More

    భారత్ లో 5జీ సేవలు వద్దంటూ ఢిల్లీ హైకోర్టుకెక్కిన బాలీవుడ్ హీరోయిన్

    2జీ, 3జీ.. అయిపోయి.. 4జీ లో ప్రస్తుతం జమానా నడుస్తోంది. త్వరలోనే 5జీని తీసుకుని రావడానికి భారత్ లోని టెలికాం ఆపరేటర్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో టెస్టింగ్ కూడా నడుస్తోంది. 5జీని విమర్శిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా 5జీ సేవలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. 5జీ నెట్వర్క్ ద్వారా మానవాళికి ఎంతో ప్రమాదం జరుగుతుందని.. అంతేకాకుండా పర్యావరణ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పే అవకాశం ఉందని అన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయని.. మనుషుల్లో అనారోగ్య సమస్యలు, డీఎన్ఏకు నష్టం కలగడం వంటివి జరుగుతాయని హెచ్చరించారు. అనేక రకాల మొక్కలు మరియు జంతువులలో డిఎన్ఏ, కణాలు, అవయవ వ్యవస్థలకు నష్టం వాటిల్లినట్లు ప్రయోగాత్మక ఆధారాలతో పాటు క్లినికల్ సాక్ష్యాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నామని.. ఇలాంటి వాటి వలన క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్ వంటివి మనుషులను పట్టి పీడించే అవకాశం లేకపోలేదని అన్నారు. ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్ పొల్యూషన్ అన్నది భూమి మీద ఉన్న జీవులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఎన్నో స్టడీస్ లో తెలిసిందని అన్నారు. దీన్ని తేలికగా తీసుకోకూడదని ఆమె చెప్పుకొచ్చారు.

    సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును మేం వ్యతిరేకించడంలేదని ఆమె వివరణ ఇచ్చారు. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న కొత్త ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నామని.. తదుపరి తరం పరికరాల వినియోగంలోనే అసందిగ్దత ఏర్పడుతోందని ఆమె అన్నారు. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయని.. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నదానికి తగిన కారణం ఇదేనన్నారు. 5జీ టెక్నాలజీ విషయంలో చోటు చేసుకుంటున్న రేసు గురించి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆమె హెచ్చరించారు. ఎన్నో పరిశోధనలు చేయాలని.. మనుషులకు, జంతువులకు, జీవరాశులకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాతనే భారత్ లో 5జీకి అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. రాబోయే తరాలపై ప్రభావం చూపించకుండా ఉంటేనే 5జీని భారత్ లో అనుమతించాలని తన పిటీషన్ లో ఆమె కోరారు.

    ఐదో తరం వైర్ లెస్ నెట్వర్క్ సేవలుగా ప్రచారం పొందుతున్న 5జీ భారత్ లో త్వరలో రాబోతోంది. అధికవేగంతో కూడిన ఇంటర్నెట్ సర్వీసులు, ఫోన్ సేవలు 5జీతో సాధ్యమవుతాయి. 5జీ కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందన్న వాదనలు కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. మరో వైపు వదంతులు కూడా 5జీ గురించి ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో 5జీ కారణంగా కరోనా వ్యాపిస్తోందనే తప్పుడు కథనాలు కూడా వైరల్ అయ్యాయి.

    Related Stories