More

  రాజస్థాన్‎లోనూ జ్ఞానవాపి..!

  అతి పురాతమైన, అత్యంత విశిష్టమైన భారతీయ సంస్కృతి, నాగరికత.. శతాబ్దాలుగా ఇస్లామిక్ దురాక్రమణదారులచేత నాశనం చేయబడింది. వేలకొద్ది దేవాలయాలను కూల్చి.. మసీదులు, మజార్లు నిర్మించుకున్నారు. మతోన్మాదులు మరుగున పడేసిన మన చరిత్ర ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ్ఞానవాపి తీర్పు తర్వాత.. దేశంలోని వివాదాస్పద ఇస్లామిక్ కట్టడాల గురించి చర్చ మొదలైంది. అలాంటి కట్టడాల్లో ‘అధాయ్ దిన్ కా జోన్‎ప్రా’ కూడా ఒకటి. రాజస్థాన్‎లోని అజ్మీర్ లో వున్న ఈ మసీదు కూడా.. హిందూ, జైన మందిరాల అవశేషాలపై నిర్మించిందే. అజ్మీర్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ‘అధాయ్ దిన్ కా జోన్‎ప్రా’ను ప్రతిరోజూ వందలాది మంది సందర్శిస్తుంటారు. అయినా, దీనిని ఇప్పటికీ ముస్లింలు నమాజ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కట్టడం ప్రస్తుతం భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో వుంది. ఈ ప్రదేశం ఇస్లామిక్ దురాగతాలకు.. ఎలా సజీవ సాక్ష్యంగా మారిందో తెలుసుకోవాలంటే.. చరిత్ర పుటల్ని తిరగేయాల్సిందే. ఆ కట్టడాన్ని సందర్శించిన ఆర్కియాలజిస్టులు ఏం చెప్పారో తెలుసుకోవాల్సిందే.

  అజ్మీర్ లోని ‘అధాయ్ దిన్ కా జోన్‎ప్రా’ మసీదు.. ఒకప్పుడు ‘సరస్వతి కంఠాభరణ మహావిద్యాలయ’ పేరుతో విలసిల్లిన సంస్కృత కళాశాల. జ్ఞానానికి ప్రతీక అయిన చదువుల తల్లి సరస్వతి మాత ఆలయం. చౌహాన్ రాజవంశానికి చెందిన 4వ మహారాజ విగ్రహరాజ నిర్మించిన అద్భుత కట్టడం. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ భవనం చతురస్రం ఆకారంలో నిర్మించబడింది. ప్రతి మూలలో ఒక ఎత్తయిన స్తంభం ఉంది. భవనానికి పడమటి వైపున సరస్వతి మాత ఆలయం ఉండేది. 19వ శతాబ్దంలో ఇక్కడ ఒక శాసనం వెలుగుచూసింది. పురావస్తు శాస్త్రవేత్తలు దానిని సాధారణ శకం 1153 నాటిదని అంచనా వేశారు. దీనిని బట్టి.. ఈ భవన నిర్మాణం సాధారణ శకం 1153లో జరిగినట్టు నిర్ధారణ అవుతోంది. అయితే కొన్ని స్థానిక జైన ఇతిహాసాల ప్రకారం, ఈ భవనాన్ని సాధారణ శకం 660 లో సేథ్ వీరమ్‌దేవా కాలా నిర్మించినట్టు చెబుతారు. జైన మందిరంలా నిర్మించిన ఈ కట్టడం వద్ద పంచ కళ్యాణక ఉత్సవాలు జరిగేవట. జైన తీర్థంకరుడి జీవితంలోని ఐదు ప్రధాన ఘట్టాలే ఈ పంచ కళ్యాణకలు. ఈ ప్రదేశంలో ఆనాటి జైన, హిందూ నిర్మాణ అవశేషాలు.. ఇప్పటికీ వున్నాయి.

  ఇక, కట్టడం ఎప్పుడు మసీదుగా మారిందనే విషయాని వస్తే.. సాధారణ శకం 1192 లో, మహమ్మద్ ఘోరీ మహారాజా పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించి అజ్మీర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. నగరంలోని దేవాలయాలను ధ్వంసం చేయమని.. తన బానిస అయిన జనరల్ కుతుబుద్దీన్ ఐబక్‌ని ఆదేశించాడు. తాను నమాజ్ చేసుకోవడానికి వీలుగా.. ఆలయ స్థలంలో 60 గంటలల్లోపు మసీదులో వున్నట్టుగా ప్రార్థనా విభాగాన్ని నిర్మించాలని హుకుం జారీ చేశాడు. 60 గంటలంటే రెండున్నర రోజులు. అందుకే, ఈ కట్టడానికి ‘అధాయ్ దిన్ కా జోన్‎ప్రా’ అనే పేరు వచ్చిందని చెబుతారు. ‘అధాయ్ దిన్ కా జోన్ ప్రా’ అంటే రెండున్నర రోజులని అర్థం. అయితే, కొందరు ఇది కేవలం కల్పిత కథ అని నమ్ముతారు. నిజానికి, మసీదు నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టిందనేది వారి వాదన. ప్రతి ఏటా మసీదులో రెండున్నర రోజులపాటు జరిగే ఉత్సవాల నుంచి ఈ పేరు వచ్చిందని అంటారు.

  మసీదులోని సెంట్రల్ మిహ్రాబ్ వద్దనున్న శాసనంలో ‘అధాయ్ దిన్ కా జోన్ ప్రా’ నిర్మాణానికి సంబంధించిన వివరాలున్నాయి. ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం.. ఈ మసీదును 595 జుమాదా 2 నెలలో నిర్మించారు. అంటే సాధారణ శకం 1199లో మసీదు నిర్మాణం పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కుతుబుద్దీన్ వారసుడు ఇల్తుత్మిష్ సాధారణ శకం 1213లో ఈ మసీదును మరింత అందంగా తీర్చిదిద్దాడు. ఇక, ఉత్తర మినార్ పై ఇల్తుత్మిష్ పేరుతో మరో శాసనం కూడా వుంది. అలాగే దక్షిణ ఆర్చిపై నిర్మాణ పర్యవేక్షుడిగా ముహమ్మద్ అల్-అరిద్ పేరు కూడా వుంది. చారిత్రక ఆధారాల ప్రకారం.. 25 నుంచి 30 హిందూ, జైన మందిరాలను ధ్వంసం చేసి ఈ మసీదు కట్టినట్టు తెలుస్తోంది. అందువల్ల మసీదులో ఏ దిక్కున సరస్వతి మందిరం, ఏ దిక్కున సంస్కృత పాఠశాల ఉండేదో చెప్పడం అంత సులభం కాదు.

  ప్రముఖ చరిత్రకారుడు సీతా రామ్ గోయెల్ తన ‘హిందూ టెంపుల్స్ : వాట్ హాపెండ్ టు దెమ్’ అనే పుస్తకంలో మసీదు గురించి ప్రస్తావించారు. రచయిత సయ్యద్ అహ్మద్ ఖాన్ రచించిన ‘అసర్-ఉస్-సనాదిద్’ అనే పుస్తకంలో ‘అధాయ్ దిన్ కా జోన్ ప్రా’ హిందూ దేవాలయాల శిథిలాలతో నిర్మించినట్టు రాశారు. ఇదే విషయాన్ని సీతారామ్ గోయెల్ తన పుస్తకంలో ప్రస్తావించారు. ఇక, బ్రిటిష్ కాలంలోనూ ఈ మసీదుకు సంబంధించి పలు పరిశోధనాత్మక నివేదికలు వెలువడ్డాయి. 1871లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్-జనరల్‌గా నియమితులైన అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్,.. 1862, 63, 64, 65 సంవత్సరాలకు చెందిన నాలుగు నివేదికలను సమర్పించారు. అనేక హిందూ దేవాలయాల శిథిలాలతోనే ‘అధాయ్ దిన్ కా జోన్ ప్రా’ మసీదును నిర్మించినట్టు ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

  అలాగే మసీదును సందర్శించిన బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ జేమ్స్ టోడ్ పేరును కూడా కన్నింగ్ హామ్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ కట్టడం మొత్తం మొదట జైన దేవాలయం అయి ఉండవచ్చని టోడ్ అభిప్రాయపడ్డాడు. అయితే, నాలుగు చేతులున్న బొమ్మలను అనేక స్తంభాల్లో గుర్తించిన అతడు.. అవి జైన మతానికి చెందిన గుర్తులు కావని నిర్ధారణకు వచ్చాడు. వాటి పక్కన కాళికాదేవి శిల్పం చెక్కబడి వుండటం.. హిందూ నిర్మాణ శైలికి అద్దం పడుతుందని టోడ్ తెలిపాడు.

  పలు నివేదికల ప్రకారం, 1990ల వరకు, మసీదు లోపల అనేక పురాతన హిందూ శిల్పాలు చెల్లాచెదురుగా పడివుండేవి. 90వ దశకంలో, భారత పురావస్తు శాఖ వాటిని భద్రపరచడానికి సురక్షితమైన ప్రదేశానికి తరలించింది. ఆ శిల్పాలను ఎలా భద్రపరిచారో ఇటీవల ఆ ప్రదేశాన్ని సందర్శించిన ధార్మిక్ స్టాన్స్ అనే ట్విట్టర్ యూజర్ వివరించారు. ప్రాంగణంలోని సీలు వేయబడిన ఓ గదిలోని కొన్ని ఇమేజ్ లను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఇమేజ్ లను 2022 మార్చిలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఇమేజ్ లను జూమ్ చేసి పరిశీలిస్తే.. హిందూ దేవీ దేవతల విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిపై భారత పురావస్తు శాఖ మార్కింగ్ కూడా కనిపిస్తోంది. ఇక, 2015లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన మరో ట్విట్టర్ యూజర్ మహమ్మద్ ఘోరీ దురాక్రమణ చేసేముందు వరకు ‘అధాయ్ దిన్ కా జోన్ ప్రా’ జైనమందిరమని తెలిపాడు.

  ఈ నిర్మాణాన్ని మసీదుగా మార్చిన తర్వాత చాలాకాలం వరకు ఎవరూ పట్టించుకోలేదని.. 18వ శతాబ్దంలో మరాఠా రాజు దౌలత్ రావ్ సింధియా దానిని పునరుద్ధరించారని రాసుకొచ్చారు. అయినప్పటికీ, అది మసీదుగానే మిగిలిపోయిందని.. 1947లో భారత పురావస్తు శాఖ ఆ ప్రదేశాన్ని ఆధీనంలోకి తీసుకుందని తెలిపారు. అంతేకాదు, పురావస్తు శాఖ అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బోర్డులను పెట్టలేదని అన్నారు. ఇది కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన మసీదు.. అని మాత్రమే రాసివుందని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. సాక్షాత్తు పురావస్తు శాఖ కూడా స్థల చరిత్రను చెప్పకుండా కేవలం మసీదు అని పేర్కోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. హిందూ దేవాలయాల ధ్వంసరచన అజ్మీర్ లోని ‘అధాయ్ దిన్ కా జోన్ ప్రా’తోనే ఆరంభమైందని.. రచయిత సంజయ్ దీక్షిత్ ట్వీట్ చేశారు.

  ఏదేమైనా, చారిత్రక ఆధారాలను బట్టి ‘అధాయ్ దిన్ కా జోన్ ప్రా’ కచ్చితంగా హైందవ ధర్మ క్షేత్రమని స్పష్టమవుతోంది. భారతావనిలో దేవాలయాలను ధ్వంసం చేసి కట్టిన ఇలాంటి మసీదులు, ఇతర ముస్లిం నిర్మాణాలు వేల సంఖ్యలో వున్నాయి. ఇస్లామిక్ దురాక్రమణదారులు ఆలయాలను కూల్చివేసి వాటి శిథిలాలపై తమ ప్రార్థనా మందిరాలను నిర్మించుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు, కాశీలో జ్ఞానవాపి, మథురలో షాహీ ఈద్గా ఇలా నిర్మించినవే. చరిత్రకారుడు సీతా రామ్ గోయెల్ రాసిన ‘హిందూ టెంపుల్స్ : వాట్ హాపెండ్ టు దెమ్’ పుస్తకం ప్రకారం దేశంలో 1800 అక్రమ నిర్మాణాలున్నాయి.

  Trending Stories

  Related Stories