బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్

0
885

ఢిల్లీ మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను స‌కాలంలో నిర్వ‌హించి.. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే తాము రాజకీయ స‌న్యాసం తీసుకుంటామ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో బీజేపీకి కేజ్రీవాల్ స‌వాల్ విసిరారు. బీజేపీ ఈ ఎన్నికలను సకాలంలో నిర్వహించి.. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలను వదిలివేస్తుందని అన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ, “బీజేపీ ఎంసీడీ ఎన్నికలను నిర్వహించి, వాటిలో గెలిస్తే మేము రాజకీయాలను వదిలివేస్తాము. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెబుతుంది, కానీ అది చిన్న పార్టీ, చిన్న ఎన్నికలకు భయపడింది.” అని వ్యాఖ్యలు చేశారు.

బుధ‌వారం పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా బీజేపీ ఓ బిల్లును ప్ర‌తిపాదించింది. ఢిల్లీలోని మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను క‌లిపేస్తూ ఓ ప్ర‌తిపాద‌న పెట్టింది. దీంతో కేజ్రీవాల్ కు కోపం వచ్చింది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఆప్ లాంటి అతి చిన్న పార్టీని చూసి జ‌డుసుకుంటోంద‌ని పెద్ద పెద్ద మాటలే అన్నారు. కేజ్రీవాల్ ట్విటర్‌లో.. ఎన్నికలను వాయిదా వేయడం అమరవీరులను అవమానించడమేనని అన్నారు. ఈ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఇలాగే ఎన్నికలు వాయిదా వేస్తే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చినట్లు ఉండదు. ప్రజానీకం గొంతులేనిదిగా మారుతుంది. ఈ దేశం నవ్వుల పాలవుతుంది. ఈ రోజు కోసమే షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ తన ప్రాణాన్ని ఇచ్చాడా? అధికారంలోకి రావడానికి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాథమిక హక్కు ఈ దేశ ప్రజలకు ఉందని కేజ్రీవాల్ అన్నారు.

ట్విట్టర్‌లో కూడా కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని కొనసాగించారు. “బీజేపీ మొదట ఎన్నికలను వాయిదా వేయమని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బెదిరించింది.. సవరణ ద్వారా నెలల తరబడి వాయిదా వేయడానికి కుట్ర చేస్తోంది. ఇలాగే ఎన్నికలు రద్దయితే ఈ ప్రజాస్వామ్యానికి ఇంకేమైనా మిగులుతుందా? ఇది ప్రజలకు అణచివేసినట్లు కాదా? ఎన్నికలను వాయిదా వేసిన బీజేపీ సిగ్గులేని చర్య ఈ దేశం, రాజ్యాంగం కోసం మన అమరవీరుల త్యాగాన్ని పూర్తిగా అగౌరవపరచడమే.” అని అన్నారు. మూడు ఎంసీడీల ఏకీకరణను బీజేపీ సాకుగా చూపి ఎన్నికలను ఆలస్యం చేస్తోందన్నారు. ఈరోజు చిన్న ఎన్నికలను ఆపడానికి ఇలాంటి కారణాలు చెబుతుంటే, రేపు రాష్ట్ర, జాతీయ ఎన్నికలను కూడా వాయిదా వేస్తారని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.