కీలక ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న సంగతి తెలిసిందే..! జులై 1న వాయిదా పడ్డ ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది. టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జులై 7-17 తేదీల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లు జరుగుతాయి.
ఈ సిరీస్ లకు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అందుబాటులో ఉండటం లేదు. రషీద్ హజ్ యాత్రలో పాల్గొనడం కోసం కొన్ని రోజులు జాతీయ జట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మక్కాను సందర్శించుకునేందుకు తనకు కొంత విరామం ఇవ్వాలని, భారత్‌తో తలపడబోయే జట్టు కోసం తనను ఎంపిక చేయొద్దని ఆదిల్ రషీద్ చేసిన విజ్ఞప్తికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించింది. అతని హజ్ యాత్రకు అనుమతులు మంజూరు చేసింది. శనివారం రషీద్ సౌదీ అరేబియాకు బయల్దేరనున్నాడు. తాను చాలా కాలం నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నానని.. తగినంత సమయం దొరకడం లేదన్నాడు. ఈ ఏడాది ఎలాగైనా యాత్రను పూర్తి చేయాలని భావించి తమ దేశ బోర్డుతో పాటు కౌంటీ క్లబ్ యార్క్ షైర్ యాజమాన్యానికి విషయం చెప్పాడు. రెండు వారాలు ఈ యాత్రలో పాల్గొననున్నాడు.