More

  పాక్‎లో అంతర్యుద్ధం..? ఇక పీవోజేకే పూర్తిగా మనదేనా..?

  పాకిస్తాన్‎లో అంతర్యుద్ధం తప్పదా..? ఉగ్రవాద దేశం పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ పదవీకాంక్ష, మరోవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు పీవోజేకే. ఈ మూడు అంశాలు పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అటు ప్రభుత్వానికీ, ఇటు సైన్యానికి ఏకు మేకై కూర్చున్నాడు. తాను మరోసారి పాకిస్తాన్ ను ఏలేందుకు.. ఏం చేసేందుకైనా సిద్ధమయ్యాడు. ఇంతకుముందు తాను దేశంలో సివిల్ వార్ తెస్తానని బహిరంగంగానే హెచ్చరించాడు. ర్యాలీలు పెట్టి మరీ ప్రభుత్వ వ్యతిరేకంగా నినదిస్తున్నాడు. దీంతో ఇమ్రాన్ కు, పాక్ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఇమ్రాన్ కు ముప్పు మొదలైంది. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‎లో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్‎పై ఫైరింగ్ కూడా జరిగింది. కాల్పులు జరిపింది ఎవరో తెలియనప్పటికీ.. ప్రభుత్వ వర్గాలమీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంతో షెహబాజ్ షరీఫ్ కు తలబొప్పి కడుతోంది.

  ఇక ఇమ్రాన్ వ్యవహారానికి తోడు, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో బలూచిస్తాన్ వేర్పాటు వాదం జోరుగా కొనసాగుతోంది. ఇక పీవోజేకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు కూడా పాక్ పై కన్నెర్రజేస్తున్నారు. తమ ప్రాంతాల్లోని సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాకిస్తాన్ కంటే భారత్ లో కలవడమే తమకు మేలని కుండబద్దలు కొడుతున్నారు. ఇవన్నీ చాలదన్నట్టు.. ‘తెహ్రిక్ ఏ తాలిబాన్’ అనే ఉగ్రవాద సంస్థ పాక్‎లో కొన్ని ప్రాంతాలను కలుపుకోవాలని ఎదురుచూస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్ సివిల్ వార్ వస్తే ఏమవుతుందనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ఒకే ఒక్క సివిల్ వార్ ను ఎదుర్కొంది. ఆ సివిల్ వార్ కారణంగా బంగ్లాదేశ్ వేరుపడింది. ఇప్పుడు మరో సివిల్ వార్ గనుక వస్తే పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందోనే చెప్పడం కష్టమేనంటున్నారు విదేశాంగ నిపుణులు.

  పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సవాళ్ళపైన సవాళ్ళను విసురుతున్నాడు. ఇప్పటివరకూ ఉగ్రవాదదేశాన్ని ఏలిన ప్రధానులంతా.. జైలుకెళ్లడమో లేక విదేశాలకు పారిపోవడమో జరిగింది. కానీ, ఇమ్రాన్ ఖాన్ లాగా పాకిస్తాన్ లోనే ఉండిపోయిన ప్రధాని ఒక్కరు కూడా లేరు. అయితే దీనికి ఎన్నో కారణాలున్నాయి. పాకిస్తాన్ లో రాజకీయ వ్యవస్థ ఉన్నా కూడా దేశాన్ని నడిపేది మాత్రం ఆర్మీ, ఐఎస్ఐలే.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అవడానికి పాకిస్తాన్ ఆర్మీనే కారణం. పేరుకే ఎన్నికలు ఉన్నా తెరవెనుక నడిపేది, గెలిపించేది మాత్రం సైన్యమే. అయితే ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ చేసే పనులు పాక్ ఆర్మీకి నచ్చకపోవడంతో అతడ్ని పదవి నుంచి తొలగించింది. పార్లమెంట్ లో అన్ని పార్టీలు అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ను తొలగించినా కూడా తెర వెనుక ప్రయత్నించింది మాత్రం ఆర్మీనే. అయితే ఇంత జరిగినా ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన పదవీకాంక్షను మాత్రం అణచివేసుకోలేకపోయాడు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తాను గెలవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే గత ప్రధానులంతా పాకిస్తాన్ ను వదిలి పారిపోయినా ఇమ్రాన్ ఖాన్ మాత్రం అక్కడే ఉండటానికి ఆర్మీనే కారణం. పాక్ ఆర్మీలో ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ కు సహకరిస్తుండటంతో ఇప్పటికీ పాకిస్తాన్ లోనే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు.

  తరచూ పాకిస్తాన్ లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రభుత్వానికి సవాల్ విసురుతూనే ఉన్నాడు. దీనికి ప్రజల మద్దతును కూడా సేకరిస్తూ ముందుకువెళుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ గతంలో క్రికెటర్ గా ఉన్నప్పుడు పాక్ లో భారీగా అభిమానులు ఉండేవారు. వారి అభిమానంతోనే పీఎం అయిన ఆయన ప్రజల్లో చొచ్చుకువెళుతున్నారు. తరచూ భారీ బహిరంగ సభలను పెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. తనను దించడానికి అమెరికా కుట్ర పన్నుతోందని ప్రజలకు వివరించే ప్రయత్నం బాగానే సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఈ పిలుపుతో షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ప్రజలు పెద్దయెత్తున రోడ్లపైకి వచ్చారు. ఇందులో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీతో పాటు ప్రభుత్వాలపైకి ప్రజలను రెచ్చగొట్టడంతో పాక్ లో సివిల్ వార్ కు కావాల్సిన ప్రజామద్దతు ఉందనే హెచ్చరికలు తరచూ చేస్తూ వచ్చాడు. గతంలో ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ లో ఎన్నికలు నిర్వహించకపోతే పాకిస్తాన్ లో సివిల్ వార్ వస్తుందనే హెచ్చరికలు బహిరంగంగానే చేశాడు. అయితే షెహబాజ్ షరీఫ్ కు ప్రజామద్దతు అంతగా లేకపోవడంతో ఎన్నికలకు సాహసించలేకపోతున్నాడు. దీంతో ఇప్పటికే అంతటా ప్రజామద్దతున్న ఇమ్రాన్ ఏ క్షణంలో అంతర్యుద్దం సృష్టిస్తాడో అనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.

  ఒకవేళ పాకిస్తాన్ లో సివిల్ వార్ కనుక వస్తే ఆ దేశం అథోగతి పాలైనట్టే. ఇప్పటికే వరదలు మిగిల్చిన నష్టం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఈ సివిల్ వార్ ను ఎదుర్కొనేంత శక్తి కనుచూపుమేర కనపడట్లేదు. పాకిస్తాన్ లో సివిల్ వార్ ఏర్పడితే కేవలం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులే కాకుండా దీనికి మరికొన్ని శక్తులు కూడా తోడవుతాయి. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలంటూ పాక్ ఆర్మీపై దాడులు చేస్తోంది. వీరివద్ద పెద్దయెత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా ఉంది. దీంతో పాటు ఇటు భారత్ కూడా సరైన సమయం కనుక వస్తే పీవోజేకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వేచి చూస్తోంది. తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తమ తర్వాతి టార్గెట్ గిల్గిట్, బాల్టిస్తాన్ అని రాజ్ నాథ్ బాహాటంగా చెప్పేశారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే రక్షణ శాఖ కూడా ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం ఒక్కసారి ఆదేశాలొస్తే వెంటనే పీఓజేకేను భారత్ కు అందిస్తామని తెలిపింది. ఒకవేళ పాకిస్తాన్ లో సివిల్ వార్ కనుక వస్తే.. పీవోజేకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్ కు మరింత సులువవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  ఇక భారత్ తో పాటు అటు అఫ్గాన్ నుంచి ‘తెహ్రీక్ ఎ తాలిబాన్’ అనే ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలో కలిపేసుకునేందుకు వేచి చూస్తోంది. దీంతో అది కూడా ఈ సివిల్ వార్ ను పెంచిపోషించే అవకాశం ఉంది. ఈ విధంగా పాకిస్తాన్ పై మూడు సమస్యలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను పాక్ ఆర్మీ కూడా అంత సులభంగా ఎదుర్కొనే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వద్ద, అటు తెహ్రీక్ ఎ తాలిబాన్ వద్ద కూడా ఆయుధాలున్నాయి. దీంతో పాటు పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలు కూడా ఎక్కువే కాబట్టి ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుని పోరాడినా సివిల్ వార్ ను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. వీటికి తోడుగా ఆర్మీలో ఇమ్రాన్ మద్దతుదారులు అతడికి సహకరిస్తే ఇక సివిల్ వార్ ను ఆపడం ఎవరితరమూ కాదు.

  ఈ పరిణామాలన్నీ జరిగితే బలూచిస్తాన్, తో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ లు పాకిస్తాన్ నుంచి విడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇదే జరిగితే ప్రపంచం ముందు పాకిస్తాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం ఖాయం. భౌగోళికంగా బలూచిస్తాన్, గిల్గిట్, బాల్టిస్తాన్ లు సహజ వనరులున్న ప్రాంతాలు కాబట్టి ఇవి పాక్ నుంచి విడిపోతే పాకిస్తాన్ ఆర్థికంగా కూడా చితికిపోయే అవకాశమే ఎక్కువ. అప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగానూచ విస్తీర్ణం పరంగానూ చిన్న దేశమై ప్రపంచం ముందు ప్రభావం కోల్పోతుంది. అప్పుడు ఉగ్రవాదం కంటే ఎక్కువగా తన ఆర్థిక పరిస్థితిపైనే దృష్టిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో భారత్ కు ఉగ్రవాద బెడద కూడా దాదాపు తగ్గపోయే అవకాశాలే ఎక్కువ. మరి ఇన్ని లాభాలున్న సివిల్ వార్ కు ఇమ్రాన్ ఖాన్ నిప్పు వెలిగించడమే తరువాయి.

  Trending Stories

  Related Stories