వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డులను సృష్టించింది. జూన్ 21న అన్ని రాష్ట్రాల్లో 85 లక్షల టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టాక ఇదే రికార్డు. దీంతో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28.7 కోట్ల డోసులు పంపిణీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా.. వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. గతంలో రాష్ట్రాలే టీకాలు సమకూర్చుకోవాలని తెలిపిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తయారీ సంస్థల నుంచి 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. మిగిలిన 25 శాతం టీకాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సార్వత్రిక వ్యాక్సినేషన్ లో భాగంగా జూన్ 21న భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్లను 85 లక్షల మందికి వేశారు. ఇది ఏప్రిల్ 5 న వేసిన 43 లక్షల టీకాల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఈ కొత్త రికార్డుతో ఆగస్టులో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రోజువారీ కోటి టీకాల లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ దూసుకు వెళుతోంది. సెన్సస్ 2011 ప్రొజెక్షన్ ప్రకారం 18 ఏళ్లు పైబడిన 94.02 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. రోజుకు 75 లక్షల మోతాదుల లక్ష్యాన్ని పెట్టుకుని.. భారతదేశం మొత్తం వయోజన జనాభాకు టీకాలు వేయడానికి ఇంకొన్ని రోజులు పట్టనుంది. జూన్ 20 న డేటా ప్రకారం, 22.87 కోట్లు పాక్షికంగా(సింగిల్ డోస్) టీకాలు వేయబడ్డాయి, 5.12 కోట్లు రెండు మోతాదులతో పూర్తిగా టీకాలు వేయబడ్డాయి. అంటే భారతదేశంలో 28 కోట్ల మంది ప్రజలకు పూర్తిగా లేదా పాక్షికంగా టీకాలు వేశారు. అంటే దేశంలో ఇంకా సుమారు 66.02 కోట్ల మందికి టీకాలు వేయాలి. 66.02 కోట్ల మంది ప్రజలకు పాక్షికంగా 66.02 కోట్ల టీకా మోతాదులు అవసరం అవుతాయి. పూర్తిగా రెండు కోవిడ్ టీకాల కోసం 132.04 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు అవసరం అవుతాయి. ఇప్పుడు దేశంలో రోజుకు 75 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు.. మొత్తం వయోజన జనాభాకు పాక్షికంగా టీకాలు వేయడానికి 88 రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు.