ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్కు గురైన వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఇటీవలే తిరిగి సర్వీసులో చేరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం డీజీగా ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే క్రమశిక్షణా రహితంగా వ్యవహరించడంతో పాటుగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను మరోమారు సస్పెండ్ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
తన సస్పెన్షన్ విషయమై ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు మీడియాతో మాట్లాడారు. తనను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఒకే అంశంపై ఎవరైనా ఒకరిపై రెండు సార్లు చర్యలు తీసుకుంటారా ? అని అడిగారు. లీగల్గా ఇవేవీ చెల్లవని, న్యాయసమీక్షకు నిలబడే నిర్ణయాలు కావని చెప్పారు. తనపై ఇంతవరకూ ఏ ఛార్జిషీట్ లేదని, రాజకీయ నాయకులకు ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు వర్తించవని అనుకుంటే ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసులున్నాయని.. ఛార్జిషీట్లూ ఉన్నాయని.. ఆమెకు వర్తించని నిబంధనలు తనకెలా వర్తిస్తాయని ప్రశ్నించారాయన. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకున్నారని… అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను ఆ ఘటనలు జరగకుండా అడ్డుకున్నానని… అందువల్లే తనను టార్గెట్ చేశారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి… నీ సంగతి చూస్తామని బెదిరించాడని.. అర్ధరాత్రి సమయం కదా, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో అని తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. రిటైర్ అయ్యేంత వరకు ఖాకీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తామని మరో ప్రజాప్రతినిధి గతంలో తనను బెదిరించారని.. ప్రస్తుతం తాను చేయగలిగింది న్యాయ పోరాటం మాత్రమేనని చెప్పారు. ఇప్పుడు తనను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని… కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు టార్గెట్ చేస్తున్నాయని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అందుకు కారణాలు చాలా ఉన్నాయన్నారు. విచారణ సమయంలో తనపై నకిలీ పత్రాలు పెట్టారని అన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నానన్నారు.