భారీ భూకంపం వచ్చిదంటే చాలు ఇళ్లన్నీ నేలమట్టమావడమే కాకుండా భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవిస్తుంటుంది. మన దేశంలో కంటే విదేశాల్లో వచ్చే భూకంపాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంటుంది.
ఇక తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది. ఈ భూకంపం ధాటికి సుమారు 255 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 1,250 మంది గాయపడ్డారని తెలిపారు. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలలో చిక్కుకున్నవారి ఫొటోలు, వీడియోలు పెద్దసంఖ్యలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ భూకంపం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద పెద్ద శబ్దాలతో భూమి కంపించడంతో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. భూకంపం సంభవించిన ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. మానవతా విపత్తును నివారించడానికి భూకంపం బాధితులకు తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వ ప్రతినిధి బిలాల్ కరీమీ ట్వీట్ చేశారు.
అటు పాకిస్థాన్ లో తీవ్ర భూకంపం సంభవించింది. పాక్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. తెల్లవారుజామున 2:24 గంటలకు సంభవించినట్లు అమెరికా జియెలాజికల్ సర్వే వెల్లడించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా, అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మీడియా వెల్లడించింది. పాకిస్థాన్‌తో పాటు మలేషియా కౌలాలంపుర్‌కు 561 కిలోమీటర్ల పశ్చిమాన భూమి కంపించింది. అర్ధరాత్రి 12:38 గంటలకు 5.61 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలాజి తెలిపింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు పెట్టారు. గత శుక్రవారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, ముల్తాన్ నగరాల్లో 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఫైసలాబాద్, అబోటాబాద్, స్వాత్, బునేర్, కోహట్, మలాకంద్‌లలో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో వారంలోనే మూడుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఇక సరిగ్గా నెల రోజుల క్రితం దక్షిణ అమెరికా దేశం పెరులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ పెరులోని అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 8 మైళ్లదూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. లిటికాకా సరస్సుకు సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రాంతం పెరు- బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. దాదాపుగా 217 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పెరు తీరాన్ని అనుకుని ఉన్న పసిఫిక్ సముద్రంలో నాజ్కా టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది తూర్పు ఈశాన్య దిశగా 71 మి.మీ కదలుతోంది. దీంతో నాజ్కా, అమెరికా ప్లేట్లు పరస్పరం ఢీకొనడంతో భూకంపాలు నమోదు అవుతున్నాయి. ఈ ప్రాంతంలో చాలా లోతులో భూకంపాలు వస్తాయి. గతంలో భూమికి 600 కిలోమీటర్ల లోతులో కూడా భూకంపాలు సంభవించాయి. పెరూ- చిలీ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక్కడ భూమి ఉపరితలం కింద నిరంతరం టెక్టానిక్స్ ప్లేట్స్ నిరంతరం స్థానభ్రంశం చెందుతుంటాయి.