ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారని తెలియగానే ఆ దేశ ప్రజల్లో ఎక్కడ లేని ఆందోళన మొదలైంది. దేశం నుండి బయటపడాలని చాలా మంది ప్రయత్నించారు. కొందరు పాస్ పోర్టులను పట్టుకొని కాబూల్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ విమానాలు అందుబాటులో లేవు. ఏకంగా రన్ వే మీదకు ప్రజలు వచ్చేశారు. ఎలాగైనా వెళ్లిపోవాలని భావించిన కొందరు విమానం రెక్కలపై కూర్చున్నారు. అమెరికా రవాణా విమానాన్ని పట్టుకుని కూర్చుంటే చాలు ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్ ను దాటేస్తామని అనుకోవడం వాళ్లు చేసిన అతి పెద్ద తప్పు. గాల్లోకి ఎగసిన కొన్ని సెకండ్లలోనే వారు కిందకు రాలిపోయారు. కాబూల్ లోని జనావాసాలపై పడి దారుణంగా మరణించారు.
ఆఫ్ఘనిస్తాన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ తాలిబాన్ పాలన నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన జకీ అన్వారీ అనే జాతీయ జట్టు ఫుట్‌బాల్ క్రీడాకారుడు మరణించాడని వెల్లడించాడు. అన్వారీ సోమవారం (ఆగస్టు 16) USAF బోయింగ్ C-17 చక్రాలకు అతుక్కుపోతున్నప్పటికీ, కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి విమానం బయలుదేరిన వెంటనే కిందకు జారి పడ్డాడు.
కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంటున్న అమెరికా సైనిక రవాణా విమానం సి-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని పట్టుకుని వేళ్లాడిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారిలో యువ ఫుట్ బాల్ క్రీడాకారుడు జకీ అన్వారీ ఒకరు. 19 ఏళ్ల అన్వారీ కాబూల్ లోని ఎస్తెఘ్ లాల్ స్కూల్ లో చదువుతున్నాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు.. జాతీయ యూత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్ బాల్ మీద ప్రేమ తాలిబన్ల చేతిలో బలవ్వకూడదన్న భయంతో అతడు విమానం పైకి ఎక్కాడు. సీ-17 ల్యాండింగ్ పరికరాలపైకి ఎక్కి దేశాన్ని వీడాలని భావించి విమానం గాల్లోకి లేవగానే అక్కడి నుంచి జారిపడి చనిపోయాడు. విమానం నుండి మనుషులు జారి పడిన వీడియోను చూసి ఎంతో మంది కలతచెందారు. ఇక చనిపోయింది ఓ ఫుట్ బాల్ ప్లేయర్ తెలిసిన తర్వాత మరింత దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు.

అన్వారి కోచ్ మోబిన్ ముహమ్మద్ మాట్లాడుతూ అతను ఒక అద్భుతమైన యువ ఆటగాడు, చాలా మంచి మనిషి అని చెప్పుకొచ్చాడు. జకీ అన్వారీ విమానం నుండి కిందపడడంతో అతని ఎముకలన్నీ పగిలిపోయాయని అతని సహచరుడు రహిల్ అబిద్ తెలిపాడు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్స్ (FIFPRO) కూడా అతడి మృతి పట్ల సంతాప సందేశాన్ని పంచుకుంది.
“సోమవారం కాబూల్ విమానాశ్రయంలో యుఎస్ విమానం నుండి పడిపోయిన యువ ఆఫ్ఘన్ జాతీయ జట్టు ఫుట్‌బాల్ క్రీడాకారుడు జకీ అన్వారీ కుటుంబానికి, స్నేహితులకు మరియు సహచరులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.” అని ఫెడరేషన్ ప్రకటనలో పేర్కొంది.

జకీ అన్వారీ ఎవరు?
అన్వారీ 19 ఏళ్ల యువకుడు. అతను ఆఫ్ఘనిస్తాన్ జాతీయ సాకర్ జట్టు కోసం ఆడాడు. న్యూయార్క్ టైమ్స్ (NYT) అతని వయస్సు 17 సంవత్సరాలు అని తెలిపింది. టేకాఫ్ అయిన తర్వాత USAF బోయింగ్ C-17 నుండి కొంత మంది కిందపడి మరణించినట్లు వార్తలు వచ్చాయి. వారిలో జకీ అన్వారీ కూడా ఒకరు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన తర్వాత, విమానం ల్యాండింగ్ గేర్‌లో మానవ డిఎన్‌ఎను కనుగొన్నట్లు యుఎస్ ఎయిర్ ఫోర్స్ అంగీకరించింది. వేలాది మంది ఆఫ్ఘన్ యువకుల లాగే అన్వారీ కూడా దేశం విడిచి వెళ్లాలని అనుకున్నాడు.. కానీ యుఎస్ విమానం నుండి కిందపడి మరణించాడని పలు మీడియా సంస్థలు తెలిపాయి.

అతని ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం, జకీ అన్వారీ ఎస్టెక్లాల్ హైస్కూల్ విద్యార్థి. ఆఫ్ఘనిస్తాన్ ఒలింపిక్ కమిటీకి చెందిన ఆరెఫ్ పేమన్ మాట్లాడుతూ మరణించిన జకీ అన్సారీ తక్కువ ఆదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలియజేశారు. అతను పాఠశాలకు హాజరవుతూనే ఫుట్ బాల్ లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని తెలిపారు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి అన్వారీ చాలా కష్టపడాల్సి వచ్చిందని పేమన్ తెలిపారు. అతను మంచి వ్యక్తి, సహనం కలిగి ఉన్న వాడని.. కానీ ఆఫ్ఘన్ యువకులలో చాలా మందిలాగే తాలిబాన్ల రాక తన కలలు, క్రీడా అవకాశాల ముగింపుగా భావించి అతడు దేశం విడిచి వెళ్లాలని భావించాడని పేమన్ చెప్పుకొచ్చాడు. అతడు మెరుగైన జీవితాన్ని కోరుకున్నాడని.. అందుకే అలా విమానాన్ని పట్టుకుని వెళ్లిపోవాలని అనుకున్నాడని పేమన్ తెలిపాడు.

గతంలో తాలిబాన్ పాలన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో క్రీడలు మరియు సంగీతాన్ని నిషేధించారు. ఇప్పుడు కూడా తాలిబాన్లు అధికారం చేపట్టడంతో యువత తమకు మెరుగైన జీవితం దక్కదని భావించి ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్ ను వీడాలని భావించారు.

ఆఫ్ఘన్ తల్లుల కడుపుకోత:
ఆఫ్ఘనిస్తాన్ మహిళలు తమ పిల్లలను కాపాడుకోడానికి కాబూల్ విమానాశ్రయం చుట్టూ పెట్టిన కంచెల పైనుంచి విమానాశ్రయంలోకి విసిరేస్తున్నారు. తమ పిల్లలను కాపాడి తీసుకెళ్లండంటూ అమెరికా, బ్రిటన్ దేశాల సైన్యానికి వేడుకుంటూ ఉన్నారు. వాళ్లొచ్చేస్తున్నారు, కాపాడండంటూ వారు పెట్టిన ఆర్తనాదాలు సైన్యానికే కన్నీరు తెప్పిస్తున్నాయి. మహిళలు తమ పిల్లలను కంచె మీది నుంచి విసిరేసి తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని చూసి తమ సైనికులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని బ్రిటన్ సీనియర్ ఆర్మీ అధికారి చెప్పారు. కొందరు పిల్లలు ఆ ఇనుప ముళ్ల కంచెల్లోనే చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. పిల్లలను తీసుకొని కాబూల్ విమానాశ్రయం గేట్ దగ్గర వారి తల్లులు వేచి చూడడం అందరినీ కలిచివేసింది. వారిని బెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు కూడా జరిపారు. తాము ఎలాగోలా బ్రతికేస్తాం.. కానీ తమ తర్వాతి తరం అయినా బాగుండాలనే ఉద్దేశ్యంతో తల్లులు పిల్లలను ఆఫ్ఘనిస్తాన్ దాటించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


