జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. పార్టీని పటిష్టం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. నేడు హైదరాబాద్ నుండి విజయవాడకు ఆయన చేరుకున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంనేందుకు వెళ్లే సమయంలో ఈ రోజు ఉదయం ఆయన కాన్వాయ్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోకి రాగానే కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పవన్ హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టు వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కు అనుకూలంగా అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడం, వైసీపీ ప్రభుత్వంపై పోరాడడంవంటి అంశాలపై తమ నేతలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. అక్టోబరు 2న పవన్ ఏపీలోని పలు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


ఏపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమలో ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారనే భయంతోనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇండస్ట్రీని కాపాడేందుకు పవన్ దేనికైనా సిద్ధంగా ఉంటారన్నారు నాదెండ్ల మనోహర్. జనసేన బలమైన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందన్నారు నాదెండ్ల మనోహర్. జనసైనికులపై అక్రమంగా కేసులు పెడితే లీగల్ సెల్ చూసుకుంటుందన్నారు. పవన్ వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర చేయాలని సవాల్ చేసారు. పవన్ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని… జగన్ ఎప్పుడూ కక్ష్య సాధింపు రాజకీయాలనే నమ్ముకున్నారని మనోహర్ ఆరోపించారు. జనసేన ఎదుగుదల చూసి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు.