సందడిగా దండారి

0
776

అడవి తల్లి ఒడిలో దండారి సంబరాలు అంబరాన్ని అంటాయి. దీపావళి పండుగ వేళ లోకమంతా వెలుగులతో మురిసిపోతుంటే.. ఆదివాసీ గూడాలు గుస్సాడీ నాట్యాలతో మరింత శోభాయమానంగా కనిపించాయి. హరిత వనంలోని గోండు గూడాలు దండారితో మారుమోగాయి. వాయిద్యాల చప్పుళ్లతో, ఘల్లు ఘల్లుమనే గజ్జల మధ్య సాగుతున్న నృత్యగానాల కోలాహలంతో… గోండు గూడాలు సందడిగా మారాయి. దీపావళి వేళ నిర్వహించే దండారి సంబరాలు… అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సవాలు నింపుతున్నాయి.


ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా జరుపుకునే దండారి పండుగ ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యమైనది. దీపావళి రోజుతో ముగిసే దండారి పండగ… ఆదివాసుల్లో ఐక్యతను మరింత బలోపేతం చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి… వారితో కలిసి ఆటా పాట వినోదాల్లో పాలుపంచుకుంటాయి. దండారిలో ఆట పాటలకు ఉపయోగించే డప్పు, రడమేళా, డోల్‌, వెట్టి, కర్ర, పెప్రి, తుడుం సంగీత పరికరాలను నెమలి ఈకలతో పేర్చిన గుస్సాడి కిరీటీలను ముఖానికి ధరించే పువ్వుల‌ను… గ్రామం మధ్యన గుట్టపైన పేర్చి, సంప్రదాయ రీతిలో అమ్మవారికి వారి ఆచారంలో పూజలు నిర్వహిస్తారు. దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాతనే నృత్యాలు ప్రారంభిస్తారు.

ఈ ఉత్సవాల్లో ఆదివాసీల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దండారి ఉత్సావాల్లో భాగంగా తొమ్మిది రోజల పాటు… గుస్సాడీ వేషధారణ వేసిన వారు స్నానం చేయరు. ఒంటికి బూడిద పూసుకుని స్నానంగా భావించడం వీరి ఆచారం. దీంతో పాటు ముఖానికి మసి, ఎడమ భుజంపై జింక తోలు, మెడలో రుద్రాక్షలు, కుడి చేతిలో మంత్రదండం, జంతువుల కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన టోపిలు కళ్లకు, నడుముకు గజ్జలు ఇలా విచిత్ర వేషధారణ ధరించి… వారి సంప్రాదాయానికి ప్రతీకగా నిలుస్తారు.


ఇక గుస్సాడీ వేషాధారణ వేసిన వారికి గ్రామస్తులు స్వాగతం పలకడం మరో ప్రత్యేకత. గుస్సాడీ వేషాధారణ వేసిన వారు… తమ సొంత గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి విందు, ఆట, పాటలతో పాటు అక్కడే గడపడం ఆనవాయితీ. ఆతిథ్యం పుచ్చుకున్న వీరు తమ గ్రామానికి వచ్చి ఆ గ్రామస్తులకు కూడా ఆథిత్యం ఇస్తారు. దీంతో అథితులుగా దండారికి వచ్చిన వారికి ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేస్తారు. తమకు దూరంగా ఉన్న బందువులను కలుసుకోవడంతో పాటు… వారితో తమ కష్టసుఖాలను తెలియజేసుకోవడానికి దండారి వేడుకలను గోండు జాతీయులు జరుపుకుంటారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి వారి అథితి మర్యాదలను స్వీకరించినట్లుగానే… మరో ఏడాది తమ గ్రామానికి దండారి బృందం రావాలని ఆహ్వానిస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న దండారి వేడుకలను పురస్కరించుకొని…. దండారి బృందాలు దీపావళి నాటికి ఎక్కడ ఉన్నా తమ సొంత గ్రామాలకు చేరుకుంటాయి.

సంబరాలన్నీ గ్రామపటేల్ ఇంటి ముందే జరుగుతాయి. గిరిజన గొండు గూడాల్లో గ్రామపటేల్ ది… ప్రత్యేకమైన స్థానం. ఆయన ఊరి పెద్దగా వ్యవహరిస్తుంటారు. గూడాల్లోని ప్రజలకు పటేల్ మాట వేదవాక్కు. ఆయన మాటను జవదాటరు. అందుకే దండారీ ఉత్సావాలు గ్రామపటేల్ ఇంటిముందే నిర్వహించడం అనవాయితీ. భోగి పండగలను చేసి గ్రామపటేల్ దండారి ఉత్సావాలను ఆరంభిస్తారు. గుస్సాడీ వేషధారణలో ఉన్న వ్యక్తి చేతికి ఉన్న మంత్రదండం… శరీరాన్ని తాకితే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని వారి నమ్మకం. డప్పుల భాజాలు తప్ప ప్రత్యేకమైన పాటేమిలేని నృత్యం చూపరూలను ఆకట్టుకుంటుంది. గొండు గిరిజన మహిళలు కూడా పురుషులతో సమానంగా థింసా నృత్యాన్ని ఆడుతారు. మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ దింసా నృత్యాలు చేస్తారు.


దీపావళి పండగ పూర్తయిన మరుసటి రోజు… కోలబోడి పండుగలతో దండారి సంబరాలు ముగిస్తారు. దీపావళి అనంతరం గుస్సాడీలు చివరి రోజున ఆనందంగా నృత్యాలు నిర్వహిస్తారు. అనంతరం… గ్రామ పొలిమేరలలో ఉన్న ఇప్ప చెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన… భీందేవుని సన్నిధిలో కోలబోడి సందర్భంగా నెమలి టోపీలను తొలగించి, గుస్సాడీ వేషధారణ కోసం అలంకరణ వస్తువులను… భీందేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ దండారి ఉత్సవాలను ముగిస్తారు.

దండారీ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి… దసరాకు కాకుండా… తమ విద్యార్థులకు దీపావళికి అధికంగా సెలవులు ఇవ్వాలని ఆదివాసీలు కోరుతున్నారు. దండారీలో ఆదివాసీల ఆచారాలు, కట్టుబాట్లు ముఖ్యంగా కార్యక్రమాలు నిర్వహించాలంటే చిన్నారులు ముఖ్యమని ఆదివాసీలు చెబుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × four =