జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ చేసిన వ్యాఖ‍్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ‍్యలపై తాజాగా తాలిబన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్ధాన్ ప్రభుత్వం స్పందించింది.
తాజాగా ట్విట్టర్ వేదికగా.. ఇస్లాంను అవమానించి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ఉన్మాద చర్యలను భారత్ అనుమతించరాదని తాము కోరుతున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజహిద్ అన్నారు. మహ్మద్ ప్రవక్తపై అధికార బీజేపీ పార్టీ నేత వ్యాఖ‍్యలను తాము ఖండిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. ఈ క్రమంలోనే మతోన్మాదంపై భారత్‌కు తాలిబన్లు కీలక సూక్తులు వల్లించారు. అంతకుముందు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియాలో మతసామరస్యం దెబ్బతింటోందని, ముస్లింలను అణిచివేస్తున్నారని.. దీన్ని ప్రపంచ దేశాలు గమనించాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాక్ వ్యాఖ్యలు, ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది.
అయితే ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య భగ్గుమంది. భారత్‌పై తగు చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. మహ్మద్ ప్రవక్త పట్ల తమకున్న ప్రేమ అపారమని అన్నారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ప్రతినిధి చేసిన విద్వేషపూరిత దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భారత్‌లో ముస్లింల పట్ల మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వైఖరితో ముందుకెళుతోందని, ముస్లింలపై హింసాకాండను ప్రేరేపిస్తోందని పాక్ ప్రధాని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతల వివాదాస్పద ప్రకటనలను ఖతార్, కువైట్‌లు తీవ్రంగా ఖండించాయి. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మ, మరో నేత నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.