ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజైన రోజు నుండి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న వారందరూ డైరెక్టర్ ఓం రౌత్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు హిందువులు, ఇటు అభిమానులు ఇద్దరూ సినిమా టీజర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా యానిమేషన్ ఏమాత్రం బాగోలేదని అభిమానులు విమర్శిస్తుంటే,.. హిందువుల మనోభావాలు కించపరిచేలా సినిమాను నిర్మించారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీజర్ నిజంగా అంతగా నిరాశపరిచిందా అనేది చూద్దాం.
ఆదిపురుష్ భారత చలన చిత్ర రంగంలో భారీ బడ్జెట్ సినిమాగా చెబుతున్నారు. ఐదువందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తుండగా వీఎఫ్ఎక్స్కే 250 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో పాటు బాహుబలి ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. అయితే సినిమా టీజర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఇందులో ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ను ప్రేక్షకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాకు కేటాయించిన బడ్జెట్లో 250 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్కే కేటాయించడంతో సినీ అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇందులో ఆశించినంత స్థాయిలో వీఎఫ్ఎక్స్ లేకపోవడం, టీజర్ మొత్తం ఏదో కార్టూన్ ఛానెల్ చూసినట్లు అనిపిస్తోందంటూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు 250 కోట్లు ఎలా ఖర్చుపెట్టారనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓం రౌత్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆదిపురుష్.. డైరెక్షన్ విషయంలో పూర్తిగా ఫెయిలైందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ వంటి నటుడిని రాముడిలా చూపడంలో కూడా ఓం రౌత్ విఫలమయ్యారు. సినిమా తీసిన విధానంలో చాలా లోపాలున్నాయని అభిమానులు విరుచుకుపడుతున్నారు.
ఇక ఆదిపురుష్ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించే, గౌరవించే ప్రేక్షకులనే లక్ష్యంగా చేసుకుని సినిమాను తీశారు. రాముడంటే ఇష్టం ఉన్నవారు ఎక్కువగా చూస్తారనే భావనతో పూర్తి రామాయణం ఆధారంగా ఈ సినిమాను తీసారు. దీంతో హిందువులు కూడా రాముడిపై సరికొత్త సినిమా రాబోతోందనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఆదిపురుష్ సినిమాను హిందూత్వ వాదులే పూర్తిగా వ్యతిరేకించడంతో ఓం రౌత్ కు ఏంచేయాలో పాలుపోవడంలేదు. ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ పూర్తి ధర్మబద్దంగా తీస్తాడనే నమ్మకం పెట్టుకున్నారు హిందువులు. ప్రభాస్ హీరోగా ఉండటంతో హిందూ భావజాలానికి ఏమాత్రం అవమానం కల్గించడనే నమ్మకంతో ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే టీజర్ రిలీజవ్వగానే ఇన్నాళ్లూ ఆశతో ఎదురుచూసిన హిందూత్వవాదులకు కోపం కట్టలు తెంచుకుంది. డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను పూర్తి బాలీవుడ్ సెక్యులరిజంతో నింపేయడం వల్ల హిందువులందరూ తిరగబడుతున్నారు. సినిమాలో ఏమాత్రం భక్తి భావన లేకపోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్నాళ్ళూ రామాయణమంటే.. ఆజానుబాహుడైన రాముడు, మహాసాధ్వి సీతమ్మ తల్లి, రాజ ఠీవి ఉట్టిపడే రావణుడితో పాటు చూడగానే రోమాలు నిక్కబొడుచుకునేంత ధైర్యం వచ్చే వానరసైన్యం ఇవే గుర్తొచ్చేవి. అయితే ఓం రౌత్ తీసిన సినిమాలో ఇవేమీ లేవు. అసలది రామాయణం అని చెప్పుకోవడమే తప్ప రామాయణ మూలాలేవీ ఆ టీజర్ లో కనబడలేదు. రాముడి వేషధారణ నుండి రావణుడి లంక వరకు అది ఏమాత్రం రామాయణం అనుకునే విధంగా లేదు.
ఈ సినిమాపై ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తున్నారు. అయితే సినిమా పేరిట ఈవిధంగా ఇతిహాసాలను వక్రీకరించి తీస్తే ప్రజలపై ఎటువంటి ప్రభావం పడనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి ఆది పురుష్ లాగే గతంలో కూడా భారత ఇతిహాసాల మీద ఎంతో ఎన్నో సినిమాలు తీశారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా ఇతిహాసాలపైనే ఎక్కువగా సినిమాలు తీశారు. కానీ, వాటిపై కూడా కొన్నిసార్లు వివాదాలు చెలరేగాయి. దానవీర శూర కర్ణ సినిమాలో కర్ణుడిలోని మంచి లక్షణాలు మాత్రమే చూపించి అతడిలో చెడును ఎక్కువగా చూపలేదు. దీంతో అప్పటి తరానికి కర్ణుడు చాలా మంచివాడనే ముద్ర పడిపోయింది. అంతేకాదు,.. ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర కంటే దుర్యోధనుడి పాత్రలోనే ఎక్కువగా కనిపించడం, దుర్యోధనుడి ఠీవికు ప్రేక్షకులు ముగ్దులవడంతో ప్రేక్షకుల్లో చెడు ఎక్కువగా ఎక్కిందనే విమర్శలు వచ్చాయి. ఇదే కాకుండా ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా భారత ఇతిహాసాలు చాలా వక్రీకరణలకు గురైంది. సాధారణంగా నారదుడు సర్వవేద పారాయణుడు. అన్ని విజ్ఞానాలనూ అవసోపన పట్టినవాడు. అందుకే ముక్కోటి దేవతల వద్ద నారదుడు సకల గౌరవాలు పొందుతుంటాడు. దీంతో పాటు సమాచార తరంగిణి లా అవసరమైన విషయాలను దేవీదేవతలకు చేరవేసే బాద్యతను నారదుడి నెరవేరుస్తూ ఉంటాడు. కానీ సినిమాలు వచ్చాక నారదుడిని ఘోరంగా అవమానించడం మొదలైంది. అతడి పాత్రను ఇద్దరిమధ్య చాడీలు చెప్పేవాడిలాగా, భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టేవాడిలాగా మార్చేశారు. ఎంతగా అంటే నారదుడంటే ఒక కమెడియన్ పాత్రకు మాత్రమే చిత్రీకరించే దశకు చేరుకుంది. దీంతో నారదుడి గొప్పదనం ఇప్పటితరానికి తెలియకుండా పోయింది. ఈ విధంగా సినిమాలు మానవ జీవనంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఇప్పటి తరంలో రామాయణ, మహాభారత గాధలు బోధించేవారు కానీ,.. చదివేవారు కానీ చాలా తగ్గిపోయారు. అందుకే నిజమైన రామాయణం గురించి చాలామందికి తెలియదు. దీంతో సినిమాలనే ఇతిహాసాలుగా భావించేవారు ఎక్కువైపోయారు. సినిమాల్లో ఏం చూపించినా నిజమనుకునే భ్రమలో పడిపోతారు. ఇక సినిమా మొదలయ్యే ముందు చిత్రంలోని పాత్రలన్నీ కల్పితాలే అని సువర్ణాక్షరాలు లిఖించినా,.. దాని ప్రభావం ఏపాటిదో అందరికీ తెలిసిన విషయమే..
ఇక ఆదిపురుష్ విషయంలో హిందువులు పెదవి విరుస్తుంటే.. డైరెక్టర్ వాదన మరోలా ఉంటుంది. సాధారణంగా సినిమాలను ఎవరు నిర్మించినా అది ఆదాయవనరుగానే భావిస్తారు. భక్తి సినిమాలు తీసిన యాక్షన్ సినిమాలు తీసినా,.. పెట్టిన పెట్టుబడికి ఎక్కువ ఆదాయం రాకపోతే సినిమా తీయలేరు. డైరెక్టర్ ఓం రౌత్ ఇచ్చిన తాజా ఇంటర్యూల్లో కూడా ఇదే అర్థం వచ్చేలా చెప్పారు. తాము ఆదిపురుష్ ని హాలీవుడ్ కోణంలో చూపించాలనుకున్నామని.. అందుకే, కిరీటం, విభూధి లాంటివి పెడితే ప్రేక్షకులు సినిమా చూడలేరనే భావనతోనే డిఫరెంట్ లుక్ లో చూపించినట్టు సర్దిచెప్పుకున్నారు. అయితే ఆయన సమర్థన ఎలావున్నా.. రావణుడి హెయిర్ స్టైల్ కానీ, గబ్బిలం మీద రావడం, వానర సేనను చింపాంజీ సేనగా చూపించడం వంటి వక్రీకరణలు చేయడాన్ని హిందువుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా కమర్షియల్ పేరుతో చరిత్రను వక్రీకరించడం నైతికమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. హిందువులందరూ తల్లితో సమానంగా కొలిచే సీతమ్మను కూడా ఒక హీరోయిన్ లాగా చూపడం వంటివి తప్పనే భావనే అందరిలోనూ వ్యక్తమవుతోంది. రావణుడి వేషధారణ అయితే మరీ దారుణంగా ఉండటాన్ని కూడా తప్పుబడుతున్నారు.
ఎప్పుడో 1980లలో వచ్చిన రామాయణ సీరియల్ ను తాజాగా విడుదల చేస్తే కోట్లమంది వీక్షించారు. ఈ సీరియల్ ను ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికీ రామాయణం ఎక్కువమంది వీక్షించిన సీరియల్ గా రికార్డుల్లో ఉంది. అయితే ఈ సీరియల్ లో ఎటువంటి అత్యాధునిక గ్రాఫిక్స్ కూడా లేదు. ఉన్నదల్లా రామాయణాన్ని ఉన్నదున్నట్లు చూపడమే. అందుకే ఈ సీరియల్ ఇంతటి జనాదరణ పొందింది. ఎప్పుడో తీసిన సీరియల్ ను ఆదరించిన హిందువులు ఉన్నదున్నట్లు తీసి ఉంటే ఆదిపురుష్ కూడా మంచి స్పందనే వచ్చేదని భావిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా విషయంలో దర్శకులు, ప్రేక్షకుల వాదన ఎలా వున్నప్పటికీ.. కేవలం డబ్బుకోసం చరిత్రను వక్రీకరించడం అనేది నైతికమా..? అన్నది నేటి సినీ దర్శక నిర్మాతలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం వుంది.