బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులు కర్ణాటకలోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ, వీడియో కాల్స్ చేస్తూ జల్సాలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీంతో హర్ష కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ తమకు ద్రోహం చేసిందని వాపోయారు. ఈ కేసులో నిందితులు ఈ జైలులో ప్రత్యేక భోగాలు అనుభవిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీరి విలాసాలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవడంతో జైలు అధికారులు సోదాలు నిర్వహించారు. వీరికి మొబైల్ ఫోన్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వీరు ఎవరితో మాట్లాడుతున్నారు? సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని హర్ష సోదరి రజిని అన్నారు. మానవత్వం కరువైపోయిందని, ప్రాణ నష్టం జరిగిందని, న్యాయం చేయాలనే నిబద్ధత ఎవరికీ లేదని అన్నారు. ఎవరికీ పట్టనట్లు ఉందన్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ నిందితులు తమ భార్యలు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారన్నారు. వారికి అందరి మద్దతు లభిస్తోందన్నారు. తాము తమ సోదరుడిని కోల్పోయామని, తాము బాధపడుతున్నామని చెప్పారు. జైలు అధికారులను సస్పెండ్ చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. నిందితులను ప్రత్యేకంగా చూస్తూ, వారికి రాజభోగాలను కల్పిస్తే, యువత తప్పుదోవపట్టడానికి ఓ ఉదాహరణ అవుతుందన్నారు. హత్య చేసినప్పటికీ, మూడు నెలల్లో బయటకు వచ్చేయవచ్చునని, అన్ని రకాల విలాసాలను అనుభవించవచ్చుననే సందేశం అందరికీ వెళ్తుందని చెప్పారు.
నిందితులకు ఇటువంటి విలాసాలను సమకూర్చిన విషయాన్ని తెలుసుకున్నపుడు, వారిని ప్రభుత్వం వదిలేస్తుందని కూడా తాము అనుకుంటున్నామని హర్ష తల్లి పద్మ అన్నారు. తమకు న్యాయం తిరస్కరణకు గురైందని తాము భావిస్తామని చెప్పారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్రంగా ఉన్న సమయంలో ఫిబ్రవరి 20న హర్షను కొందరు వ్యక్తులు హత్య చేశారు. హర్షను అందరూ హర్ష హిందూ అని పిలుస్తారు. ఆయన హిందుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్టొనేవారు. గోవుల అక్రమ రవాణాను ఆయన గట్టిగా ప్రశ్నించేవారు. హిందూ సందేశాలను పదునైన రీతిలో సామాజిక మాధ్యమాల్లో పంచుకునేవారు. హిజాబ్ వివాదంపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. హర్ష హత్య కేసును ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది.