More

  ఆయుధ వ్యాపారం ‘రాబంధుల విందు’.. అగ్రరాజ్యాలకు సవాల్..!

  అమెరికన్ డిఫెన్స్ పరిశోధకులు, స్వతహాగా రచయిత్రులు అయిన Rachel stohl, Suzette grillot లు అంతర్జాతీయ ఆయుధ వ్యాపార తీరుతెన్నులపై ‘‘The International Arms Trade’’ పేరుతో ఆసక్తికరమైన పుస్తకం రాశారు. అందులో భయంకరమైన నిజాలు వెల్లడించారు. దిగ్గజాలు కూడా ఊహించని ఘటనలను ఏకరువు పెట్టారు.           

  ‘‘The International Arms Trade’’ పుస్తకంలోని ఓ భయంకరమైన ఘటనను చెప్పి..అసలు కుట్రల వెనుక నిజాలు చెపుతాను.

  పాలిస్తినా వైద్యుడు, సహా ఐదుగురు బల్గేరియా హెల్త్ కేర్ వర్కర్లకు లిబియా న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అమలుకు కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పసిపిల్లకు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ సోకే ఇంజెక్షన్లు ఇచ్చారన్నది వారిపై మోపిన ప్రధాన అభియోగం. అయితే 2007, జూలై 4న వీరంతా ఫ్రాన్స్ విమానంలో బల్గేరియా విమానాశ్రయంలో హఠాత్తుగా వాలిపోయారు.

  మరణశిక్ష విధింపబడిన వారు ఎలా విడుదలయ్యారన్నది అందరినీ విస్మయానికి గురిచేసింది. యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్ –లిబియాల మధ్య జరిగిన ఓ రహస్య ఆయుధ ఒప్పందం వీరి విడుదలకు ప్రధాన కారణం. హెల్త్ వర్కర్లను లిబియా విడుదల చేసిన వెంటనే ఫ్రాన్స్ 405 మిలియన్ డాలర్ల ఆయుధాలను లిబియాకు అప్పగించింది. అంటే ఆయుధాల ముందు న్యాయసూత్రాలు, తీర్పులూ, సరిహద్దు పరిమితులూ ఎమీ చెల్లవని ఈ ఘటన రుజువు చేసింది.

  భారతదేశంలో రక్షణరంగ విధానంలో ఆయుధ దళారులు ఎలా ప్రవేశిస్తారు? మన రక్షణ విధానాన్ని వెనుకనుండి ఎలా నిర్ణయిస్తారు? యూపీఏ హయాంలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా తన స్నేహితుడు సంజయ్ భండారీకి డసాల్ట్ ఏవియేషన్ కాంట్రాక్ట్ ను ఎలా ఇప్పించాడు?  ఆయుధ ఉత్పత్తిలో భారత్ సాధించిన స్వావలంబన ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న మన దేశం 42 దేశాలకు ఎగుమతి చేసే స్థితికి ఎలా చేరుకుంది?

  2004 నుంచి 2014 వరకూ భారత ఆయుధ దిగుమతి ఏటేటా ఎలా,  ఎందుకు పెరుగుతూ పోయింది? ఎంత పెరిగింది? 2014 తర్వాత గడచిన ఏడేళ్ల కాలంలో ఆయుధ సామాగ్రి దిగుమతి తగ్గి, ఎగుమతులు ఎలా పెరిగాయి? చైనా ఆయుధవ్యాపారానికి ఎందుకు గండి పడింది?

  ఇలాంటి అంశాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను.

  సోనియా గాంధీకి స్వయాన అల్లుడు రాబర్ట్ వాద్రా తన మిత్రుడు, ఆయుధ డీలర్ సంజయ్ భండారీకి డసాల్ట్ ఏవియేషన్ కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం చేసిన ఉదంతం బయటపడటంతో ఆర్మ్స్ డీలర్లకు – కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. దీంతో రక్షణ రంగ రహస్యాలు ప్రైవేటు వ్యక్తులకు తెలిసే అవకాశం ఉందని గతంలో నిపుణులు అభిప్రాయపడ్డారు.

  అంతే కాదు, భారత రక్షణ శాఖ విధాన పరమైన నిర్ణయాలను అనుసరించి ఆయుధ సేకరణ, ఉత్పత్తి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అయితే 2004-2014 వరకూ దేశీయ ఆయుధ ఉత్పత్తి కన్నా విదేశీ ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడటం, దశాబ్దకాలం పాటు ప్రతి ఏటా దిగుమతి వ్యయం పెరగటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల కాలంలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే 2వందల హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 14శాతం ఆయుధ దిగుమతి చేసుకున్న దేశంగా నిలిచింది. చైనా కన్నా మూడు రెట్లు ఎక్కువగా కొనుగోలు చేసింది.

  ఈ కోనుగోళ్లు రక్షణ రంగ నిపుణుల సూచనల మేరకు కాకుండా ఆయుధ డీలర్లు-నేతలూ, వారి బంధుగణం మేలుకోరి చేసినట్లూ కేంద్రం భావించింది. దీంతో సంజయ్ భండారీ-వాద్రా వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.

  అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 2014, మార్చిలో విడుదల చేసిన నివేదికలో ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కన్నా ముందుందని పేర్కొంది.

  ఆ దేశాల కన్నా మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుందనీ, అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని అభిప్రాయపడింది.

  ఈ నివేదిక ప్రకారం… భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానంలో ఉంది.

  భారత్‌కు ఆయుధాల విక్రయంలో అమెరికా రెండో స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అదే కాలంలో పాకిస్థాన్ ఆయుధ సంపత్తిలో 27 శాతం అమెరికానే అందించడం గమనార్హం. అయితే చైనా మాత్రం భారత ఉపఖండంలో ముఖ్యమైన ఆయుధాల విక్రయదారుగా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్ ఆయుధాల దిగుమతుల్లో 54 శాతం, బంగ్లాదేశ్ ఆయుధాల దిగుమతుల్లో 82 శాతం సరఫరా చేసింది.

  మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయుధరంగంలో స్వావలంభన సాధించడం కోసం మేకిన్‌ ఇండియా పథకం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఆయుధ దిగుమతుల నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో గడచిన ఐదేశ్లలో భారత్‌ ఆయుధ దిగుమతులు 33 శాతం తగ్గాయి.

  సాయుధ దళాల ఆధునీకరణకు గడచిన ఐదేళ్లలో 304 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో 190 ఒప్పందాలు దేశీయ సంస్థలతోనే జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. గతేడాది ఆగస్టులో 101 రకాల ఆయుధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న ఏడేళ్లలో దేశీయ ఆయుధ పరిశ్రమలతో కేంద్రం రూ.4 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చు కుంటుందని నిపుణులు అంచనా. వీటిలో ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఆయుధాల విలువ రూ.1.3 లక్షల కోట్లు చొప్పున ఉండగా, నౌకాదళానికి చెందిన ఆయుధాల విలువ రూ. 1.4 లక్షల కోట్లు ఉండనుంది. 

  భారత్‌ ఆయుధ దిగుమతులను తగ్గించుకోవడంతో ఆ ప్రభావం రష్యా మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోందని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన నివేదికలో పేర్కొంది. రష్యా ఆయుధాలపై ఆధార పడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి సంక్లిష్ట నిబంధనల కారణంగానే రష్యా నుంచి భారత్‌ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోయాయని వివరించింది.

  అదే సమయంలో ప్యారిస్‌ నుంచి న్యూఢిల్లీకి ఆయుధ ఎగుమతులు పెరిగాయని పేర్కొంది. భారత్‌ 2019లో రక్షణ రంగానికి 71.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు ఎస్‌ఐపీఆర్‌ఐ 2020 ఏప్రిల్‌లో వెల్లడించింది. దీంతో రక్షణరంగ వ్యయంలో అమెరికా, చైనా తరువాత భారత్‌ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. 

  ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు SIPRI తన తాజా నివేదికలో వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా తన వాటాను 32 నుంచి 37 శాతానికి పెంచుకున్నట్లు తెలిపింది. 2016-20 మధ్య అమెరికా 96 దేశాలకు కీలక ఆయుధాలను ఎగుమతిచేసింది. మొత్తం ఎగుమతుల్లో 47శాతం మధ్య ఆసియా దేశాలకే జరిగాయి.

  అమెరికా ఆయుధ ఎగుమతుల్లో ఒక్క సౌదీ అరేబియా వాటానే 24 శాతం ఉన్నట్లు ఎస్‌ఐపీఆర్‌ఐ పేర్కొంది. అమెరికా ఆయుధ ఎగుమతులు భారీగా వృద్ధి చెందడంతో ప్రధాన పోటీదారు అయిన రష్యాకు అందనంత ఎత్తుకు చేరుకుంది. అదే సమయంలో రష్యా, చైనా ఆయుధ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు ఈ నివేదిక వివరించింది.

  2016-20 మధ్య కాలంలో రష్యా ఆయుధ ఎగుమతులు 20 శాతం వరకు తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం రష్యా నుంచి భారత్‌ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోవడమేనని నివేదిక తెలిపింది. చైనా, అల్జీరియా, ఈజిప్ట్‌ దేశాలకు రష్యా ఆయుధ ఎగుమతులు పెరిగినప్పటికీ భారత్‌లో తగ్గిపోయిన మార్కెట్‌ను అవి పూరించలేకపోయాయి.

  ఈ ఏడాది ఆగస్ట్ లో ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం గడచిన ఏడేళ్లలో భారత్ 35వేల కోట్ల ఆయుధ ఎగుమతులు చేసినట్లు ప్రకటించింది. దాదాపు 42 దేశాలకు భారత్ ఆయుధాలు ఇతర రక్షణరంగ పరికరాలను ఎగుమతి చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్ ల్యాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయిల్, దక్షిణాఫ్రికా, స్విడన్, అజర్ బైజన్, ఈస్టోనియా, ఇండోనేసియా, గినియా, ఫిలిప్పైన్స్ దేశాలకు భారత్ ప్రస్తుతం ఆయుధ ఎగుమతులు ప్రారంభించింది.

  ఆస్ట్రేలియాకు MK N-SS109 క్యాట్రిడ్జులు, అజర్ బైజాన్ కు ప్రొటెక్టిక్ హెడ్ గేర్, ఆర్మోర్ ప్లేట్స్, జర్మనీకి హెల్మట్లు, బాంబ్ సప్రెషన్ బ్లాంకెట్లు, సాఫ్ట్ ఆర్మోర్ ప్యానెల్స్ ను ఎగుమతి చేస్తోంది. నెదర్ ల్యాండ్స్, అమెరికాలకు రాడార్ విడిభాగాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ఎగుమతి చేస్తోంది. సింగపూర్, సౌత్ ఆఫ్రికాలకు డిటోనేటర్లు, నైట్ విజన్ బైనాక్యూలర్లు ఎగుమతి చేస్తోంది. కతార్, లెబనాన్, ఈక్వెడార్, జపాన్, ఈజిప్ట్ దేశాలకు ప్రైమరీలీ బాడీ ప్రొటెక్టింగ్ ఎక్విప్ మెంట్ ను ఎక్స్ పోర్ట్ చేస్తోంది. 

  2011-20 మధ్యకాలంలో భారత ఆయుధ దిగుమతులు 33 శాతం తగ్గితే.. చైనా ఆయుధ ఎగుమతులు 7.8 శాతం తగ్గిపోయాయి. భారత్‌తో పోలిస్తే చైనా రక్షణ విభాగానికి దాదాపు మూడు రెట్లు అధిక నిధులను కేటాయిస్తోంది. వీటితో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన జె-10, జె-10సి, ఎఫ్‌సి-31 లాంటి యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. అయినప్పటికీ గడిచిన రెండు దశాబ్దాల కాలంలో కేవలం 7.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను మాత్రమే చైనా ఎగుమతి చేసింది.

  ఈ ఏడాది జనవరి నుంచి ఆకాశ్ మిసైళ్ల ఎగుమతి కోసం కొత్త ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. క్షిపణుల ఎగుమతి వ్యాపారం ఒక జటిలమైన రంగం. అందులో తొలి అడుగు వేస్తోంది భారత్. ఎన్ని దేశాలు భారత్ నుంచి ఆకాశ్ క్షిపణిని కొనుగోలు చేస్తాయో వేచి చూడాలి.  రక్షణ ఎగుమతుల కోసం చాలా ప్రత్యేకమైన  నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది.  తన క్షిపణులు, ఫిరంగులు, ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లు, తుపాకుల తయారీలో మనదేశం గతంలో నిపుణతను సాధించలేదు.

  ప్రపంచవ్యాప్తంగా యుద్ధం శైలి కూడా వేగంగా మారుతోంది. సంప్రదాయ యుద్ధాల్లో డ్రోన్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. చిన్న చిన్న యూరోపియన్ దేశాలు ఆ దిశగా పనిచేసి ప్రపంచస్థాయి ఎగుమతిదారుగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాయి. సంప్రదాయ ఆయుధాల మార్కెట్‌లో అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ ఆధిపత్యం చూపిస్తున్న సమయంలో భారత్ ఆయుధాల ఎగుమతిలోకి అడుగుపెడుతోంది. భారత్ ఈ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే ఆయా దేశాల తీరు, వ్యూహాత్మక సామర్థ్యం, అనుభవంతో పోటీపడాల్సి ఉంటుంది.

  Trending Stories

  Related Stories