గోదాంలో పంచదార బస్తాలను లోడు చేస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

0
974

కాకినాడ రూరల్ పరిధిలోని వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. గోదాంలో పంచదార బస్తాలను లోడు చేస్తుండగా కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో మరణించాడు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వరరావు (45)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. పిఠాపురం మండలం చంద్రాడ గ్రామానికి చెందిన వెంకట రమణ (29) పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్యారీ షుగర్స్ లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పది మంది కార్మికులు ప్రమాదానికి గురయ్యారని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు మృతి చెందారని, మరోకరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ ద్వార నష్టపరిహరం అందించాలని చెప్పామన్నారు. ప్రమాద ఘటనను సిఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ప్యారీ షుగర్స్ పరిశ్రమపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.లోడింగ్ గోడౌన్ లో త్రీ ఫేస్ ఎంసీబీ షార్ట్ సర్క్యూట్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించిందని ఆయన వెల్లడించారు.ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేయాల్సిందిగా అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు.