకాశాలే లేవని అంటున్నారు.

  కొనసాగుతున్న మహిళల ఆందోళనలు:

  ఆఫ్ఘనిస్తాన్‌ మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వరుసగా నాలుగో రోజు బుధవారం కూడా మహిళలు తమ హక్కులను కాపాడాలంటూ కాబూల్‌ రోడ్లపైకి వచ్చారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగిన మహిళలపై తాలిబాన్‌ పోలీసులు లాఠీలతో కొట్టారు. తుపాకులు ఎక్కుపెట్టి ఆందోళన విరమించేలా ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ వారు వినకుండా ఆందోళన కొనసాగించారు. జనాలను చెదరగొట్టడానికి తాలిబాన్ యోధులు దాడులకు పాల్పడ్డారు. వార్తను కవరేజ్‌ చేయడానికి వచ్చిన ఓ జర్నలిస్టును వాతలు తేలేలా బెల్టుతో కొట్టారు. రోడ్డు మీదుగా వెళ్తున్న బాలికలను కూడా దారుణంగా కొట్టారు. ఆందోళనలను కవర్‌ చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్లాట్‌ఫాం ఎటిలాట్ రోజ్‌లోని ముగ్గురు జర్నలిస్టులను తాలిబాన్‌ అదుపులోకి తీసుకున్నది. మంగళవారం కూడా కాబూల్‌లో మహిళల ప్రదర్శనలను కవర్ చేసిన 20 మందికి పైగా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలా మందిని తీవ్రంగా కొట్టారు.

  తాలిబన్‌ ఫైటర్‌ తుపాకీ ఎక్కుపెట్టినప్పటికీ ఒక మహిళ తన నిరసన కొనసాగించింది. కాబూల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయం ఎదుట ఆ దేశానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. అప్పుడు తాలిబాన్‌ ఫైటర్‌ ఒక మహిళకు తుపాకీ గురిపెట్టాడు. అయినప్పటికీ ఆమె బెదరక తన నిరసన కొనసాగించింది. రాయిటర్స్‌ జర్నలిస్ట్‌ తీసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  తాలిబన్‌ ఫైటర్‌ తుపాకీ ఎక్కుపెట్టినా.. బెదరని ఆఫ్ఘన్‌ మహిళ

  Related Stories