More

    విధులకు హాజరైన ఆఫ్ఘన్ పోలీసులు.. పాక్ లోకి వెళ్ళడానికి ఆఫ్ఘన్ పౌరుల నిరీక్షణ

    తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలియని విధంగా మారింది. ముఖ్యంగా పోలీసులను తాలిబాన్లు ఏమి చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాలిబాన్లు ఆఫ్ఘన్ పోలీసులను విధుల్లోకి రమ్మని పిలిచారు. దీంతో ఆఫ్ఘ‌న్ పోలీసులు మ‌ళ్లీ విధుల్లో చేరారు. ఆగ‌స్టు నెల‌లో తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌ను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత పోలీసులు భ‌య‌ప‌డి త‌మ విధుల‌కు దూరంగా ఉండగా.. తాలిబాన్ క‌మాండ‌ర్స్‌ పిలుపుతో మ‌ళ్లీ విధుల్లో చేరిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద విధుల్లో ఉన్న పోలీసులు మాట్లాడుతూ తాలిబాన్ క‌మాండ‌ర్స్ త‌మ‌కు ఫోన్ చేసి విధుల్లోకి రావాల‌ని చెప్పారు. దాంతో తాము మ‌ళ్లీ డ్యూటీ చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఎయిర్‌పోర్టులోని ప్ర‌ధాన భ‌వ‌నాల వ‌ద్ద‌, చెక్ పాయింట్ల వ‌ద్ద పోలీసులు విధుల్లో ఉన్నారు. మరిన్ని ప్రాంతాల్లో కూడా ఆఫ్ఘన్ పోలీసులు విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. పలువురు ప్రభుత్వ విభాగాలకు చెందిన వారిని కూడా తాలిబాన్లు సాఫీగా ఉద్యోగం చేసుకోవాలని కోరారు.

    ఇక దేశాన్ని వీడాలని భావించిన ఆఫ్ఘన్ పౌరులు.. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ బోర్డర్ల వద్దకు చేరుకున్నారు. ఆఫ్ఘన్ నుంచి ఆయా దేశాల్లోకి భూమార్గం ద్వారా వెళ్లేందుకు వేలాది మంది ప్రయత్నాలు చేశారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లోని చమన్ బోర్డర్ కు ఆప్ఘన్లు చేరుకున్నారు. వీలైనంత త్వరగా పాక్ భూభాగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. పేరుకేమో ఆఫ్ఘన్ ప్రజలను ఆదుకుంటామని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. ఆఫ్ఘన్ ప్రజలను లోపలికి మాత్రం అనుమతించలేదు. ఆఫ్ఘన్ ప్రజలు పాక్ బోర్డర్ లో ఉన్న ఫొటోలను శాటిలైట్ గత వారం తీసింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక కొన్ని వారాలుగా సరిహద్దులకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. చిన్న పిల్లలు, బ్యాగులు, ఇతర లగేజీ వేసుకుని కుటుంబాలు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద తాత్కాలిక టెంటులు వేసుకుని బోర్డర్ దాటేందుకు యత్నిస్తున్నారు. ఆప్ఘన్లు తమ దేశంలో ప్రవేశించకుండా పాక్ బోర్డర్లను మూసేసింది. తాలిబాన్లు మాత్రం ఎవరూ దేశం విడిచిపెట్టవద్దని కోరుతూ ఉన్నారు. పరిస్థితులు చక్కదిద్దుతామని హామీ ఇస్తున్నా.. ఆఫ్ఘన్ ప్రజలు మాత్రం నమ్మడం లేదు.

    Trending Stories

    Related Stories