ఉత్తరప్రదేశ్ లా కమిషన్ చైర్మన్ ఆదిత్య నాథ్ మిట్టల్ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర జనాభాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జనాభాను అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు. జనాభా చాలా ఎక్కువకు చేరుకుంది, ఆస్పత్రులు, ఆహార ధాన్యాలు, ఇళ్ళు, ఉపాధికి సంబంధించిన ఇతర సమస్యలకు ఇది కారణమైందని అన్నారు. జనాభా పెరుగుదలకు చెక్ పెట్టాలని మేము నమ్ముతున్నామని.. జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణకు భిన్నంగా ఉంటుందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జనాభా పెరుగుదల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని దీనిపై నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణకు సహకరిస్తున్న వారికి, సహాయపడుతున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా అదుపు అనేది ఏ మతానికీ వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆ రాష్ట్రంలో జనాభా నియంత్రణ విధానాన్ని ప్రతిపాదించిన ఒక్క రోజు వ్యవధిలోనే మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఒక మతానికి లేదా సమాజానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు మిట్టల్. “మేము ఏ ప్రత్యేకమైన మతానికి లేదా ఎవరి మానవ హక్కులకు వ్యతిరేకం అని సందేశం ఇవ్వడం ఇష్టం లేదు. జనాభా నియంత్రణకు సహాయం చేస్తున్న మరియు సహకరించే వారికి ప్రభుత్వ వనరులు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలనుకుంటున్నాము” అని ఆయన చెప్పారు. జనాభా నియంత్రణ బిల్లుకు సంబంధించి అధికారిక ధృవీకరణ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ రాలేదు. మిట్టల్ కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ సూచనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జనాభా నియంత్రణ కోసం రాష్ట్ర న్యాయ కమిషన్ చట్టాన్ని రూపొందించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కమిషన్ త్వరలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
ఇద్దరు పిల్లల విధానాన్ని అనుసరిస్తున్న అస్సాం:
సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని అస్సాం గత ప్రభుత్వం 2019 లో రాష్ట్రంలో జనాభా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రయోజనాలను అందించడానికి జనాభా నియంత్రణ విషయంలో కూడా చర్యలు తీసుకుంటామని ప్రస్తుత సిఎం హిమంత బిస్వా శర్మ తెలియజేశారు. పేదరికం, దీర్ఘకాలిక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి, కుటుంబ నియంత్రణ విధానాన్ని అవలంబించాలని రాష్ట్రంలోని మైనారిటీ ముస్లిం సమాజాన్ని ఆయన కోరారు.
శుక్రవారం (జూన్ 18) ఈ విషయంపై అస్సాం సిఎం మాట్లాడుతూ రుణ మాఫీ లేదా ఇతర ప్రభుత్వ పథకాలు అయినా, జనాభా నిబంధనలను పరిగణనలోకి తీసుకోబోతున్నారని తెలిపారు. ‘కేవలం టీ గార్డెన్ కార్మికులకు, ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీకి వర్తించదు. భవిష్యత్తులో, ప్రభుత్వ నిబంధనలకు అర్హతగా జనాభా నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు’ అని తెలిపారు. “ప్రభుత్వ ప్రయోజనాలను పొందటానికి క్రమంగా ఇద్దరు పిల్లల నిబంధనలను తీసుకొని వస్తాము. మీరు దీనిని ఒక ప్రకటనగా పరిగణించవచ్చు. ” అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ విధానం ఇప్పటికే అమలులో ఉందని కూడా వెల్లడించారు.