More

  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబాన్లు అనుకుంటూ ఉండగా.. ఝలక్ ఇచ్చిన మహిళలు

  తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తూ ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు. అయితే ప్రజల్లో మాత్రం తాలిబాన్ల పాలన అంటే భయం ఉంది. గతంలో తాలిబాన్ల పాలనలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇదే జరగబోతోందని భావిస్తూ వస్తున్నారు. అందుకే తాలిబాన్లకు వ్యతిరేకంగా మహిళలు రోడ్ల మీదకు వస్తున్నారు. బురఖాలను కూడా ధరించడానికి సిద్ధమే.. కానీ పనులు చేసుకోడానికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు.

  ఆఫ్ఘన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలోని చాలా పట్టణాలలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్‌లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. తాము బురఖాలను ధరించడానికి సిద్ధమేనని.. అయితే ఉద్యోగాలు మాత్రం తమకు కావాలని తాలిబాన్లకు మహిళలు తెగేసి చెబుతూ వస్తున్నారు. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తమ కుమార్తెలు తాలిబాన్ పాలనలో పాఠశాలకు వెళ్లగలిగితే బురఖా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ మహిళలు నిరసనల్లో తెలిపారు.

  ఇంతకు ముందు తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు.. మహిళలు, బాలికలకు విద్య మరియు ఉపాధి నిరాకరించబడింది. బహిరంగంగా బుర్ఖాలు తప్పనిసరి అయ్యాయి, మగ తోడు లేకుండా మహిళలు ఇంటిని వదిలి వెళ్లలేరు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. “మా హక్కులను అడగడానికి మేము ఇక్కడ ఉన్నాము” అని ప్రదర్శనకారులలో ఒకరైన ఫెరెస్తా తాహెరి ఫోన్ ద్వారా మీడియాకు తెలిపారు. “తాలిబన్లు మాకు చెబితే మేము బురఖా ధరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, కానీ ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లాలని, మహిళలు పని చేయాలని మేము కోరుకుంటున్నాము” అని నిరసన కారులు తెలిపారు. ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న హెరాత్ నగరంలో మొదలైన నిరసన ప్రదర్శనలు ఇతర ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి.

  తాలిబాన్లు అధికారం లోకి వచ్చాక మహిళలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో కుటుంబాలను దిగజారుస్తోంది. ఇంట్లో ఆడవాళ్లు పని చేస్తేనే గడవని కుటుంబాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు దిగజారకముందే తమను పనులకు అనుమతించాలని ఆందోళనకారులు కోరారు. తాము మహిళలను ఉద్యోగాలకు అనుమతిస్తామని ప్రపంచ దేశాలకు తాలిబాన్లు చెబుతున్నా.. అవి అబద్ధాలేనని నిరసనకారులు అంటున్నారు. ఆడవాళ్లను అసలు ఆఫీసుల్లోకి అనుమతించడం లేదని.. కాదని వెళ్లే ప్రయత్నాలు చేస్తే అరెస్ట్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆడ పిల్లలను స్కూల్స్‌, కాలేజీల్లోకి అనుమతించలేదని నిరసనకారులు మండిపడ్డారు.

  మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చలు జరుపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కొత్త పరిపాలనలో చాలా మార్పులను చూస్తారని.. మహిళలకు అవకాశం దక్కుతుందని తాలిబాన్ ప్రతినిధులు చెప్పినప్పటికీ.. అక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్‌ మొదలైంది. ఇప్పటికే తాలిబాన్ల సమావేశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక క్యాబినెట్‌లోనూ మహిళలకు చోటు దక్కడం అసంభవమే..! తాలిబాన్ సమావేశాలలో ఏ స్త్రీలను ఇప్పటి వరకూ చూడలేదని హెరాత్ నిరసనకారులు అన్నారు.

  తాలిబాన్లు మాత్రం మహిళలు పని చేయడానికి అనుమతించబడుతుందని అయితే షరియా చట్ట పరిమితుల్లోనే ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయ గుర్తింపు కోసం కొద్దిరోజులు తాలిబాన్లు కాస్త మంచిగా వ్యవహరించే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే లోపే తాలిబాన్లకు వ్యతిరేకంగా మహిళలు గళం విప్పడంతో తాలిబాన్ ప్రతినిధులు కూడా షాక్ తిన్నారు. “మేము ప్రభుత్వంలో భాగం కావాలనుకుంటున్నాము – మహిళలు లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడదు. తాలిబాన్లు మాతో సంప్రదింపులు జరపాలని మేము కోరుకుంటున్నాము.” అని మహిళలు గట్టిగా తమ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. తిరిగి పనికి వెళ్ళడానికి ధైర్యం చేసిన వైద్యులు మరియు నర్సుల వంటి కొందరు మహిళలను తాలిబాన్లు ఎగతాళి చేసిన ఘటనలు, వారిని వెనక్కు పంపిన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బాలికలతో సహా ప్రాథమిక పాఠశాల వయస్సు పిల్లలు కూడా పాఠశాలల నుండి తిరిగి వచ్చేసారు. అయితే ప్రభుత్వం ఏర్పడే వరకు తదుపరి విద్య నిలిపివేయబడిందని తాలిబాన్లు చెప్పుకొచ్చారు.

  Trending Stories

  Related Stories