More

    జులై నెలలో పది, ఇంటరు పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తాం: ఏపీ ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు భారీగా తగ్గుతూ ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్త్, ఇంటర్ సెకండ్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెబుతూనే వస్తున్నారు. ఇక జులై నెలలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాజాగా వెల్లడించారు. కరోనా కేసులు తగ్గుతుండడంతో జులైలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని.. జులై మొదటి వారంలో ఇంటరు, చివరి వారంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

    సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని.. కరోనా లేకపోతే పరీక్షలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. జులైలో పరీక్షలు నిర్వహించలేకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామని ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. తాము కచ్చితంగా జులైలోనే పరీక్షలు పెడతామని చెప్పడంలేదని, అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నామని కూడా అన్నారు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణపై సమీక్షించుకుంటున్నామని.. పరీక్షలు రద్దు చేయడం అనేది తమకు ఎంతో సులభమైన పని అని, ఒక్క నిమిషంలో రద్దు చేయగలమని తెలిపారు. కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేరళ, బీహార్ రాష్ట్రాలు విద్యార్థులకు పరీక్షలు జరిపాయని, చత్తీస్ గఢ్ కూడా పరీక్షలు జరుపుతోందని.. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు జరుపుతామని హామీ ఇచ్చారు.

    ఏపీలో ఈనెల 20 వరకు కర్య్ఫూ ఉండడంతో ఆ తర్వాత విద్యార్థులకు 15 రోజుల సమయం ఇచ్చి పరీక్షలను నిర్వహించేందుకు ఇంటరు విద్యామండలి షెడ్యూలు రూపొందించింది. జులై 7నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల(ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను జులై 26 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

    Related Stories