నారా లోకేష్‌తో భేటీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కూతురు..!

0
787

ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్య‌క్ర‌మం జరుగుతోంది. మహానాడు రెండో రోజు వైసీపీ నేత‌, ఉదయగిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డి కూతురు కైవల్య రెడ్డి, త‌న భ‌ర్త రితేష్ రెడ్డితో స‌హా టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యమంత్రి జగన్ తన సీనియారిటీని పట్టించుకోవడం లేద‌ని ఆయన పార్టీలో ఉన్నా అసంతృప్తితో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయన వైసీపీను వీడి టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చే విధంగా ఆనం కూతురు నారా లోకేష్‌ను క‌లిశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

కైవల్యా రెడ్డి రాబోయే ఎన్నిక‌ల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆనం వార‌సురాలిగా రాజ‌కీయ ఆరంగ్రేటం చేస్తున్న కైవ‌ల్యా రెడ్డి. నెల్లూరు జిల్లాలో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు పరిచయం అయ్యేందుకు ప్రయత్నాలు ఆరంభించిన‌ట్లు తెలుస్తోంది. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆనం కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నుంచి కైవల్య రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానంపై ఆనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన కుమార్తె టీడీపీలో చేరడం చర్చనీయాంశమైంది.