బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్ అయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. క్షిపణి మిస్ ఫైర్ అయిన బ్రహ్మోస్ యూనిట్ కు నేతృత్వం వహిస్తున్న కమాండింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోనుంది. గత నెల 9న మన దేశం నుంచి మిస్ ఫైర్ అయిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పాకిస్థాన్ లోపల 124 కిలోమీటర్ల దూరంలో పడిన సంగతి తెలిసిందే. ఒకరి కంటే ఎక్కువ మంది అధికారులను ఉన్నత స్థాయి విచారణ కోర్టు నిందితులుగా నిర్ధారించిందని ఒక నివేదిక తెలిపింది. ఈ విషయంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (CoI) బ్రహ్మోస్ క్షిపణి ‘ప్రమాదవశాత్తు’ మిస్ ఫైర్ అయిన యూనిట్ కమాండింగ్ ఆఫీసర్‌తో సహా నలుగురు అధికారులను విచారించింది. ఉత్తర భారతదేశంలోని IAF స్థావరం దగ్గర నుండి మార్చి 9 రాత్రి 7 గంటలకు క్షిపణిని ప్రయోగించారు. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (CoI) బ్రహ్మోస్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ ర్యాంకింగ్ ఆఫీసర్, ఇతరులను ‘మానవ’ తప్పిదానికి బాధ్యులుగా పేర్కొంది.
ప్రయోగించిన కొద్దిసేపటికే, పాకిస్తాన్ యొక్క ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR), దాని సాయుధ దళాల మీడియా విభాగం, ఒక సూపర్సోనిక్ వస్తువు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిందని తెలిపింది.
ఈ ఘటనకు బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని భారత అధికారులు గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నిర్వహించారు. కమాండింగ్ ఆఫీసర్ తో పాటు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అధికారి, ఇతర సిబ్బందిని బాధ్యులుగా గుర్తించారు. మానవ తప్పిదంతోనే ఐఏఎఫ్ బేస్ నుంచి మిసైల్ ఫైర్ అయిందని తేల్చారు. మిస్సైల్ మిస్‌ఫైర్ ఘటనను అంగీకరిస్తూనే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని అన్నారు. “ప్రభుత్వం ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుందని నేను సభకు చెప్పాలనుకుంటున్నాను. మేము SOP లను సమీక్షిస్తున్నాము. మేము భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తాము. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించబడింది. మా క్షిపణి వ్యవస్థ సురక్షితమైనది.. నమ్మదగినది” అని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రకటనలో తెలిపారు.