National

ఆమిర్ ఖాన్ సినిమాల్లో గత 13 సంవత్సరాలలో అతి తక్కువ మొదటి రోజు వసూళ్లు

ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఈ గురువారం థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు భారీ వసూళ్లు మొదటిరోజునే వస్తాయని ఆమిర్ ఖాన్ అండ్ కో అనుకోగా.. అలాంటిదేమీ జరగలేదు. గత 13 సంవత్సరాలలో ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలలో మొదటి రోజు అత్యంత తక్కువగా వసూళ్లు సాధించిన సినిమా ఇదేనని అంటున్నారు. ఆమిర్ సినిమాకు పెద్దగా మంచి రివ్యూలు కూడా రాకపోవడంతో కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద తొలిరోజు కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ 10-11 కోట్లుగా నివేదించబడింది. గత 13 ఏళ్లలో ఆమిర్ ఖాన్ సినిమాల్లో అతి తక్కువ ఓపెనింగ్ ఇదేనని సమాచారం. ఓపెనింగ్ డే సినిమా కలెక్షన్స్ రెండంకెల నంబర్ ను కూడా తాకడం కష్టమేనని అనుకున్నారు.. అయితే సాయంత్రానికి వసూళ్లు కాస్త పుంజుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సినిమా ఢిల్లీ, పంజాబ్‌లలో మంచి వసూళ్లను సాధిస్తున్నప్పటికీ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఘోరంగా విఫలమైంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన 83, ఫర్హాద్ సామ్జీ చిత్రం బచ్చన్ పాండే కంటే ఓపెనింగ్ అధ్వాన్నంగా ఉందనే వాస్తవం కనిపిస్తోంది.

మరోవైపు ఈ ఏడాది భారీ హిట్స్ గా నిలిచిన సినిమాలకు ఈ సినిమా ఓపెనింగ్‌ డేస్‌ కలెక్షన్స్ దగ్గరగా కూడా రాలేదు. హిందీలో ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ డే కలెక్షన్ రూ.20.7 కోట్లు, కేజీఎఫ్ 2 ఓపెనింగ్ డే కలెక్షన్ 53.95 కోట్లుగా ఉన్నాయి. బాలీవుడ్ పండితుల అభిప్రాయం ప్రకారం, ఆమిర్ ఖాన్ సినిమా 30 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ కలిగి ఉండాలి. కానీ 20 కోట్ల కంటే తక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్‌ను సాధించింది లాల్ సింగ్ చద్దా. ఈ వీకెండ్ లోపు సినిమా ఎంత కలెక్షన్స్ ను సాధిస్తుందో చూడాలి.

Related Articles

Back to top button