సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే, అంతే మంచిది. ఒకవేళ ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
లేకపోతే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో బెదిరింపు కాల్స్‌తో పాటు బెదిరింపు లేఖలు సెలబ్రిటీలకు ఎక్కువగా వస్తున్నాయి. చంపేస్తామంటూ కొన్ని కాల్స్ వస్తుండగా, మరి కొన్ని కాల్స్‌లో బాంబ్ బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా నటి స్వర భాస్కర్‌కు కూడా బెదిరింపు లేఖ వచ్చింది. స్వర భాస్కర్‌ను చంపేస్తామని అజ్ఞాత వ్యక్తి నుంచి ఆమె నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ అందింది. ముంబైలోని వెర్సోవాలో నటి నివాసానికి ఈ లేఖను పంపారు. స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ రావడంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తన నివాసానికి బెదిరింపు లేఖ రావడంతో వెర్సోవా పోలీస్ స్టేషన్లో నటి స్వర భాస్కర్ ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హిందీలో రాసిన ఈ లేఖలో స్వర భాస్కర్‌కు ప్రాణ హాని తలపెడతామని అంటూ అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు తెలిపారు. లేఖ చివరిలో ఇట్లు ఈ దేశ యువకులు అని రాసి ఉందని వెల్లడించారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత చూస్తూ ఊరుకోదని లేఖలో హెచ్చరించారు. అయితే సమాజంలో జరిగే సామాజిక రాజకీయ అంశాలపై స్వర భాస్కర్ చురుకుగా స్పందిస్తుంటారు. జైలు నుంచి విడిచిపెట్టాలని వేడుకుంటూ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారని.. ఆయన వీరుడు ఎంతమాత్రం కాదని 2017లో స్వర భాస్కర్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఆ తర్వాత కూడా మరోమారు కూడా సావర్కర్‌పై ఆమె సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. తాజాగా ఉదయపూర్‌లో జరిగిన హత్యనూ ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను చంపుతామంటూ బెదిరింపులు రావడం గమనార్హం. కాగా సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది స్వర భాస్కర్.
గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్.. ముంబై లోని స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్‌కు వెళ్లారు. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల వ్యవహారంపై ముంబయి పోలీసులు.. కీలక పురోగతి సాధించారు. బెదిరింపుల లేఖ విషయంలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సిద్ధేష్ కాంబ్లే అలియాస్ సౌరభ్ మహకల్ విచారణలో ఈ విషయం వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఆ బెదిరింపుల లేఖను సల్మాన్ తండ్రి సలీం ఖాన్‌కు పంపించాడని పోలీసులు వెల్లడించారు. అందుకోసం అతడి గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులు రాజస్థాన్‌లోని జాలోర్ నుంచి ముంబయికి వచ్చారని… అక్కడికి వచ్చి సౌరభ్ మహకల్ను కలిశారని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా వరుసగా బెదిరింపు కాల్స్, లేఖలు వస్తుండటం పోలీసులకు పెను సవాల్ గా మారుతున్నాయి. సెలబ్రెటీల విషయంలో వెంటనే స్పందించే పోలీసులు.. సామాన్య ప్రజలకు వస్తున్న బెదిరింపులను పట్టించుకోకపోవడం వల్లే టైలర్ కన్హయ్య లాంటి వారి హత్యలు జరుగుతున్నాయని జాతీయవాదులు మండిపడుతున్నారు.