National

ఏఈఎఫ్ఐ కమిటీ కీలక నివేదిక.. వ్యాక్సిన్ తీసుకున్నాక మరణించింది ఒక్కరే

కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. రాబోయే నెలల్లో వ్యాక్సిన్ల సంఖ్యను భారీగా పెంచాలనే ప్రణాళికలను కూడా భారత ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా మహమ్మారి కారణంగా మరణాలు సంభవించడం చాలా అరుదు అని చెబుతున్నారు. వ్యాక్సిన్ల కారణంగా శరీరంలోకి వెళ్లిన యాంటీ బాడీస్ కరోనా మహమ్మారి శరీరంపై ప్రభావం చూపకుండా అడ్డుకుంటూ ఉన్నాయని ఇప్పటికే పలు నివేదికల్లో వెల్లడైంది.

భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు మరణించినది ఒక్కరేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీకా తీసుకున్న తర్వాత 31 మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయని.. వారిలో టీకా తీసుకున్న 68 ఏళ్ల వ్యక్తి ఒకరు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్ఐ) కమిటీ నివేదికలో తేలింది. మొత్తం 31 కేసులలో మూడు కేసులు అనాఫిలాక్సిస్ కు సంబంధించినవని.. వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చేరి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఒకరు మాత్రం మరణించారు. మరణించిన వ్యక్తి మార్చి 8న తొలి డోసు తీసుకున్నట్టు నివేదికలో తేలింది. అదే నెల 31న అనాఫిలాక్సిస్ రియాక్షన్ కారణంగా మరణించినట్టు నివేదికలో తెలిపారు. దాదాపు 18 కేసులకు వ్యాక్సిన్లతో సంబంధం లేదని గుర్తించారు. టీకా తీసుకోవడం వల్ల ప్రయోజనాలే ఎక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మిలియన్ వ్యాక్సిన్లకు మరణాల రేటు 2.7గా, ఆసుపత్రుల్లో చేరే వారి రేటు 4.8గా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. కాబట్టి వ్యాక్సిన్ విషయంలో ప్రచారంలో ఉన్న వదంతులను పక్కన పెడితే ఎంతో మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు. వ్యాక్సిన్ ప్రజల ప్రాణాలను రక్షిస్తుందని తేల్చి చెబుతున్నారు నిపుణులు. ప్రజలు వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావాలని సూచిస్తూ ఉన్నారు.

ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం కీలక సూచనలు ఇచ్చింది. ఇకపై 18 ఏళ్లు నిండిన వాళ్లు సైతం కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి నేరుగా డోసులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది తప్పనిసరి నిబంధనేమీ కాదని తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా తెలిపింది. దేశంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తాజా వ్యాక్సినేషన్ డ్రైవ్ తో అత్యధిక శాతం మంది టీకాలు పొందనున్నారు. కరోనా ముక్త్ భారత్ వైపు భారత్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

two × 4 =

Back to top button