హీరోయిన్ పూజా హెగ్డే ట్విట్టర్ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఓ ఉద్యోగి తమ పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఈ తరహా ఘటనలను తాను బయటకు చెప్పనని, అయితే భయంకరమైన ఈ ఘటనను వెల్లడించడం మంచిదని తాను భావించానని పూజా తెలిపారు. ముంబై నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో తనతో పాటు తన సన్నిహితులతో ఎక్కామని.. ఆ సమయంలో ఇండిగో ఉద్యోగి విపుల్ నకాశే తమ పట్ల దారుణంగా వ్యవహరించాడని తెలిపారు. తమను అతడు భయభ్రాంతులకు గురి చేశాడని, బెదిరించాడని కూడా పూజా ఆరోపించారు. దీనిపై ఇండిగో యాజమాన్యం స్పందిస్తూ సదరు హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పింది. ఇలాంటి అనుభవం ఎదురైనందుకు బాధపడుతున్నామని పేర్కొంది. తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.