ఈరోజు అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే..! 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు 43వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సీజ్ చేశారనే వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అల్‌బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కంపెనీల నిధులను ఎన్ఎస్‌డీఎల్ నిలిపివేసింది. గత ఏడాది సుమారు 800 శాతం దూసుకువెళ్లిన అదానీ గ్రూపుకు ఈరోజు భారీగా నష్టాలు మిగిలాయి. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఆ మూడు విదేశీ కంపెనీల వివరాలను ఆదానీ గ్రూపు వెల్లడించకపోవడంతో నేషనల్ సెక్యూరిటీస్ చర్యలు తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. గత దశాబ్ధ కాలంలో అదానీ షేర్లు పతనం కావడం ఇదే మొదటిసారి. అదానీ పోర్ట్స్ 19 శాతం పతనమైంది.
తమ గ్రూపునకు చెందిన మూడు కంపెనీ అకౌంట్లు సీజ్ అయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూపు ఖండించింది. ఆ వార్తలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అదానీకి చెందిన మూడు విదేశీ నిధులను నేషనల్ సెక్యూర్టీ డిపాజిటరీ లిమిటెడ్ ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూపు ఖండించింది. తమ కంపెనీల షేర్లు ఫ్రీజ్‌కాలేదని తెలిపింది. అప్పటికే భారీగా అదానీ కంపెనీ నష్టపోయింది.
గత కొన్నేళ్లుగా అదానీ షేర్లు దూసుకెళ్లడంతో చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలో రెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు గత ఏడాది కాలంలో పది రెట్లు పెరిగాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు కూడా ఎనిమిది రెట్లు పెరిగాయి. అదానీ పోర్ట్స్ 148 శాతం, అదానీ గ్రీన్ 267 శాతం గత ఏడాది పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఈరోజు ట్రేడింగ్ నష్టాలలోనే మొదలైంది. ఒకానొక దశలో సెన్సెక్స్ సుమారు 600 పాయింట్ల వరకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కోలుకుని, రికవర్ అవడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. దీంతో 76.77 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52551.53 వద్ద ముగిసింది. 12.50 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15811.85 వద్ద ముగిశాయి.