More

    వీర్ చక్ర ను అందుకున్న అభినందన్ వర్థమాన్

    వైమానిక దళ వింగ్ కమాండర్ ఇటీవలే గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందిన అభినందన్ వర్థమాన్ రక్షణ రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘వీర చక్ర’ను అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాన్ని అభినందన్ కు అందజేశారు.

    అభినందన్ వర్థమాన్, పుల్వామా ఉగ్రదాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఫిబ్రవరి 27, 2019న వైమానిక పోరాటంలో పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినందుకు ఈ రోజు వీర్ చక్రను అందుకున్నారు. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడితో ప్రతీకారం తీర్చుకుంది. ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ తన జెట్‌లతో భారత భూభాగంలోకి రాగా.. వింగ్ కమాండర్ వర్థమాన్ తన మిగ్ 21 తో ఎఫ్-16 విమానాన్ని కూల్చి వేశాడు. ఆ తర్వాత పాక్ ఆక్రమిత-కశ్మీర్‌ లో వర్థమాన్ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే..! పాకిస్థాన్ చెరలో ఉన్నప్పుడు.. భారత్‌కు అప్పగించే ముందు వర్థమాన్ ను మానసికంగా హింసించారు. వింగ్ కమాండర్ వర్థమాన్ శ్రీనగర్ ఆధారిత 51 స్క్వాడ్రన్‌లో భాగంగా ఉన్నారు.

    ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఆర్మీ ఆధికారులు హాజరయ్యారు. అభినందన్ వర్థమాన్‌తో పాటు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్‌కు మరణానంతరం ప్రకటించిన శౌర్యచక్ర అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన భార్య లెప్టినెంట్ నికిత కౌర్, తల్లి సరోజ్ దౌండియాల్.. శౌర్యచక్ర అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. నాయబ్ సుబేదార్ సోమ్‌బీర్‌‌కు మరణానంతరం ప్రకటించిన శౌర్యచక్ర అవార్డును ఆయన భార్య, తల్లికి అందజేశారు.

    Trending Stories

    Related Stories