More

  పంజ్‎షేర్‎లో పాండవుల సంచారం..!
  చారిత్రక ఆధారాలున్నాయా..?

  ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ నిఘంటువులో దౌత్యభాషకు తావులేదు. గాంధార చరిత్రలో విరామచిహ్నానికి ఆస్కారం లేదు. ప్రపంచ దేశాల గూడచార విభాగాల సంచారంతో నిరంతరం క్రిక్కిరిసిపోయి ఉంటుంది ఖురసాన్. జూన్ మాసంలో భిన్న దేశాల రహస్య ఏజెంట్లు కాబూల్, కాందహార్ లో తిష్ఠవేసినట్టూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ ఏడాది జూన్ లోనే ‘‘Spy Agencies Seek New Afghan Allies as U.S. Withdraws’’ అంటూ ప్రత్యేక కథనాన్ని రాసింది. డజనుకుపైగా దేశాల గూఢచారులు సుదీర్ఘ వ్యూహాల ప్రాతిపదికన ‘అనుకూల శక్తుల’ పురమాయింపుకోసం కసరత్తు చేస్తున్నట్టూ ఈ కథనం పేర్కొంది.

  మరోవైపు పంజిషేర్ లోయ తాలిబన్ పదఘట్టనలకు మందుపాతరలతో జవాబు ఇస్తోంది. రెండు లక్షలమంది తాజిక్ తెగ ప్రజల ఆవాసాలపై మర ఫిరంగులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని స్థితి నెలకొంది. ‘పంజిషేర్’ తన చారిత్రక విజయాలను తిరిగి నమోదు చేస్తుందా? ఓటమి పాలవుతుందా అనే ఉత్కంఠ అంతటా వ్యాపించింది. మృగరాజుల కోటలోకి దూరేందుకు తోడేళ్ల మంద మాటువేసింది.

  ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం ఒక ఇస్లామిక్ దేశంలోని ప్రజల గోడు మాత్రమేనా? చారిత్రకంగా ఒకనాటి అఖండభారతంలోని గాంధార రాజ్యంలో తాజా సంక్షోభం అట్టడుగున దాగిన చారిత్రక కారణాలేంటి? రత్నశాస్త్రం వేనోళ్ల పొగిడిన మరకతమణులు నిక్షిప్తమైన హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో పాండవులు ఎందుకు సంచరించినట్టూ? మోక్షమార్గంలో తారసపడిన అందమైన లోయ ఐదుగురు పాండవుల శౌర్యానికి గుర్తుగా ‘ఐదుసింహాల లోయ’గా ఎలా అవతరించింది? అలెగ్జాండర్ దండయాత్ర నాటికి హిందూకుష్ లో పరిస్థితి ఎలా ఉండేది?

  ఉత్కంఠ రేపుతున్న ఆఫ్ఘన్ సంక్షోభ నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం.

  ఆఫ్ఘనిస్థాన్ లో 50వేల ఏళ్లనాటి ప్రాచీన శిలాయుగపు ఆనవాళ్లూ, ఆదిమానవుడి సంచారం తాలూకు అవశేషాలూ దొరికాయి. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్ లో సింధూ నాగరికత తాలూకు పురావస్తు ఆధారాలు ఉండనే ఉన్నాయి.

  రుగ్వేద కాలంలో సువాసనల భూమిగా ప్రాముఖ్యత వహించి, మహాభారత యుద్ధం నాటికి మహాసామ్రాజ్యంగా నిలిచిన గాంధార భూమి క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకప్పటి సుభిక్ష సామ్రాజ్యం ఆధునిక యుగం వచ్చేసరికి అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారింది. స్థిరమైన పాలన లోపించడంతో మతఛాందస మూకలకు నిలయమైంది.

  అశ్వకన్, అస్సాకన్‌ అనే పేరు నుంచి ఆఫ్ఘన్‌ అనే పేరు వచ్చింది.  నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడి ప్రజలు ప్రయాణాలకు గుర్రాలను ఉపయోగించేవారు. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమంగా అఫ్గానిస్తాన్‌గా మారింది. ఇక్కడ పాలన సాగించినవారంతా  తమను తాము ఆఫ్ఘన్లుగానే చెప్పుకున్నారు.  ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ‘ఆఫ్ఘన్’ పదం వర్తిస్తుంది.

  భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు క్రీ.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంత ప్రజల గురించి తన బృహత్సంహితలో ప్రస్తావించాడు.  1919 లో దేశానికి పూర్తి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అధికారికంగా ’ఆఫ్ఘనిస్థాన్‌’ అనే పదాన్ని ప్రామాణికం చేసి 1923లో రాజ్యాంగంలో పొందుపరిచారు.

  సింధు నాగరికత ప్రబలిందనేందుకు షోర్తుగై ప్రాంతంలో తవ్వకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గాంధార రాజ్య పతనానంతరం జొరాష్ట్రియన్‌ మతం బలపడింది. ఆ కాలంలో దీన్ని అరియానా అని పిలిచేవారు. తర్వాత కాలంలో మౌర్యులు, కుషాణులు, మంగోలులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అరబ్బుల దండయాత్రల తర్వాత 1747లో అహ్మద్‌ షా దురానీ కాందహార్‌ రాజధానిగా అఫ్గాన్‌ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. 1776లో రాజధాని కాబూల్‌కు మారింది.  రెండో ఆంగ్లో ఆఫ్ఘన్‌ యుద్ధానంతరం ఈ ప్రాంతం కొంతకాలం బ్రిటీష్‌ పాలనలో ఉంది.

  నిజానికి ఇవ్వాళ్టి ఆఫ్ఘనిస్థాన్ లోని పట్టణాలూ, నగరాలూ, అరణ్యాల పేర్లకు సంబంధించిన Etymological origins పరిశీలిస్తే భారత పురాణ, ఇతిహాసాలకూ గాంధార రాజ్యానికి ఉన్న సంబంధం తెలుస్తుంది.  పాశ్చాత్య నాగరికత ప్రవేశపెట్టిన చరిత్ర రచనా పద్ధతి అనేక చారిత్రక అంశాల నిరూపణకు అవరోధంగా మారింది. ఆధారాల పేరుతో ప్రాచీనతను నిరంతరం తిరస్కరిస్తుంది. లోపభూయిష్టమైన ఆధూనిక చరిత్ర పరిశీలనా పద్ధతికి భిన్నంగా ఎటిమాలిజికల్, మైథాలాజికల్ ఆధారాలతో ఆసక్తికరమైన చరిత్రను రాస్తే అనేక అంశాలు వెలుగుచూస్తాయి.

  బామియాన్ అనేక బౌద్ధారామాలకు నెలవు. ఆధ్యాత్మికత, తాత్వికత కలగలిసిన కళలు విలసిల్లగా.. బామియాన్ కొండల్లో తొలిచిన గుహల్లో బౌద్ధ సన్యాసులు నివసించేవారు. ఆరో శతాబ్దానికి చెందిన అతిపెద్ద బుద్ధ విగ్రహాలను ఈ లోయ సమీపంలోని హజరాజత్ ప్రాంతంలోని ఇసుకరాతి కొండల్లో గాంధార శిల్పకళా పద్ధతిలో చెక్కారు. కుషాణుల కాలానికి చెందిన ఈ శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై శిథిలం కాగా.. బామియాన్‌లోని రెండు పెద్ద విగ్రహాలను 2011లో తాలిబన్లు ధ్వంసం చేశారు.

  బౌద్ధం విషయంలో అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. బుద్ధధర్మ తాత్వికత హైందవానికి మేలు చేసిందా? కీడు చేసిందా అనే విషయంలో చారిత్ర పరిశోధకుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇలాంటి అంశాలపై సుదీర్ఘ మేధో పరిశ్రమ సాగాల్సిందే!

  ఒకప్పుడు అఖండ భారతంలో ఇప్పటి పాకిస్తాన్‌,భారతదేశం , బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లు కలిసి ఉండేవి. అంటే బ్రిటిష్ కు ముందున్న భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి పోయారు. అప్పుడు ఈ దేశాలన్నీ సనాతన ధర్మం ఆచరించాయి. అందుకు సాక్ష్యాలుగా అనేక గుర్తులు ఉన్నాయి.

  కోల్ -ఇ -శివ లేదా వొజేరొ శివ పేరుతో ఓ సరస్సు ఆఫ్ఘనిస్తాన్ లోని తజకిస్థాన్ సరిహద్దుల్లో ఉంది. ఆ నదిని ఇప్పటికీ శివుడి పేరుతోనే పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ , తజకిస్థాన్ సరిహద్దుల్లో 1వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు సనాతన ధర్మం చాలా విస్తృతంగా ఆచరించబడుంది. ప్రాచీన ధార్మిక కుడ్య చిత్రాలు, ఫ్రెస్కో లు ఇప్పటికీ తజకిస్థాన్ , ఉజ్బెకిస్తాన్, ఇరాన్, రష్యా లోని మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ కుడ్య చిత్రాలు పూర్తిగా శివుడి మీద ఆధారపడి గీసినవే.

  పేర్లు మాత్రం అక్కడి స్థానిక భాషలో ఉంటాయి కానీ సనాతన ధర్మాని ఆచరించారు అనే దానికి సజీవ సాక్ష్యాలున్నాయని పురాతత్వ శాస్త్రజ్ఞులు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. తజకిస్థాన్ లో శివాలయాన్ని పాంజకెంట్ దేవాలయం గా పిలిచేవారు. ఇప్పుడున్న దేశాలు ఇప్పుడున్న రీతిలో 2వేల క్రితం ఉనికిలో లేవు. వర్తక, వాణిజ్యం చేసే సొగ్దియన్ల హయాంలోనే కుడ్య చిత్రాలు గీయబడ్డాయి అలాగే శివ సరస్సు ని పేరు వాళ్ళే పెట్టినట్టూ చరిత్రకారులు భావిస్తున్నారు

  సొగ్దియన్లకు చైనాతో పాటు భారత్ తో కూడా బలమయిన బంధముంది.  అందుకె హిందూ ధర్మ సంప్రదాయాలతో పాటు శివుణ్ని కూడా ఆరాధించారు. గోడలపై ఉన్న బొమ్మల్ని చూస్తే ఈ విషయం సులభంగా బోధపడుతుంది. సోగ్దియన్లు శివుడిని వేష్పార్కర్ అని పిలిచేవారని ప్రతీతి.  10 వ శతాబ్దం నుండి ప్రారంభం అయిన ముస్లిం దండయాత్రల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ సహా మధ్య ఆసియా వలస ప్రదేశాల్లో గు వెళ్ళిన ప్రదేశాలలో ఉన్న గుళ్ళు,గోపురాలని నెల మట్టమయ్యాయి. ఈ కారణంగానే సనాతన ధర్మం ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి.  

  తాలిబన్ స్వాధీనం నేపథ్యంలో ఆగస్ట్ 23న ప్రభాత్ మిశ్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. The name Panjshir means “five lions”. The name is related to the five Pandavas from the ancient HinduEpic “Mahabharata”. The Pandavas visited the place during their journey to find “moksha”. అనేది ట్వీట్ సారాంశం. నిజానికి ఇది వారు వికీపీడియా నుంచి సేకరించారు. అయితే ఇలాంటి అంశాలకు సంబంధించి చారిత్రక గ్రంథాల సాయం తీసుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. ఎందుకంటే వెక్కిరించే సమూహం వేచిచూస్తున్నపుడు చారిత్రక అంశాలను ‘వికీపీడియా’ తీసుకోవడం మరిన్ని కుయుక్తులకు ఆస్కారం కల్పించడమే అవుతుంది.

  మహాభారతానికి ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్ కు చారిత్రక బంధమున్నమాట నిజం. మహాభారత యుద్ధంపై నీలేష్ నీలకంఠ ఓక్ రాసిన ‘‘When Did The Mahabharata War Happen? The Mystery of Arundhati’’ లాంటి పరిశోధనా గ్రంథాలు తప్పుడు వ్యాఖ్యానాలను పూర్వపక్షం చేసేందుకు ఉపయోగపడతాయి. ఓక్ పుస్తకాన్ని బేస్ చేసుకుని డురాండ్ లైన్ చరిత్రను పరిశీలిస్తే…కురుక్షేత్ర యుద్ధానికీ, భారతకాలంలోని ఆఫ్ఘనిస్థాన్ కు చారిత్రక బంధాన్ని మరింత సాధికారికంగా రుజువుచేసే అవకాశం ఉంది. నీలకంఠ్ ఓక్ రాసిన పుస్తకంలో కురుక్షేత్ర కాలానికి సంబంధించిన వివరాలను ప్రస్తావిస్తూ ఉత్తర భారతంలోని ‘కురుక్షేత్ర’ ప్రస్తావన చేశారు.

  ఉత్తరభారతంపై పూర్తి అదుపు ఉండాలంటే ‘డురాండ్ లైన్’ ను ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్థాన్ ను విభజించాలని బ్రిటీష్ వలసపాలకులు భావించారు. 2014, ఫిబ్రవరి 21 అర్విన్ రాహీ రాసిన ‘‘Why the Durand Line Matters’’ వ్యాసంలో డురాండ్ చారిత్ర పరిణామాన్ని వివరించారు.

   ’’The British imposed the 2640 km borderline on the Amir of Afghanistan in 1893 in a bid to strengthen the former’s control over the northern parts of India’’ అన్నారు. Nations states ఏర్పాటుకు ముందే భారత్ ఆఫ్ఘన్ల మధ్య విభజన రేఖ గీశారు. ఈ విభజన తర్వాత దేశ విభజనతో పాక్ విడిపోవడం, ఆ తర్వాత ద్వేశ భావన పెరిగిపోవడంతో ఆఫ్ఘన్-భారత్ చారిత్రక బంధంపై అవాకులూ చవాకులూ పేలే మేధో మూకలు పెచ్చరిల్లిపోయాయి. ఆఫ్ఘనిస్థాన్ ఇవ్వాల్టి స్థితికి కూడా కారణాలు చారిత్రకమే అని చెప్పాలి. అలెగ్జాండర్ దండయాత్ర చేసే సమయానికి బౌద్ధం ‘హిందుకుష్’ ప్రాంతంలో బలీయంగా ఉన్నప్పటికీ అంతటా యుద్ధాలే..దుఃఖమే, బాధనే, ఆందోళన, అస్థిరత, ఆకలి తాండవించింది.  వీటి పర్యవసానంగా జరిగిన ఆనాటి యుద్ధాలు, వ్యాపార దోపిడీలు, దొమ్మీలు, వాటిని అంటిపెట్టుకుని ఉండే అవలక్షణాలు అన్నీ యథాతథంగా కొనసాగాయి. ఇవే ఆఫ్ఘన్ చరిత్రను రక్తసిక్తం చేశాయి.

  Trending Stories

  Related Stories