కళ్లకు గంతలు, కరెంటు షాకులు.. అరుణాచల్ యువకుడిని హింసించిన చైనా..!!

0
735

కొద్దిరోజుల క్రితం కిడ్నాప్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ తారోన్‎ను చైనీస్ ఆర్మీ విడుదల చేసింది. దీంతో ఆ యువకుడిని సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రాంతంలో పేరెంట్స్ కు అప్పగించామని జిల్లా డిప్యూటీ కమిషనర్ శాశ్వత్ సౌరభ్ వెల్లడించారు. స్థానిక అధికారులు, పంచాయతీ లీడర్లు ఇంటికి తిరిగొచ్చిన సందర్భంగా స్వాగతం పలికారు. అయితే, ఆ యువకుడిని చైనా ఆర్మీ నానా రకాలకు హించినట్టు తెలుస్తోంది.

జనవరి 18న LAC వద్దనున్న లుంగ్తా జార్ ప్రాంతంలో మిరామ్‎ను చైనీస్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. స్నేహితుడు జానీ యాయింగ్‎తో కలిసి వేటకు వెళ్లిన వ్యక్తి అప్పటి నుంచి కనపడలేదు. దాదాపు వారానికి పైగా ఎదురుచూసిన కుటుంబానికి జనవరి 27న క్వారంటైన్ పూర్తి చేసుకుని లీగల్ ఫార్మాలిటీల తర్వాత ఇంటికి వచ్చాడు. ఈ ఘటన మొత్తంలో మిరామ్ మానసికంగా కుంగిపోయాడని, భయపడుతున్నాడంటూ అతని తండ్రి ఒపాంగ్ తారోన్ చెప్తున్నారు. చైనా ఆర్మీ కస్టడీలో ఉన్న సమయంలో కట్టేసి ఉండటంతో పాటు కళ్లకు గంతలు కట్టి ఉంచారట. ఇప్పటికీ అతను షాక్ లోనే ఉన్నాడని.. మొదట్లో అతనికి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీపు భాగంలో తన్నారని.. ఇతర ప్రాంతాలకు తరలించే సమయంలో చేతులు కట్టేసి కళ్లకుగంతలు కట్టి హింసించారని తెలిపారు. వదిలిపెట్టే ముందు మాత్రమే అతనికి తిండిపెట్టినట్టు బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని షియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన మిరామ్ టారోన్ ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లుగా వచ్చిన వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. భారత భూబాగం నుంచి ఆ బాలుడిని చైనా ఆర్మీ అపహరించిందని అరుణాచల్ తూర్పు జిల్లాఎంపీ తపిర్ గావో ఆరోపించారు. చైనా ఆర్మీ చెర నుంచి తప్పించుకున్న మరో యువకుడు.. స్థానిక అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఘటన జరిగినప్పుడు టారోన్, మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో వేట సాగిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అయితే, యువకుడు కిడ్నాప్ కాలేదని, తప్పిపోయాడని అధికారులు తర్వాత వివరణ ఇచ్చారు. తప్పిపోయిన మిరామ్ టారోన్ గురించి వెంటనే ఆర్మీ.. పీఎల్ఏని సంప్రదించింది. బాలుడి ఆచూకీ కోసం చైనా ఆర్మీ సాయం కోరినట్లు భారత సైన్యం తెలిపింది.

ఇదిలావుంటే, చైనీస్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ యువకులను కిడ్నాప్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020 సెప్టెంబర్‎లో అప్పర్ శుభాన్ సిర్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులను అపహరించుకుపోయారు. భారత ప్రభుత్వం ఒత్తిడితో వారం రోజుల తర్వాత.. వారిని అంజా జిల్లా సరిహద్దుల్లో విడిచిపెట్టారు.