ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం

0
809

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పూర్వాంచల్ ఎక్స్‌‌ప్రెస్‌వేపై నారాయణ‌పూర్ గ్రామ సమీపంలో రెండు ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సులు వేగంగా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలో డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వారిని చికిత్స నిమిత్తం లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. “పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. సత్వర సహాయక చర్యలు, క్షతగాత్రులకు సరైన చికిత్స కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేశాం” అని ఆయన ట్వీట్ చేశారు. లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వేగంగా వస్తున్న రెండో బస్సు బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఆసుపత్రిలో బాధితులకు ప్రాథమిక చికిత్స అనంతరం లక్నో ట్రామాకేర్ సెంటర్‌కు తరలించారు.