200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో పేరు.. సల్మాన్ ఖాన్ షోకు వెళ్లనివ్వకుండా హీరోయిన్ జాక్వెలిన్ ను ఆపివేత

0
929

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదేశాలకు వెళ్లకుండా ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఆమె ఒక ఈవెంట్ కోసం దుబాయ్‌కు బయలుదేరింది. అయితే ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీసు జారీ చేయడంతో అధికారులు విమానాశ్రయంలో నిలిపివేశారు. కొన్ని నివేదికలు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు, ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నాయి. అయితే ఆ వార్తలు ఇంకా ధృవీకరించబడలేదు. ఇండియా టుడే మాత్రం ఆమెను అదుపులోకి తీసుకోలేదని, ఇంటికి తిరిగి పంపించారని తెలిపింది. డిసెంబర్ 10న రియాద్‌లో జరగనున్న సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్ టూర్‌’లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాల్గొనాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఆమె దేశం విడిచి వెళ్లలేరని, ఇప్పుడు ఆమె ఆ షోలో చేరడం లేదని తేలింది.

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్, దోపిడీ కేసులో నటి పేరు బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ నుండి ఆమె అనేక ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్రశేఖర్‌తో ఉన్న కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడంతో వారు రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.

సుకేష్ జాక్వెలిన్ కు ఇచ్చిన బహుమతుల్లో వజ్రాలు పొదిగిన ఆభరణాల సెట్లు, క్రాకరీలు, 36 లక్షల విలువైన నాలుగు పెర్షియన్ పిల్లులు మరియు రూ. 52 లక్షల విలువైన గుర్రం ఉన్నాయి. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తమకు ఆధారాలు లభించాయని, అతడు ఆమెకు రూ.10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడని ఈడీ పేర్కొంది. జైలు నుంచి జాక్వెలిన్‌తో సుకేష్ మొబైల్‌లో చాటింగ్ చేసేవాడు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో సుకేష్‌కు బెయిల్ వచ్చినప్పుడు, అతను చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేసుకున్నాడు. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని చెన్నైలో కలుసుకోడానికి చార్టర్డ్ ఫ్లైట్‌లను కూడా ఏర్పాటు చేశాడు. ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్‌తో పాటు అతని భార్య, పలువురు వ్యక్తులు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో ఉంది. నోరా ఫతేహి పేరు కూడా బయటకు వచ్చింది. ఆమెకు BMW కారు బహుమతిగా ఇవ్వబడింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలుమార్లు సమన్లు ​​బేఖాతరు చేసిన తర్వాత ఆమెను ఈడీ ప్రశ్నించింది. భారత్‌ను విడిచి వెళ్లకుండా ఆపిన తర్వాత ఆమెను మళ్లీ విచారించాలని అధికారులు భావిస్తున్నారు.