More

    రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ గా నిలిచిన మధ్యప్రదేశ్

    మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా అవతరించింది. ముంబయి జట్టుతో సాగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదిత్య శ్రీవాస్తవ సారథ్యంలోని మధ్యప్రదేశ్ జట్టు.. పృథ్వీ షా నేతృత్వంలోని ముంబైపై 6 వికెట్ల తేడాతో చరిత్ర సృష్టించింది. రెండో ఇన్నింగ్స్ లో ముంబయి జట్టు 269 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 4 వికెట్ల నష్టానికి మధ్యప్రదేశ్ ఈ లక్ష్యాన్ని అధిగమించి రంజీ టైటిల్ ను ఒడిసిపట్టింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హిమాన్షు 37 పరుగులతో టాప్ స్కోర్ చేయగా, శుభం శర్మ 30 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ 30 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకు మరోసారి కప్ అందకుండా చేశాడు.

    రాష్ట్ర క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నగరం భోపాల్‌లో ఆటగాళ్లకు ఘన స్వాగతం లభిస్తుందని చెప్పారు.“ఈ రోజు, రాష్ట్ర క్రికెట్ జట్టు చరిత్రను సృష్టించినందుకు మొత్తం మధ్యప్రదేశ్ రాష్ట్రం సంతోషంగా ఉంది. 41 సార్లు ఛాంపియన్ ముంబైని ఓడించి, ఎంపీ రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్, కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ.. మొత్తం జట్టును నేను అభినందిస్తున్నాను, ఇది మొత్తం జట్టు విజయం”అని ఆయన అన్నారు.

    ఈ విజయం వెనుక మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కృషి ఎంతో ఉంది. సాదాసీదా ఆటగాళ్లుగా ఉన్న రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యశ్ దూబే, హిమాంశు మంత్రి వంటివాళ్లని స్టార్లుగా తీర్చిదిద్దాడు. కోచ్ గా చంద్రకాంత్ పండిట్ కు ఇది దేశవాళీ క్రికెట్లో ఆరో టైటిల్ కావడం విశేషం. వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ వంటి ప్రతిభావంతులు లేకపోయినా మధ్యప్రదేశ్ జట్టు బలమైన ముంబయి జట్టును ఓడించింది.

    Trending Stories

    Related Stories