నాసిక్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ లగ్జరీ బస్సుకు ప్రమాదం జరిగింది. నాసిక్-ఔరంగాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 5.15 గంటలకు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఆ వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 12 మంది మంటల్లో సజీవదహనం అయ్యారు.. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాన్ని తాము ప్రత్యక్షంగా చూసినప్పటికీ ఏమీ చేయలేకపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు అయ్యే చికిత్స ఖర్చులు భరిస్తామని మంత్రి దాడా భుసే తెలిపారు.