More

  హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తానంటున్న అమీర్ ఖాన్..!

  బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్.. అనాదిగా వస్తున్న హిందూ ఆచారాలను సంస్కరిస్తాడట..! మన ఆచారాల్లో ఉన్నవన్నీ అనాలోచిత ఆచారాలేనని.. వాటన్నిటినీ సంస్కరిస్తానని.. హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాడు. తాజాగా ఒక కొత్త వాణిజ్య ప్రకటనలో నటించిన ఈ ఖాన్.. సనాతన హైందవ ధర్మంలోని ఆచారాలకు మార్పులు సూచించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఏ ఆచారాల్లోనైనా పెళ్ళికూతురు అప్పగింతల సమయంలో కన్నవాళ్లను వదల్లేక కన్నీరుపెడుతుంది. ఇది ఏ ఆచారమూ చెప్పాల్సిన పనిలేదు. తన సొంత ఇంటిని, తల్లిదండ్రులను, పుట్టిపెరిగిన ఊరిని వదిలివెళ్ళేటప్పుడు మనసున్న ఎవరికైనా భావోద్వేగంతో కన్నీళ్ళు వస్తాయి. అయితే అలా కన్నీళ్ళు రాకూడదట..! అది అనాదిగా వస్తున్న చెడు ఆచారమట..! అంతేకాదు,.. మరో ఆచారానికి కూడా మార్పులు చెప్పాడీ ఖాన్ హీరో. పెళ్లి తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టేటప్పుడు వధూవరుల్లో ముందుగా పెళ్ళి కూతురే తన కుడికాలు పెట్టి ఇంట్లో ప్రవేశిస్తుంది. దీంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించినట్లు హిందువులు భావిస్తారు. అయితే ఇది కూడా తప్పేనట..! ముందుగా అమ్మాయే ఎందుకు కాలు పెట్టాలి..? ముందుగా వరుడు ఎందుకు కాలు పెట్టకూడదు..? అనాదిగా వస్తున్న ఆచారాలను అలాగే ఎందుకు పాటించాలి..? అని ప్రశ్నిస్తూ.. వాటిని తక్షణమే సంస్కరించాల్సిన అవసరముందని కుంటిసాకులు చెబుతూ.. తన వాణిజ్య ప్రకటనను ముగించాడు. ఇదంతా.. A.U. బ్యాంకు రూపొందించిన వాణిజ్య ప్రకటనలో వచ్చింది. ఈ వాణిజ్య ప్రకటన ద్వారా అమీర్ ఖాన్ హిందూ ధర్మంపై విషం చిమ్మాడు అమీర్‎ఖాన్. అసలు సనాతన హిందూ ఆచారాలను సంస్కరించాలని చెప్పడానికి ఈయనకు ఏం హక్కుందో అర్థం కావడం లేదు. అతడు హిందూ ధర్మాన్ని ఆచరించేవాడా అంటే కాదు. పోనీ, ఆయన చెబుతున్నవి దురాచారాలా అంటే అది కూడా కాదు. మరి, అనాదిగా వస్తున్న సంప్రదాయాలను ప్రశ్నించడానికి ఈయనేమైనా సంఘ సంస్కర్తా..?

  ఇప్పుడే కాదు.. గతంలోనూ చాలాసార్లు హిందూ ధర్మంపై, సంస్కృతి, సంప్రదాయాలపై ఇలాగే విషం చిమ్మాడు అమీర్ ఖాన్. సమయం వచ్చిప్పుడల్లా ఇలా అవమానించడం అమీర్ ఖాన్ కు పరిపాటిగా మారింది. చెప్పాలంటే, ఈ విషయంలో అమీర్ ఖాన్ ఆరితేరిపోయాడు. సినిమాల నుండి వాణిజ్యప్రకటనల దాకా ప్రతి చోటా హిందూ వ్యతిరేకతను కనబరుస్తూనే ఉంటాడు. అయితే, హిందూ వ్యతిరేకతను సెక్యులర్ కోణంలో అందంగా వక్రీకరించి.. నొప్పితెలియకుండా నెమ్మదిగా అభిమానుల్లో మెదళ్లలో విషం నింపుతుంటాడు.

  గతంలో పీకే సినిమా ద్వారా ఆయన ప్రదర్శించిన పైత్యం అంతా ఇంతాకాదు. శివుడికి అభిషేకం చేయడంతో పాలు వృధా అయిపోతాయనటం దగ్గర్నుంచి.. సెక్యులర్ ముసుగులో దేవాలయంపై మూత్రవిసర్జన చేసే వరకు హిందూ ధర్మాన్ని దారుణంగా అవమానించాడు. దీంతో పాటు ఆ సినిమాలో హిందూ దేవుళ్ళు కనిపించడం లేదనీ,.. ఎవరికైనా కనపడితే ఆచూకీ తెలపండనీ మిస్సింగ్ పోస్టర్లను ప్రింట్ చేసి ఊరందరికీ పంచాడు. అంతేకాదు, పొట్టకూటికోసం శివుడి వేషం వేసుకున్న ఓ వేషధారిని వెంటపడి వేధిస్తుంటాడు. చివరికి పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లేవరకూ వెంటాడి.. నానా రభసా చేస్తాడు. అయినా సెక్యులరిజం ముసుగులో ఇదంతా కామెడీ కింద కొట్టుకుపోయింది. నిజానిజాలను హిందూ సమాజం అర్థం చేసుకునే లోపే.. హిందువుల సొమ్ముతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టుకొట్టి రికార్డులు బ్రేక్ చేసింది. ఇలా విపరీత పైత్యం ప్రదర్శించే హీరోను కూడా హిందువులు నెత్తికెత్తుకున్నారు. తమ ధర్మాన్ని అవమానిస్తున్నాడంటూ కొంతమంది ధర్నాలు రాస్తారోకోలు చేసినా.. ఈ సెగ అమీర్ ఖాన్ కు ఏమాత్రం తగల్లేదు. కొన్నిరోజులకు హిందువులపైనే కాకుండా ఏకంగా భారత సైన్యాన్ని సైతం తన సినిమాల్లో అవమానించడం మొదలుపెట్టాడు. ఇటీవల తన లాల్ సింగ్ చద్దాలో ధైర్యానికి మారుపేరైన భారత సైనికుడిని కూడా వెర్రిబాగులోడిగా చిత్రీకరించడం అమీర్ ఖాన్‎కే సాధ్యమైంది.

  అయితే ఇలా సైన్యాన్ని అవమానించడం భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం సినిమాల్లోనే అనుకుంటే పొరపాటే. అమీర్ ఖాన్ స్వయంగా భారత్ కు వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు కూడా చేశాడు. ఏకంగా భారత్ లో తమకు స్వేచ్చ లేదంటూ.. తన భార్య తనతో వ్యాఖ్యానించిందనీ.. అప్పట్లో అమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు,.. టర్కీ భారత్‎కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఏ సందర్భం లేకుండా ఏకంగా టర్కీ అధ్యక్షులు ఎర్డోగాన్ తో భేటీ కూడా అయి ఫోటోలు దిగొచ్చాడు. ఈ విధంగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశ ద్రోహానికి పాల్పడిన అమీర్ ఖాన్.. తాజాగా హిందూ ధర్మాన్ని ఉద్దరిస్తానని బయలుదేరాడు. హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారాలను రూపుమాపాలంటూ నీతి వాక్యాలు వల్లించాడు.

  అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఏ మతమైనా పాటించాల్సిందే. కాకపోతే, అది అవతలివారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే దురాచారమై ఉండకూడదు. ఒకవేళ అది దురాచారమైతే తప్పకుండా సంస్కరించాల్సిందే. అప్పగింతల సమయంలో వధువు కన్నీరు పెట్టడం.. అత్తారింట్లో మొదటి అడుగు పెట్టడంలో అమీర్ ఖాన్ కు కనిపించిన దురాచారమేంటో మరి..? భావోద్వేగంతో కంటతడి పెట్టడం.. పెళ్లికూతురు ముందుగా ఇంట్లో కాలు పెడితే అదృష్టమని భావించే సంప్రదాయం.. సదరు నటుడికి దురాచారంలా కన్పించింది. అందుకే అమ్మాయికంటే ముందు తానే కాలుపెట్టాడు. అదేంటో కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఈ హీరోగారిని ఆచారాలు దురాచారాలై వేధిస్తాయి. తాను పుట్టిపెరిగిన మతంలో ఎలాంటి దురాచారాలున్నా ప్రశ్నించే సాహసం చేయలేడీ ఖాన్. అంతేకాదు, తన మతాన్ని ప్రశ్నించేవారికి నీతి బోధలు చేస్తుంటాడు. గతంలో ఓ ఛానెల్ నిర్వహించిన కాంక్లేవ్ లో ఓ వ్యక్తి అమీర్ ఖాన్ కు ఊహించని ప్రశ్న సంధించాడు. ఇస్లాంలో ఉపవాసం తో పాటు రంజాన్ సందర్భంగా భారీ ఎత్తున జంతుబలులు ఇవ్వడం వంటి దురాచారాలపై వివరణ కోరాడు. దీనిపై స్పందించిన అమీర్ ఖాన్ ఎవరి మతాచారాలు వారికి ఉంటాయి. వాటిని మనం ప్రశ్నించకూడదంటూ చిలక పలుకులు పలికాడు. తన మతాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రం.. ఇతరుల మతాలను ప్రశ్నించకూడదన్న అమీర్ ఖాన్,.. హిందువుల మనోభావాలతో మాత్రం ఆటలాడుతుంటాడు. తన సినిమాల్లో దేవాలయంపై కూడా మూత్ర విసర్జన చేసేంత ఉదార స్వభావాన్ని ప్రదర్శిస్తుంటాడు.

  ప్రస్తుతం ఇస్లాంలోని పలు ఆచారాలపై ఇరాన్ లాంటి దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు పోరాడుతున్నా.. సదరు ఖాన్ గారు ఒక్కమాటా మాట్లాడటం లేదు. ఇరాన్ లో మహిళలంతా హిజాబ్ కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. తమ స్వేచ్చను హరించే హిజాబ్ ను నిషేధించాలని ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతున్నారు. ఈ ఉద్యమం కాస్తా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇరాన్ మహిళలకు అండగా నిలుస్తున్నారు. అయితే దీనిపై అమీర్ ఖాన్ మాత్రం ఒక్క మాటకూడా మాట్లాడటం లేదు. తన మతమేదో తనది.. మన మతమసలే పడదోయ్ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తన మతంలో మహిళలు పోరాడుతున్నా.. నోరు మెదపని అమీర్ ఖాన్.. హిందూ ధర్మోద్దరణకు బయలుదేరాడు. వధువు కన్నీరు పెట్టొద్దని.. వరుడే కుడికాలు పెట్టాలని.. నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.

  అయితే, అమీర్ ఖాన్ ఇలాంటి అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా సియట్ టైర్స్ కు చెందిన ఓ ప్రకటనలోనూ ఇదే విధమైన పైత్యాన్ని ప్రదర్శించాడు. అయితే అందులో అమీర్ ఖాన్ తప్పు ఎంతుందో,.. సదరు కంపెనీది కూడా అంతే తప్పుంది. గతంలో ఎన్నో కంపెనీలు ఇటువంటి హిందూ వ్యతిరేక ప్రకటనలను వెలువరిచాయి. సియట్ టైర్స్ విడుదల చేసిన ప్రకటనలో దీపావళి నాడు రోడ్డుకు అడ్డంగా పటాకులు కాలుస్తారంటూ.. ఇదే అమీర్ ఖాన్ తో అడ్వర్టైజ్ మెంట్ ను చిత్రీకరించింది. ఇంకా కొన్ని కంపెనీ యాడ్స్ మరీ దారుణంగా వున్నాయి. బ్రూక్ బాండ్ కంపెనీ అయితే, ముసలి వారైన తల్లిదడ్రులను వదిలించుకోవడానికి కుంభమేళ చాలా బాగా ఉపయోగపడుతుందంటూ విషం చిమ్మింది. తర్వాత తనిష్క్ జువెల్లరీస్ అయితే లవ్ జీహాద్ ను ప్రోత్సహించేలా యాడ్స్ తీసిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

  భారత్ లో అతిపెద్ద బట్టల కంపెనీల్లో ఒకటైన ఫ్యాబ్ ఇండియా దీపావళి షాపింగ్ చేయడానికి కనీసం బొట్టు పెట్టుకోని అమ్మాయిలను తన ప్రకటనల్లో ప్రదర్శించింది. ఇలా ఒక్కటి కాదు దాదాపు పెద్ద పెద్ద కంపెనీలన్నీ హిందూ ఆచారాలను కించపరిచే ప్రకటనల్లో భాగమయ్యాయి. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా A.U. బ్యాంకు కూడా చేరింది. అయితే వీటిలో నటించిన నటీనటులను మనం ఎంత తప్పుబడతామో,.. ఆయా కంపెనీలను కూడా అంతే తప్పుబట్టాల్సిన అవసరముంది. ఇటువంటి ప్రకటనలు వచ్చినప్పుడల్లా ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాల్లో బాయ్ కాట్ ట్రెండ్ విపరీతంగా నడుస్తుంది. దీంతో ఆయా కంపెనీలకు ఉత్తుత్తిగా విపరీత ప్రచారం కూడా వస్తుంది. బాయ్ కాట్ ట్రెండ్ నడిచినంతకాలం వాటిని బహిష్కరించినవారు కొన్ని రోజులాగితే అన్నీ మరిచిపోయి మళ్లీ అవే కంపెనీ వస్తువులే కొంటారనేది ఆయా కంపెనీల స్ట్రాటజీ. ఇందుకోసమే, కంపెనీలు ఇటువంటి విషప్రచారానికి కావాలనే పూనుకుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో బాయ్ కాట్ కూడా కాస్తంత ఎక్కువ ప్రభావమే చూపుతోంది. గతంలో తనిష్క్ కంపెనీకి వ్యతిరేకంగా హిందువులు బాయ్ కాట్ పిలుపునివ్వడంతో కంపెనీ షేర్లు భారీగా డౌన్ అయ్యాయి. ఈ విధంగా అప్పటికప్పుడు కాస్తంత నష్టం కలిగించినా దీర్ఘకాళికంగా వాటికి లాభమే చేకూరుతుంది. అందుకే ఆయా కంపెనీలు ఇప్పటికీ ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి.

  ఇక హిందూ ధర్మాన్ని ఉద్దరిస్తానంటూ వచ్చిన ధర్మోద్ధారకుడు అమీర్ ఖాన్.. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బావుంటుందేమో. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న సామెతను అమీర్ ఖాన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారాలను మారుద్దామనే ఆలోచనను కొద్దిరోజులు పక్కనబెట్టి,.. తన మతాచారాలపై దృష్టిపెడితే మంచిదని ఆయన అభిమానులే చెబుతున్నారు. అమ్మాయిల స్వేచ్చను హరించే హిజాబ్ లాంటి వాటిని నిషేధించాలని ఇస్లాం దేశమైన ఇరాన్ లో మహిళలు చేస్తున్న ఉద్యమాలకు.. కనీస మద్దతు ప్రకటించొచ్చు కదా అని సెలవిస్తున్నారు. బక్రీద్ రోజున వేల జంతువులను కుర్భానీ పేరుతో వధించడాన్ని ముందు అమీర్ ఖాన్ వ్యతిరేకించాలని సలహా ఇస్తున్నారు. మదర్సాల్లో మతతత్వ బోధనలను ఆపి.. తాను చదువుకున్నట్లు సాధారణ స్కూళ్ళలో చదువుకోమని.. భారతీయ ముస్లింలందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఎక్కడో ఎవరో తమ దైవాన్ని కించపరిచారని.. తలలు నరుకుతామంటూ రోడ్లపైకి వచ్చే ముష్కర మూకలకు.. హితబోధ చేయాలని చెబుతున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అమీర్ ఖాన్‎ పేరుమీద ఎలాంటి ఫత్వాలూ, మత బహిష్కరణలూ జరక్కుండా ఉంటే.. అప్పుడు ఎంచక్కా హిందూ ధర్మం గురించి ఆలోచించవచ్చని ఎద్దేవా చేస్తున్నారు.

  Trending Stories

  Related Stories