మెక్సికోలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని టక్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్రమాదం జరిగింది. మెక్సికో నుంచి వలస కూలీలు అమెరికా సరిహద్దుల వైపునకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు పరిమితికి మించి బరువు ఉండడం, దాన్ని డ్రైవర్ వేగంగా నడపడం వల్లే అది ఒక్కసారిగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రక్కులో చిన్నారులు కూడా ఉన్నారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందేలా చేస్తున్నాయి. మెక్సికో నుంచి అమెరికాకు చట్ట విరుద్ధంగా వలసలు వెళ్లే క్రమంలో కార్మికులు పదే పదే ప్రమాదాలకు గురవుతున్నారు.
యునైటెడ్ స్టేట్స్ చేరుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టే వలసదారులతో కూడిన అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు. ప్రయాణిస్తున్న ట్రక్కు పల్టీలు కొట్టడంతో యాభై-నాలుగు మంది మరణించారు. గుటిరెజ్ నగరం వెలుపల ఒక టర్నింగ్ లో ట్రక్కు క్రాష్ అయిందని, ట్రైలర్ లో నుండి అందులోని మనుషులు విసిరి పడ్డారని అధికారులు తెలిపారు. చియాపాస్ గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ మాట్లాడుతూ 49 మంది సంఘటనా స్థలంలో మరణించారని, మరో ఐదుగురు వైద్య చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు.
ట్రక్కు తీసుకుని వెళుతున్న ట్రైలర్ ప్రజల బరువును భరించలేకపోయిందని.. అందులో 100 మందికి పైగా ఉన్నారని అధికారులు తెలిపారు. గ్వాటెమాల సరిహద్దులో ఉన్న చియాపాస్‌లోని ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారు. సోషల్ మీడియాలో ప్రచురించబడిన గాయపడిన వారి జాబితాలలో డజన్ల కొద్దీ గ్వాటెమాలన్ వలసదారుల పేర్లు ఉన్నాయి. ప్రమాద స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. రక్తంతో ఉన్న ప్రాంతం, మృతదేహాలను తెల్లటి వస్త్రంలో చుట్టి ఉంచగా.. గాయాల కారణంగా రోదనలు, గాయాలైన ఒక మహిళ తన ఒడిలో బిడ్డను పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. ఈ ఘటన అత్యంత బాధాకరమని అధికారులు చెబుతున్నారు.